తెలుగుభాషకు వెలుగు.. సీపీ బ్రౌన్
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:53 PM
దేశభాషలెందు.. తెలుగులెస్స అన్నారు మన శ్రీకృష్ణదేవరాయలు. తెలుగుభాషలో వున్న మాధుర్యం, మమకారం, ఆనందం మరే ఏ ఇతర భాషలో లేవని ఎందరో తెలుగు భాషను కీర్తించారు.
తెలుగు సాహిత్యానికి విశేష సేవలు
- నేడు సీపీ బ్రౌన్ వర్ధంతి
ఆత్మకూరు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): దేశభాషలెందు.. తెలుగులెస్స అన్నారు మన శ్రీకృష్ణదేవరాయలు. తెలుగుభాషలో వున్న మాధుర్యం, మమకారం, ఆనందం మరే ఏ ఇతర భాషలో లేవని ఎందరో తెలుగు భాషను కీర్తించారు. అలాంటి తెలుగుభాషకు నేడు ఆదరణ కరువవుతోంది. ఆంగ్ల భాష తెలుగు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో మాతృభాషాభినం తగ్గిపోవడంతో ప్రస్తుతం మన సమాజంలో తెలుగుభాషకు ఆదరణ తగ్గుతోంది. అయితే తెలుగుభాషలోని మాఽధుర్యాన్ని మనం గుర్తించకపోయినప్పటికీ ఓ ఆంగ్లేయుడు తెలుగుభాషపై మక్కువ పెంచుకున్నాడు. ఏ భాషలో లేనంత మమకారం, మాధుర్యం తెలుగుభాషలో మిలితమవ్వడంతో తెలుగు భాషాభివృద్ధికి విశేష సేవలందించారు. వాస్తవానికి తెలుగు ప్రజలు జీవితంలో మరచిపోలేని విధంగా నలుగురు ఆంగ్లేయులు తెలుగుజాతికి సేవలందించారు. వారిలో ఆర్థర్‌కాటన్, కాలిన్‌మెకెంజీ, థామ్‌సమన్రోలు తెలుగు ప్రజలకు వ్యవసాయ రంగంలో తమదైన శైలిలో సేవలందించగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్(సీపీబ్రౌన్) ఆంధ్ర భాషోద్ధారణకు చిరస్మరణీయమైన సహకారాన్ని అందించారు. అనేక ప్రాచీన రచనలను తెలుగులోకి అనువదించి తెలుగు భాషా ప్రాముఖ్యతను ఖండాంతరాలకు విస్తరింపజేసి మాతృభాషను మరుస్తున్న తెలుగుజాతికి ఆదర్శంగా నిలిచారు. శుక్రవారం సీపీ బ్రౌన్ వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
సీపీబ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో ఆల్డిన్‌డేవిడ్‌బ్రౌన్, కౌలే దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణాంతరం బ్రౌన్ కుటుంబం ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయింది. ఆ తర్వాత 1817 ఆగష్టు 4న మద్రాసులో ఈస్ట్‌ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రా్‌సలో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాధమిక జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. 1820 ఆగష్టులో కడప డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినప్పుడు తెలుగులో మాట్లాడటం తప్పనిసరి అయింది. దీంతో ఆయన ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికి అర్థమయ్యేలా పరిష్కరించి ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు ఏర్పడటానికి దారితీసింది. మచిలిపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునల్వేరి మొదలైన చోట్ల పనిచేసిన బ్రౌన్ 1826లో మళ్లీ కడపకు వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. అక్కడ ఒక బంగ్లాను కొనుగోలు చేసి సొంత డబ్బుతో పండితులను నియమించి అందులో తన సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగించాడు. బ్రౌన్ కడప, మచిలిపట్నంలోనూ పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచితంగా చదువు చెప్పించేవారు. ధానధర్మాలు విరివిగా చేసేవారు. వికలాంగులకు సాయం చేసేవారు. నెలనెల పండితులకు ఇచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌన్ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. అప్పులు కూడా చేశారు. 1834లో ఉద్యోగం నుంచి తొలగించడంతో ఇంగ్లాండ్‌కు వెళ్లి పోయి తిరిగి 1837లో కంపెనీలో పర్షియన్ అనువాదకుడిగా ఇండియాకు వచ్చారు. బ్రౌన్ మానవతావాది. 1832-33 గుంటూరుకు డొక్కల కరువు వచ్చిన సమయంలో కరువు పరిహారం తక్కువగా రాయాలని ఉన్నతాధికారులు చెప్పినా.. పట్టించుకోకుండా తెలుగు ప్రజలకు మేలు చేశారు. పదవీ విరమణ తర్వాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12న మృతిచెందారు.
తెలుగు సరస్వతికి వన్నెతెచ్చిన మహనీయుడు సీపీబ్రౌన్ : కమతం శంకర్, రిటైర్డు ఉపాధ్యాయులు, ఆత్మకూరు.
తెలుగు సరస్వతికి చక్కనైన వన్నెలద్దిన మహనీయుడు సీపీబ్రౌన్. ఆంగ్లేయుడైనప్పటికీ తెలుగు భాషలోని మాధుర్యాన్ని గుర్తించి భాషాభివృద్ధికి బాటలు వేసిన గొప్పవ్యక్తి. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. తెలుగుభాషకు ఆయన చేసిన సేవలు కలకాలం స్మరిస్తూనే ఉంటాము.
మాతృభాషను విస్మరించకూడదు
-వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, ఆత్మకూరు.
మాతృభాషను ఎవరూ విస్మరించకూడదు. పాశ్చాత్యపోకడలతో నేటి సమాజంలో తల్లి లాంటి తెలుగుభాషపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆంగ్లభాషపై మక్కువగా పెంచుకున్నప్పటికీ తెలుగుభాషను కూడా అదే స్థాయిలో ఆదరించాలి. ఆంగ్లేయుడైనప్పటికీ సీపీబ్రౌన్ తెలుగుభాషాభివృద్ధికి చేసిన కృషి తెలుగుజాతికి ఆదర్శమవ్వాలి.