POCSO Court: ఐదేళ్ల కుమార్తెపై అత్యాచారం కిరాతకుడికి మరణించే వరకూ జైలు శిక్ష
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:43 AM
ఐదేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన కసాయికి మరణించేంత వరకూ జైలుశిక్ష విధిస్తూ విశాఖపట్నం పోక్సో కోర్టు న్యాయాధికారి సోమవారం తీర్పు చెప్పారు.
బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం
ప్రభుత్వాన్ని ఆదేశించిన పోక్సో కోర్టు
విశాఖపట్నం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన కసాయికి మరణించేంత వరకూ జైలుశిక్ష విధిస్తూ విశాఖపట్నం పోక్సో కోర్టు న్యాయాధికారి సోమవారం తీర్పు చెప్పారు. నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామవాసి (27) భార్య, ఐదేళ్ల కుమార్తె, ఏడేళ్ల కుమారుడితో విశాఖ వన్‌టౌన్‌లోని జాలారిపేటలో నివాసం ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో ఈ ఏడాది ఏప్రిల్ 15న పిల్లలిద్దరినీ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మద్యం మత్తులో తగరపువలస పాత సినిమాహాలు జంక్షన్ వద్ద ఒక దుకాణం ముందు రేకులషెడ్డులో పిల్లలను నిద్రపుచ్చాడు. అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఏడుస్తుండడంతో అక్కడ ఆగి ఉన్న లారీ డ్రైవర్, క్లీనర్ చూసి సమీపంలోని సెక్యూరిటీ గార్డు ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. భీమిలి పోలీసులు అక్కడకు చేరుకుని సీసీ ఫుటేజీ ద్వారా జరిగిన అఘాయిత్యాన్ని నిర్ధారించుకుని, బాలికను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు బాధ్యతను మహిళా పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అప్పటి ఏసీపీ సీహెచ్.పెంటారావు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను పకడ్బందీగా సేకరించి పోక్సో కోర్టుకు సమర్పించారు. కేసు విచారించిన న్యాయాధికారి.. సీసీ ఫుటేజీలను పరిశీలించడంతోపాటు పోలీసులు, వైద్యులు అందజేసిన ఇతర ఆధారాలను పరిగణలోకి తీసుకుని ముద్దాయికి మరణించేంత వరకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరణించేంత వరకు జైలుశిక్ష విధించడం చాలా అరుదు అని కేసు దర్యాప్తు అధికారి పెంటారావు చెప్పారు. ఈ కేసులో బాధితురాలికి రూ.ఐదు లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేయాలని కోర్టు ఆదేశించింది.