Excise Department: మద్యం అమ్మకాలు డౌన్
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:05 AM
పెరగడమే తప్ప తగ్గడం తెలియని మద్యం విక్రయాలు ఈసారి భారీగా తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబరులో రూ. 2,517 కోట్ల మద్యం విక్రయాలు జరగగా... అక్టోబరులో 2,418 కోట్లకు పరిమితమయ్యాయి.
బెల్టు షాపులపై ఉక్కుపాదం
లైసెన్సీ దుకాణాలకే విక్రయాలు పరిమితం
అక్టోబరులో తగ్గిన మద్యం విక్రయాలు
సెప్టెంబరు కన్నా రూ.99 కోట్లు తక్కువ
గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఏకంగా 430 కోట్లు తగ్గిన అమ్మకాలు
కొన్ని జిల్లాల్లో 25 శాతం పైగా తగ్గుదల
నాటుసారా, నాన్‌డ్యూటీ, మత్తుపదార్థాలు
ఏమైనా ఉన్నాయేమోననే అనుమానాలు
మద్యం విక్రయాలు భారీగా తగ్గాయి. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతుండటంతో... అమ్మకాలు అధికారిక దుకాణాలకే పరిమితమయ్యాయి. విక్రయాలు తగ్గడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. అయితే... ఐదు జిల్లాల్లో ఏకంగా 25 శాతం పడిపోయాయి. దీనికి కారణాలపై ఎక్సైజ్ శాఖలో విశ్లేషణ జరుగుతోంది.
(అమరావతి- ఆంధ్రజ్యోతి)
పెరగడమే తప్ప తగ్గడం తెలియని మద్యం విక్రయాలు ఈసారి భారీగా తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబరులో రూ. 2,517 కోట్ల మద్యం విక్రయాలు జరగగా... అక్టోబరులో 2,418 కోట్లకు పరిమితమయ్యాయి. అంటే, రూ.99 కోట్ల మేర అమ్మకాలు తగ్గాయి. బెల్టు షాపులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అనధికారికంగా ఎక్కడ మద్యం విక్రయిస్తున్నా నిఘా పెట్టి చర్యలు తీసుకుంటోంది. విక్రయాలు తగ్గడానికి కారణం ఇదే అని భావిస్తున్నారు. ఇక... గత ఏడాది అక్టోబరుతో పోల్చితే, ఈసారిఏకంగా రూ. 430 కోట్లు తగ్గడం గమనార్హం. కాగా గతేడాది అక్టోబరులోనే నూతన మద్యం షాపుల పాలసీ అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో కొత్తగా షాపులు ఏర్పాటుచేసుకున్న మద్యం వ్యాపారులు భారీగా మద్యం దిగుమతి చేసుకున్నారు. దాంతో గతేడాది అక్టోబరులో అమ్మకాలు భారీగా నమోదయ్యాయనే వాదన వినిపిస్తోంది. అయితే మొత్తం 26 జిల్లాల్లో అమ్మకాల్లో నాలుగు జిల్లాల్లో మాత్రమే వృద్ధి నమోదైంది. 25 శాతానికి పైగా అమ్మకాలు తగ్గిన జిల్లాలపై అధికారులు దృష్టిపెట్టారు. అక్కడ నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఇతర మత్తు పదార్థాలు ఏవైనా ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఒకప్పుడు బెల్టులు వ్యవస్థీకృతంగా ఉండేవి.
లైసెన్స్ షాపుల తరహాలోనే కనిపించేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటికి చెక్ పెట్టింది. అయితే రహస్యంగా బెల్టులు అక్కడక్కడా కొనసాగుతున్నాయి. చాలావరకు లైసెన్సీలే వారి పరిధిలో కొన్ని బెల్టు షాపులు ఏర్పాటుచేసుకుని వాటి ద్వారా ఆ షాపు మద్యం అమ్ముతున్నారు. ఇందులో నకిలీ మద్యం వ్యవహారం లేదు. అయితే నకిలీ మద్యం వెలుగులోకి వచ్చాక ముఖ్యమంత్రి ఆదేశాలతో బెల్టులపై ఎక్సైజ్ శాఖ మరింత నిఘా పెట్టింది. ఎక్కడైనా బెల్టులో నకిలీ మద్యం దొరికినా సమీపంలోని మద్యం షాపు బాధ్యత అన్నట్టుగా చర్యలకు దిగింది. దీంతో లైసెన్సీలు షాపులకే పరిమితమవుతున్నారు. అలాగే ఎక్సైజ్ నిఘా ఫలితంగా మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి. ఇక కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల సీజన్ కావడంతో రానున్న రెండు నెలలు మద్యం అమ్మకాలు ఇంకా తగ్గిపోతాయని అంచనా వేస్తున్నారు.
నాటుసారాపై ఆందోళన
బెల్టులపై కఠిన వైఖరితో నాటుసారా ఆందోళన ఎక్సైజ్‌లో పెరుగుతోంది. మద్యం అందుబాటులో లేనప్పుడు నాటుసారా పెరుగుతుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు మద్యం లేకపోతే నాటుసారాకు మొగ్గుతారు. ఇప్పుడు బెల్టుల కనుమరుగుతో మళ్లీ నాటుసారా పెరుగుతుందేమోనని ఎక్సైజ్‌వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అమ్మకాలు ఇలా
లిక్కర్ కేసుల అమ్మకాలు 2024 అక్టోబరులో 34.13 లక్షలు జరిగితే, ఈ ఏడాది అక్టోబరులో 33 లక్షలే అమ్ముడయ్యాయి. గతేడాది అక్టోబరులో బీరు 11.34లక్షల కేసులు అమ్మితే, ఇప్పుడు 16.21లక్షల కేసులు విక్రయించారు. బీరు అమ్మకాలు పెరిగినా విలువ పరంగా తక్కువ కావడంతో మొత్తంగా అమ్మకాలు తగ్గినట్లైంది. గతేడాది అక్టోబరుతో పోలిస్తే 15 శాతం అమ్మకాలు తగ్గాయి. శ్రీసత్యసాయి, చిత్తూరు, కర్నూలు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మాత్రం అమ్మకాలు పెరిగాయి. పశ్చిమగోదావరిలో 34.4శాతం, విజయనగరంలో 33.1శాతం, పార్వతీపురం మన్యంలో 30.6శాతం, శ్రీకాకుళంలో 28.4 శాతం, నెల్లూరులో 25.7శాతం అమ్మకాలు పడిపోయాయి. వీటితో పాటు ప్రకాశంలో 23.1శాతం, కృష్ణాలో 21.5శాతం అమ్మకాలు తగ్గాయి. బాపట్లలో 18.2శాతం, కడపలో 17.5శాతం, విశాఖపట్నంలో 17.3శాతం, కోనసీమలో 17.3శాతం, నంద్యాలలో 16.5శాతం, అనకాపల్లిలో 15శాతం అమ్మకాలు తగ్గాయి.
చంద్రశేఖర్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం
ములకలచెరువు నకిలీ మద్యం వ్యవహారంలో కడప జిల్లా ఎక్సైజ్ ఏసీ చంద్రశేఖర్‌రెడ్డిపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నకిలీ మద్యం పట్టుబడితే ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ప్రెస్‌మీట్ పెట్టడం ఏంటని ఏసీని నిలదీశారు. ‘నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా?’ అని ఓ ఉన్నతాధికారులు అన్నట్టు తెలిసింది.
ఆ జిల్లాల్లో ఎందుకు తగ్గింది?
ఐదు జిల్లాల్లో ఒకేసారి 25 శాతానికి పైగా మద్యం అమ్మకాలు పడిపోవడంపై ఎక్సైజ్‌శాఖ దృష్టి పెట్టింది. అంత పెద్దమొత్తంలో అమ్మకాలు తగ్గాయంటే అక్కడ నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఇతర మత్తు పదార్థాలు ఏవైనా ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీస్తోంది. బుధవారం మంగళగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి ఎక్సైజ్ సమీక్షలోనూ దీనిపై ప్రధానంగా చర్చ జరిగింది. ఆ జిల్లాల్లో స్టేషన్ల వారీగా అమ్మకాల వివరాలివ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ జిల్లాల పనితీరు అస్సలు బాగాలేదని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నాటుసారా నియంత్రణలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలు బాధ్యతారాహితంగా వ్యవహరిస్తున్నాయని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ అన్నారు. దీంతో నాటుసారా, గంజాయి వల్లే మద్యం అమ్మకాలు తగ్గాయా? అనే అనుమానాలు వస్తున్నాయి.