Share News

ACB Court: మద్యం కేసు నిందితులకు మాండ్‌ పొడిగింపు

ABN , Publish Date - Oct 07 , 2025 | 05:35 AM

మద్యం కుంభకోణంలో విజయవాడ, గుంటూరు జిల్లా జైళ్లలో ఉన్న ఏడుగురు నిందితులకు ఏసీబీ కోర్టు ఈనెల 13 వరకు రిమాండ్‌ను పొడిగించింది.

ACB Court: మద్యం కేసు నిందితులకు మాండ్‌ పొడిగింపు

  • కోర్టు హాల్లో వీడియోలు తీసిన చెవిరెడ్డి అనుచరులు

విజయవాడ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో విజయవాడ, గుంటూరు జిల్లా జైళ్లలో ఉన్న ఏడుగురు నిందితులకు ఏసీబీ కోర్టు ఈనెల 13 వరకు రిమాండ్‌ను పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్‌ నాయుడు, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బూనేటి చాణక్యతో పాటు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న బాలాజీ కుమార్‌ యాదవ్‌, నవీన్‌కృష్ణలను పోలీసులు ఏసీబీ కోర్టులో సోమవారం హాజరు పరిచారు. వారికి రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో బెయిల్‌ పొందిన ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, మాజీ ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, పైలా దిలీప్‌, బాలాజీ గోవిందప్ప కోర్టు వాయిదాకు హాజరయ్యారు. బెయిల్‌ పొందిన నిందితులకు వాయిదాల నుంచి మినహాయింపు ఇవ్వాలని వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్‌ షరతులను సడలించాలని న్యాయవాదులు కోరగా.. పిటిషన్‌ దాఖలు చేయాలని న్యాయాధికారి ఆదేశించారు. కోర్టు హాలులో చెవిరెడ్డి ఫొటోలు, వీడియోలు తీస్తుండటాన్ని గమనించిన సిట్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌నాయక్‌ ఓ యువకుడి వద్ద సెల్‌ఫోన్‌ లాక్కుని వీడియోలు, ఫొటోలు తొలగించారు.


పాస్‌పోర్టు ఇప్పించండి

సిట్‌ అధికారులు సీజ్‌ చేసిన తన పాస్‌పోర్టును తిరిగి ఇప్పించాలని ఎంపీ మిథున్‌రెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అమెరికాకు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం కొంతమంది ఎంపీల బృందాన్ని ఎంపిక చేసిందని, అందులో తానూ ఉన్నందువల్ల పాస్‌పోర్టు అవసరం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా తనపై సిట్‌ అధికారులు జారీచేసిన లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశం బెయిల్‌ షరతుల్లో ఉన్నందున దీనిపై పిటిషన్‌ దాఖలు చేయాలని న్యాయాధికారి ఆదేశించారు. తదుపరి విచారణను 8వ తేదీకి వాయిదా వేశారు.

చెవిరెడ్డి ప్రాసిక్యూషన్‌కు స్పీకర్‌ అనుమతి

మద్యం స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ప్రాసిక్యూట్‌ చేయడానికి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అనుమతి ఇచ్చారు. చెవిరెడ్డి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినా.. కుంభకోణం జరిగిన సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అవినీతి కేసుల్లో ప్రజాప్రతినిధులను ప్రాసిక్యూట్‌ చేయడానికి స్పీకర్‌ అనుమతి తప్పనిసరి. దీనికి సంబంధించి కొద్దిరోజుల క్రితం సిట్‌ అధికారులు స్పీకర్‌కు లేఖ రాశారు. ఆయన అనుమతి ఇవ్వడంతో ఆ కాగితాలను కోర్టుకు నివేదించారు.

Updated Date - Oct 07 , 2025 | 05:36 AM