Share News

ACB Court: మద్యం కేసు నిందితులకు 22 వరకు రిమాండ్‌ పొడిగింపు

ABN , Publish Date - Jul 16 , 2025 | 05:16 AM

మద్యం కుంభకోణం కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న 11 మంది నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది.

ACB Court:  మద్యం కేసు నిందితులకు 22 వరకు రిమాండ్‌ పొడిగింపు

  • ఆదేశాలిచ్చిన ఏసీబీ కోర్టు.. చెవిరెడ్డి బెయిల్‌పై విచారణ వాయిదా

విజయవాడ, జూలై 15(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న 11 మంది నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. జైలు నుంచి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్‌, చాణక్య, పి.కృష్ణమోహన్‌రెడ్డి, కె.ధనుంజయ్‌రెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బాలాజీ యాదవ్‌, నవీన్‌ కృష్ణ, చెరుకూరి వెంకటేశ్‌ నాయుడును వర్చువల్‌గా న్యాయాధికారి ఎదుట మంగళవారం హాజరుపరిచారు. వారికి 22వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్టు న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశాలు ఇచ్చారు. వచ్చే వాయిదాకు నిందితులను భౌతికంగా కోర్టులో హాజరుపరిచేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది. ఆయన పిటిషన్‌పై డిఫెన్స్‌ వాదనలు మంగళవారం పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్‌ తరఫున వాదనలను కోర్టు వినాల్సి ఉంది. ఇక చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పీఏలు బాలాజీ యాదవ్‌, నవీన్‌ కృష్ణ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు 18వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - Jul 16 , 2025 | 05:20 AM