Share News

ACB Court: లిక్కర్‌ కేసు నిందితులకు 18 వరకు రిమాండ్‌ పొడిగింపు

ABN , Publish Date - Sep 13 , 2025 | 06:02 AM

మద్యం కుంభకోణంలో నిందితులకు ఈ నెల 18 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ పొడిగించింది. శుక్రవారం న్యాయాధికారి పి.భాస్కరరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

 ACB Court: లిక్కర్‌ కేసు నిందితులకు 18 వరకు రిమాండ్‌ పొడిగింపు

  • విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు

  • షరతులు ఉల్లంఘించరాదని పైలా దిలీప్‌కు మందలింపు

విజయవాడ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో నిందితులకు ఈ నెల 18 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ పొడిగించింది. శుక్రవారం న్యాయాధికారి పి.భాస్కరరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులకు రిమాండ్‌ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఎంపీ మిథున్‌రెడ్డిని.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్‌ నాయుడు, చాణక్య, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డిని విజయవాడ జిల్లా కారాగారం నుంచి.. గుంటూరు జిల్లా జైలు నుంచి బాలాజీ కుమార్‌ యాదవ్‌, నవీన్‌ కృష్ణను కోర్టులో హాజరుపరిచారు. బెయిల్‌పై ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప హాజరు కాలేదు. వీరిద్దరూ ఆబ్సెంట్‌ పిటిషన్‌ వేశారు. పైలా దిలీప్‌, పి.కృష్ణమోహన్‌రెడ్డి హాజరయ్యారు. కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్‌ బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నాడని సిట్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత స్థలాల విక్రయాలకు ప్రయత్నిస్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత డిసెంబరులో వివాహమైతే, అరెస్టుకు 6నెలల ముందు వివాహమైనట్టు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చాడని తెలిపారు. దానికి సంబంధించిన శుభలేఖను న్యాయాధికారికి అందజేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి చెందిన స్థలాలకు దిలీప్‌ జీపీఏలు చేసుకుని విక్రయాలు చేస్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దిలీప్‌ బెయిల్‌ను రద్దుచేయాలని అభ్యర్థించారు. అలాంటి పనులు చేయవద్దని న్యాయాధికారి భాస్కరరావు దిలీప్‌ను మందలించారు.


మళ్లీ చెవిరెడ్డి హల్‌చల్‌

చెవిరెడ్డి కోర్టు వద్ద మళ్లీ హల్‌చల్‌ చేశారు. జైలుకు తరలించడానికి వాహనం ఎక్కిస్తున్న సమయంలో మీడియాను చూసి గట్టిగా మాట్లాడారు. లిక్కర్‌ కేసుతో తనకు సంబంధం లేదని, ప్రభుత్వం అన్యాయంగా ఇరికించిందన్నారు. ఇంతకుముందు కూడా ఇదేవిధంగా చేయడంతో చెవిరెడ్డిని వర్చువల్‌గా హాజరు పరుస్తామని సిట్‌ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఎలాంటి కేకలు వేయనని చెవిరెడ్డి నుంచి స్వీయధ్రువీకరణ తీసుకున్నారు. అయినా చెవిరెడ్డి కోర్టు ప్రాంగణంలో మరోసారి హడావుడి చేశారు.

ఫోరెన్సిక్‌కు మాజీ మంత్రి నారాయణస్వామి ఫోన్‌

విజయవాడ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ స్కామ్‌ విచారణలో భాగంగా మాజీ మంత్రి నారాయణస్వామి మొబైల్‌ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపేందుకు శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ మంత్రిగా పనిచేశారు. మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా కొద్దిరోజుల క్రితం సిట్‌ అధికారులు ఆయనను చిత్తూరు జిల్లాలో ఇంటి వద్ద విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారాన్ని వాంగ్మూలంగా నమోదు చేసుకుని సదరు ఫోన్‌ను సీజ్‌ చేశారు.

విశాఖలో ముగిసిన సోదాలు

విశాఖపట్నంలో సిట్‌ అధికారుల సోదాలు శుక్రవారం ముగిశాయి. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ అధికారులు గురువారం విశాఖ వచ్చిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ వ్యక్తిగత సహాయకుడు నర్రెడ్డి సునీల్‌రెడ్డికి చెందిన రెండు కార్యాలయాల్లో (వెర్ట్‌ లైఫ్‌ బంకర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గ్రీన్‌ఫీల్డ్స్‌) సోదాలు చేశారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకూ రికార్డులు, రిజిస్టర్లు, కంప్యూటర్లు, లాప్‌ట్యాప్‌లు అన్నీ పరిశీలించారు. నాలుగు పెట్టెల్లో వాటిలోని కీలక సమాచారం తీసుకువెళ్లినట్టు తెలిసింది.

Updated Date - Sep 13 , 2025 | 06:07 AM