Kadapa: జీవిత ఖైదీకి గోల్డ్ మెడల్
ABN , Publish Date - Sep 26 , 2025 | 08:01 AM
ఆయనో హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదు. జైల్లో ఉంటూనే ఓపెన్ విద్య విధానంలో నాలుగు బీఏలు, మూడు ఎంఏలు పూర్తి చేశాడు.
ఓపెన్ డిగ్రీలో అత్యుత్తమ ప్రతిభ
హత్య కేసులో యుగంధర్‌కు జీవిత ఖైదు
కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ నాలుగు బీఏలు, మూడు ఎంఏలు పూర్తి
కడప క్రైం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆయనో హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదు. జైల్లో ఉంటూనే ఓపెన్ విద్య విధానంలో నాలుగు బీఏలు, మూడు ఎంఏలు పూర్తి చేశాడు. తాజాగా డిగ్రీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి గోల్డ్‌మెడల్‌కు ఎంపికయ్యాడు. గునుకుల యుగంధర్ అనే ఆ వ్యక్తి పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులుగా బీఏ పూర్తి చేశారు. ఇందులో మొత్తం 8.02 జీపీఏ సాధించి గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యారు. ఈనెల 30న హైదరాబాద్‌లో జరిగే 26వ స్నాతకోత్సవంలో మెడల్ పొందేందుకు వర్సిటీ నుంచి ఆహ్వానం లభించింది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం జంగాలపల్లెకు చెందిన యుగంధర్‌కు ఓ హత్య కేసులో 2011లో జీవిత ఖైదు శిక్ష పడింది. ఆయన కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, దాదాపు 15 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్న తన కుమారుడు యుగంధర్‌కు క్షమాభిక్ష పెట్టాలని అతని తల్లి చెంగమ్మ కోరారు. గురువారం ఆమె కడప సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు చదువుల్లో గోల్డ్ మెడల్ సాధించాడని, సత్ప్రవర్తన కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ ఆవేదనను గుర్తించి, తన బిడ్డను క్షమాభిక్ష కింద విడుదల చేయాలని కోరారు.