యోగాతో జీవితకాల ఆరోగ్యం
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:15 AM
ప్రతీ రోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయటం ద్వారా జీవితకాలం ఆరోగ్యవంతంగా ఉండవచ్చునని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. గురువారం మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం సమీపంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
- కలెక్టర్ డీకే బాలాజీ
- మోపిదేవిలో ఘనంగా యోగాంధ్ర
- యోగాసనాలతో ఆకట్టుకున్న చిన్నారులు
మోపిదేవి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రతీ రోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయటం ద్వారా జీవితకాలం ఆరోగ్యవంతంగా ఉండవచ్చునని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. గురువారం మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం సమీపంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం వద్ద అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి కలెక్టర్ బాలాజీ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే యోగాసాధన అలవర్చుకుంటే భవిష్యతలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని తెలిపారు. యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అనంతరం కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ యోగాసనాలు ప్రదర్శించి యువత, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. చల్లపల్లి మండలం యార్లగడ్డ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం యోగా శిక్షకులు, విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి, జ్ఞాపికలతో సత్కరించారు. ఎస్పీ ఆర్.గంగాధరరావు, డీఆర్వో చంద్రశేఖరరావు, మచిలీపట్నం ఆర్డీవో కె.స్వాతి, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, పర్యాటక శాఖ అధికారి రామలక్ష్మణరావు, మెప్మా పీడీ సాయిబాబు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి భవిరి శంకర్‌నాథ్, ఎంపీపీ రావి దుర్గావాణి, జెడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు, మోపిదేవి సర్పంచ్ నందిగం మేరీరాణి, తహసీల్దార్ శ్రీవిద్య, ఎంపీడీవో స్వర్ణభారతి, ఆయూష్ శాఖ అఽధికారులు జావేద్ ఖాన్, వాహిని తదితరులు పాల్గొన్నారు.