Share News

Parole Revoked: యావజ్జీవ ఖైదీ శ్రీకాంత్‌ పెరోల్‌ రద్దు

ABN , Publish Date - Aug 13 , 2025 | 06:35 AM

హత్య కేసులో అతడు యావజ్జీవ ఖైదీ.. జైలు నుంచి పారిపోయిన చరి త్ర కూడా ఉంది.. 2 పోలీసు స్టేషన్లలో రౌడీషీట్లు కూడా తెరిచారు. పెరోల్‌ ఇవ్వడానికి 2 జిల్లాల ఎస్పీలు ససేమిరా అన్నారు.

Parole Revoked: యావజ్జీవ ఖైదీ శ్రీకాంత్‌ పెరోల్‌ రద్దు

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ప్రభుత్వం ఉలికిపాటు

  • మధ్యాహ్నం జీవో జారీ.. సాయంత్రానికి జైలుకు

  • ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్‌ వద్దన్నా

  • పెరోల్‌కు సిఫారసు చేసిందెవరు?

  • నిబంధనలను ఉల్లంఘించినవారెవరు?

  • నిఘా వర్గాల ఆరా.. సర్కారుకు నివేదన

అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): హత్య కేసులో అతడు యావజ్జీవ ఖైదీ.. జైలు నుంచి పారిపోయిన చరిత్ర కూడా ఉంది.. 2 పోలీసు స్టేషన్లలో రౌడీషీట్లు కూడా తెరిచారు. పెరోల్‌ ఇవ్వడానికి 2 జిల్లాల ఎస్పీలు ససేమిరా అన్నారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి సైతం తిరస్కరించారు. అయినా.. నిబంధనలకు విరుద్ధంగా సదరు ఖైదీ అవిలేలి శ్రీకాంత్‌ పెరోల్‌ పొందడంపై ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ప్రచురించిన కథనంతో పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కేంద్రం గత ఏడాది తీసుకొచ్చిన బీఎన్‌ఎస్‌ చట్టాల్లోని నిబంధనల మేరకు విడుదలైన జీవోను ఇదే ప్రభుత్వంలో ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీకాంత్‌ పెరోల్‌ రద్దుచేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రానికి పోలీసులు అతడిని నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. వాస్తవానికి హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ జైలు నుంచి పరారైన శ్రీకాంత్‌కు పెరోల్‌ లభించదని నెల్లూరు జైలు సూపరింటెండెంట్‌ ప్రభుత్వానికి నివేదించారు. అతడి నేర చరిత్ర, రౌడీ షీట్లను దృష్టిలో పెట్టుకుని తిరుపతి, నెల్లూరు జిల్లాల ఎస్పీలు సైతం పెరోల్‌ దరఖాస్తుపై ‘నాట్‌ రెకమెండెడ్‌’ అని రాశారు.


అయినా గత నెల 30న శ్రీకాంత్‌కు 30రోజుల పాటు పెరోల్‌ ఇచ్చా రు. ప్రభుత్వంలోని కొందరు పెద్దల సహకారంతో శ్రీకాంత్‌ ప్రియురాలు ఈ పెరోల్‌ మంజూరు చేయించినట్లు సమాచారం. దీనిపై మంగళవారం ‘ఎవరి కోసం ఈ పెరోల్‌’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎక్కడ పొరపాటు జరిగింది.. ఎవరి సిఫారసు మేరకు నిబంధనలు ఉల్లంఘించి ఈ పనిచేశారు.. తదితర విషయాలపై నిఘా వర్గాలు ఆరా తీసి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాయి. అనంతరం కొన్ని గంటల్లోనే పెరోల్‌ రద్దు చేస్తూ జీవో జారీ అయింది. దరిమిలా గూడూరులో ఉన్న శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని నెల్లూరు జైలుకు తరలించారు.

Updated Date - Aug 13 , 2025 | 06:35 AM