Liquor Scam: కీలకం ఆ ముగ్గురే
ABN , Publish Date - Aug 11 , 2025 | 02:46 AM
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై మరో అనుబంధ చార్జిషీట్ సిద్ధమైంది.
ముడుపుల రూటింగ్‌లో మాస్టర్ గోవిందప్ప
సిండికేట్ సమావేశాలకు ధనుంజయ్ రెడ్డి
‘అంతిమ లబ్ధిదారు’ సూచనలను ఆ సమావేశాల్లో తెలిపిన కృష్ణమోహన్ రెడ్డి
నేడు లిక్కర్ స్కామ్‌లో సిట్ రెండో చార్జిషీట్
సెప్టెంబరులో మరొకటి దాఖలు చేసే వీలు
అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై మరో అనుబంధ చార్జిషీట్ సిద్ధమైంది. గత నెల 19న మొదటి చార్జిషీట్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్‌లో కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డితో(ఏ-1)పాటు ఆరుగురు నిందితులు, పది సంస్థల పాత్రను ఈ చార్జిషీట్‌లో వివరించింది. మూడువారాల తర్వాత మరో అభియోగ పత్రాన్ని సోమవారం కోర్టుకు సమర్పించనుంది. ముగ్గురు కీలక నిందితుల పాత్రతోపాటు ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి..ఎవరు ఎంత లబ్ధి పొందారు.. అంతిమ లబ్ధిదారుకు చేరడానికి ముందున్న ఆ ముగ్గురు వ్యక్తులు పొందిన వాటా ఎంత...తదితర వివరాలు రెండో చార్జిషీట్‌లో కోర్టుకు వివరించనున్నట్లు తెలిసింది. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు అన్నీ తానై వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, వైఎస్ కుటుంబానికి నమ్మకస్తుడిగా ఉంటూ చాలా కాలంగా జగన్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి,మాజీ సీఎం కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్‌లో శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప పాత్రపై చార్జిషీట్‌లో ప్రస్తావించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో 2019 జూన్ నుంచి 2024 మే వరకూ ధనుంజయ్ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు. ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం పాలసీ రూపకల్పన నుంచి రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ వసూలు చేసిన ముడుపులను అంతిమ లబ్ధిదారుకు చేర్చే వరకూ ఆయన ఏమేం చేశారనే దానిపై వివరించినట్లు సమాచారం. హైదరాబాద్, తాడేపల్లిలో లిక్కర్ సిండికేట్ సమావేశాలకు తరచూ ధనుంజయ్ రెడ్డి హాజరై సమీక్షించేవారని, ముడుపుల సొమ్ములో తన వాటా సొంత కారులోనే తీసుకెళ్లేవారని సిట్ దర్యాప్తులో ఆధారాలు సేకరించింది.
ఆ సొమ్ము బినామీల పేర్లతో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో గుర్తించింది. కృష్ణమోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు సూచనలను సిండికేట్‌కు చేరవేయడం, ముడుపులను తీసుకెళ్లి జాగ్రత్తగా చెప్పిన చోటుకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించారని సిట్ గుర్తించింది. అందులో తన వాటాగా తీసుకున్న సొమ్ముతోపాటు మరింత నొక్కేసి కుమారుడి పేరుతో హైదరాబాద్, బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుసుకుంది. లెక్కలు తారుమారు చేయడంలో దిట్ట అయిన బాలాజీ గోవిందప్ప ముడుపుల సొమ్ము రీరూటింగ్‌లో మాస్టర్ మైండ్‌గా వ్యవహరించారని గుర్తించింది. జగన్‌తోపాటు ఆయన భార్య భారతికి నమ్మిన బంటు అయిన గోవిందప్ప లిక్కర్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించినట్లు అరెస్టు సందర్భంగా సిట్ కోర్టుకు తెలిపింది. మద్యం ముడుపులను అంతిమ లబ్ధిదారు డొల్ల కంపెనీల ద్వారా రూటింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలు డిస్టిలరీల యజమానులు హైదరాబాద్‌లో బాలాజీ గోవిందప్పకు నేరుగా ముడుపులు చెల్లించినట్లు సిట్ విచారణలో తేలింది. దీంతో ఆయన కార్యాలయం, ఇంట్లో సోదాలు చేసి కొన్ని ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు. ఈ వివరాలతోపాటు ఇటీవల హైదరాబాద్ శివారులో గుర్తించి స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల గుట్టు సైతం తాజా చార్జిషీట్‌లో సిట్ వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వచ్చే నెల సిట్ అధికారులు మరో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.