Vijayawada Tourism: గాంధీ కొండకు లిఫ్ట్
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:38 AM
విజయవాడలోని గాంధీకొండను సందర్శించేవారి కోసం భారీ లిఫ్ట్ సిద్ధమవుతోంది. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఇక్కడకు వస్తున్న నేపథ్యంలో జంబో లిఫ్ట్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
2న సీఎం రాక నేపథ్యంలో శరవేగంగా నిర్మాణం
స్మారక స్తూపం వరకు ఎలివేటెడ్ పాత్‌వే కూడా
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
విజయవాడలోని గాంధీకొండను సందర్శించేవారి కోసం భారీ లిఫ్ట్ సిద్ధమవుతోంది. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఇక్కడకు వస్తున్న నేపథ్యంలో జంబో లిఫ్ట్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కొండపైనున్న స్మారక స్థూపం వద్దకు చేరుకునేందుకు ఇది దోహదపడనుంది. గాంధీహిల్ సొసైటీ సౌజన్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. గాంధీహిల్ రీ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు, గాంధీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రాజెక్టులను ప్రారంభించటంతోపాటు సభలో సీఎం పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటన తర్వాత జంబో లిఫ్ట్ శాశ్వతంగా సందర్శకులకు అందుబాటులోకి రానుంది. గాంధీ కొండపైకి ఘాట్ రోడ్డు ఉన్నప్పటికీ అది కొండపై వరకు లేదు. కొండ శిఖరాగ్రంలో ఉన్న గాంధీ స్మారక స్థూపం వరకు చేరుకోవాలంటే మెట్లమార్గం ఒక్కటే దిక్కు. దీంతో కొండకు లిఫ్ట్ ఏర్పాటు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. కొండ మిడిల్ డౌన్ నుంచి స్మారక స్తూపం వరకు జంబో లిఫ్ట్ నిర్మిస్తున్నారు. లిఫ్ట్ పైభాగం నుంచి 25 మీటర్ల దూరంలోని గాంధీ స్మారక స్థూపం వరకు ఎలివేటెడ్ పాత్‌వే కూడా నిర్మిస్తున్నారు. చంద్రబాబు తొలిసారిగా గాంధీ స్మారక స్తూపం నుంచి విజయవాడ అందాలను వీక్షించనున్నారు.