Lightning Strikes Petrol Filtering Tank: పెట్రోల్ ఫిల్టరింగ్ ట్యాంకుపై పిడుగు
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:45 AM
విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డు సమీపంలోని ఈస్టిండియా పెట్రోలియం లిమిటెడ్ ఈఐపీఎల్ లో పిడుగు పడింది...
విశాఖలో ఘటన.. 80 మందికి త్రుటిలో తప్పిన ప్రమాదం
మల్కాపురం(విశాఖపట్నం), సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డు సమీపంలోని ఈస్టిండియా పెట్రోలియం లిమిటెడ్(ఈఐపీఎల్)లో పిడుగు పడింది. 124వ నంబరు మిథనాల్ ఆయిల్(పెట్రోలియం ఫిల్టరిం గ్) ట్యాంకుపై పిడుగు పడటంతో భారీగా మం టలు చెలరేగాయి. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ట్యాంకు పరిసర ప్రాంతాల్లో సుమారు 80 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించిందని కంపెనీ అధికార వర్గాల అంచ నా. విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బులెటిన్ విడుదల చేసింది. ఆ వెంటనే ఈఐపీఎల్‌లోని పెట్రోలియం ఫిల్టరింగ్ ట్యాంకుపై పెద్ద పిడుగు పడిం ది. పిడుగు ధాటికి ట్యాంకు పైకప్పు ఊడి, కింద పడింది. వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో ఉద్యోగులు, కార్మికులు షాక్‌కు గురయ్యారు. ఆ సమయంలో ట్యాంకు వద్ద కార్మికులు ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది. ఆ ట్యాంకుకు ఆనుకుని మరికొన్ని మిథనాల్‌ట్యాంకులు, డీజల్ ట్యాంక్‌లు ఉన్నాయి. మంటలు పక్కనున్న ట్యాంకులకు వ్యాపించకుండా అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది 50 వరకు అగ్నిమాపక శకటాలతోపాటు ఫోమ్‌ను ఉపయోగించి దాదాపు 8 గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పిడుగు పడిన ట్యాంకులో పెద్ద మొత్తంలో మిథనాల్ ఆయిల్ ఉంది. దీనికి వేగంగా మండే గుణం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా, భారత పెట్రోలియం రిఫైనరీ, హెచ్‌పీసీఎల్ ఎల్‌పీజీ ప్లాంట్, అదనపు స్టోరేజీ ట్యాంకులున్న ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఈఐపీఎల్ లో పిడుగు ధాటికి మంటలు చెలరేగడంతో విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కంపెనీ 1994లో ఇక్కడ పెట్రోలియం రిఫైనరీ ప్లాంటును నిర్మించింది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రభుత్వ విప్ పి.గణబాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హార్బర్ ఏసీపీ కాళిదాస్ సహాయక చర్యలను పర్యవేక్షించారు.