liquor scam: అవన్నీ నాకెలా తెలుస్తాయి
ABN , Publish Date - May 03 , 2025 | 05:20 AM
వైసీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి విచారణకు సహకరించకపోవడంతో సిట్ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడిగిన ప్రశ్నలకు తప్పుదోవ పట్టే సమాధానాలిస్తుండగా, మరొక నిందితుడు చైతన్యను కూడా కస్టడీలోకి తీసుకున్నారు.
మాకెన్నో లావాదేవీలు.. అవన్నీ ఆడిటర్లు చూసుకుంటారు
మద్యం స్కాంతో సంబంధం లేదు... ‘సిట్’ కస్టడీలో రాజ్ కసిరెడ్డి
అమరావతి/విజయవాడ, మే 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి దర్యాప్తు అధికారులకు సహకరించడం లేదని తెలిసింది. లిక్కర్ పాలసీ రూపకల్పన మొదలుకొని ఏది ఎలా చేయాలనే దానిపై ఏడంచెల వ్యవస్థ రూపొందించుకుని అమలు చేసిన ఆయన.. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కస్టడీలో నోరు విప్పడం లేదు. ఏదడిగినా దాటవేయడం.. లేదంటే అడ్డగోలు సమాధానాలు ఇస్తున్నట్లు సమాచారం. కుంభకోణంతో తనకు సంబంధం లేదని వాదించారు. సిట్ అధికారులు పలు ఆధారాలు ఆయన ముందుంచడంతో.. ‘వ్యాపారాలు చేసుకునే మాకు ఎన్నో లావాదేవీలు ఉంటాయి.. అవన్నీ మా ఆడిటర్లు చూసుకుంటారు.. నాకెలా తెలుస్తాయు’ అని అడ్డగోలు వాదనకు దిగినట్లు తెలిసింది. కోర్టు ఆయన్ను ఏడు రోజులు కస్టడీకి ఇవ్వగా మొదటి రోజు ఏ మాత్రం సహకరించలేదని సిట్ అధికారులు సీఐడీ పెద్దలకు సమాచారం ఇచ్చారు. దీంతో రెండో రోజు ఎలా విచారించాలో వారు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. ఇదే కేసులో మరో నిందితుడైన చైతన్యను శనివారం కస్టడీకి తీసుకుని అవసరమైతే కసిరెడ్డితో కలిపి.. లేదంటే వేర్వేరుగా విచారించే అవకాశముంది. అంతకుముందు శుక్రవారం ఉదయం సిట్ అధికారులు కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. సాయంత్రం ఆరు గంటల వరకు విచారించిన అనంతరం మళ్లీ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి జైలులో అప్పగించారు.
ఇవి కూడా చదవండి..