Share News

BJP State President Madhav: అందరి జీవితాల్లో వెలుగులు నింపుతాం

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:17 AM

రాష్ట్ర అభివృద్ధితో పాటు అందరి జీవితాల్లో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పేర్కొన్నారు.

BJP State President Madhav: అందరి జీవితాల్లో వెలుగులు నింపుతాం

  • మోదీ సహకారం.. బాబు అనుభవంతో పురోభివృద్ధి

  • వైసీపీ ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని కూటమి నిర్మిస్తోంది

  • సీమకు జలాలు, అద్భుతమైన అమరావతి మా లక్ష్యాలు

  • రెండేళ్లలో పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ వెల్లడి

అనంతపురం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధితో పాటు అందరి జీవితాల్లో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తోన్న సహకారం.. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపిస్తున్నాయని కొనియాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందని, తిరిగి కూటమి పాలనలో నిర్మించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. అనంతపురంలో బుధవారం నిర్వహించిన ‘సూపర్‌ సిక్స్‌-సూపర్‌ హిట్‌’ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వ అవినీతి, అరాచకాలకు చెక్‌ పెట్టి ఎన్డీఏ కూటమిపై మీరు పెట్టుకున్ని నమ్మకం, విశ్వాసానికి ప్రతిరూపమే సూపర్‌ సిక్స్‌’ అన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఎన్నో సిక్స్‌లు కొట్టామని.. అభివృద్ధి, సంక్షేమంతో పాటు సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం డబులింజన్‌ సర్కార్‌ కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతికి, మన జీవనాడి పోలవరానికి వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తోన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమలు, ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రూ.9.70 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దాంతో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతోన్న సంస్కరణల్లో భాగంగా రెండు శ్లాబుల జీఎ్‌సటీతో రైతులు, మధ్య తరగతి, చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరుతోందన్నారు.


స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, మన చేనేతల ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఉత్తరాంధ్రలో స్టీల్‌ ప్లాంట్‌కు ఊతం మొదలుకొని రాయలసీమలో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటు వరకూ పరిశ్రమలకు డబులింజన్‌ సర్కారు ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఐక్యత వర్ధిల్లుతుందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, అరాచకాలతో పాటు అమ్మభాషను సైతం గత ప్రభుత్వం బతకనివ్వలేదని, మాతృ భాషను బతికించే ప్రయత్నం కూటమి చేస్తోందని తెలిపారు. రెండేళ్లలో పోలవరం నిర్మాణం పూర్తి చేయడం, అద్భుతమైన రాజధాని అమరావతిని నిర్మించడం, సీమకు జలాలు అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యాలని స్పష్టం చేశారు.

Updated Date - Sep 11 , 2025 | 04:18 AM