Share News

అనధికారానికి ‘హోలో’ చెప్పేద్దాం!

ABN , Publish Date - Aug 04 , 2025 | 01:07 AM

వీఐపీ... శరన్నవరాత్రుల్లో పోలీసులు, దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ అధికారులు, రెవెన్యూ అధికారులను ఇబ్బంది పెడుతున్న పదవి ఇది. ప్రతి ఏడాది ఇదొక సమస్యగా మారుతోంది. ఇదే వివాదాలకు కారణమవుతోంది. అసలు వీఐపీల కంటే అనధికార వీఐపీలతోనే అసలు సమస్య వస్తోందని గుర్తించిన అధికారులు ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. అనధికార వీఐపీలకు చెక్‌ పెట్టడానికి ముద్రణ టికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు. వాటి ద్వారా నకిలీ టికెట్లు పుట్టకుండా ముద్రించిన టికెట్లపై హోలోగ్రామ్‌ స్టిక్కర్‌ను అతికించాలని నిర్ణయించారు. ఇటీవల నిర్వహించిన శర్నవరాత్రి ఉత్సవాల సమన్వయ కమిటీ సమావేశంలో ఈ రెండు నిర్ణయాలపై చర్చ సాగింది.

అనధికారానికి ‘హోలో’ చెప్పేద్దాం!

శరన్నవరాత్రుల్లో వీఐపీ దర్శనాలకు కొత్త విధానం

ముద్రించిన టికెట్లు జారీ చేయాలని నిర్ణయం

వాటిపై హోలోగ్రామ్‌ అతికించే యోచన

ఈ టికెట్లు ఉన్న వారికి ‘ఓం’ దగ్గర నుంచి ప్రవేశం

వీఐపీ... శరన్నవరాత్రుల్లో పోలీసులు, దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ అధికారులు, రెవెన్యూ అధికారులను ఇబ్బంది పెడుతున్న పదవి ఇది. ప్రతి ఏడాది ఇదొక సమస్యగా మారుతోంది. ఇదే వివాదాలకు కారణమవుతోంది. అసలు వీఐపీల కంటే అనధికార వీఐపీలతోనే అసలు సమస్య వస్తోందని గుర్తించిన అధికారులు ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. అనధికార వీఐపీలకు చెక్‌ పెట్టడానికి ముద్రణ టికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు. వాటి ద్వారా నకిలీ టికెట్లు పుట్టకుండా ముద్రించిన టికెట్లపై హోలోగ్రామ్‌ స్టిక్కర్‌ను అతికించాలని నిర్ణయించారు. ఇటీవల నిర్వహించిన శర్నవరాత్రి ఉత్సవాల సమన్వయ కమిటీ సమావేశంలో ఈ రెండు నిర్ణయాలపై చర్చ సాగింది.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

ఇంద్రకీలాద్రిపై సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు శరన్నవరాత్రులు జరుగుతాయి. ప్రతి ఏడాది పది రోజులపాటు సాగే ఉత్సవాలు ఈ ఏడాది తిథుల వృద్ధి కారణంగా 11 రోజులపాటు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రికి వీఐపీల తాకిడి సాధారణ రోజులకంటే ఎక్కువగా ఉంటుంది. వీఐపీలు స్వయంగా రావడంతోపాటు వారికి తెలిసిన వారికి దర్శనాలను సిఫార్సు చేస్తుంటారు. శరన్నవరాత్రుల్లో ఇదొక సంప్రదాయంగా మారిపోయింది. రెండు తెలుగు రాషా్ట్రల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, న్యాయమూర్తులు, న్యాయాధికారులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ ప్రొటోకాల్‌ జాబితాలో ఉంటారు. వాళ్లంతా శరన్నవరాత్రుల్లో దర్శనాలకు వస్తుంటారు. ఇది కాకుండా ప్రజాప్రతినిధులు వారి అనుచరులు, కార్యకర్తలను, అధికారులు, న్యాయాధికారులు వారి బంధువులను దర్శనాలకు పంపుతారు.

నిబంధనలు పాటించకుండా వాదనలు

ప్రొటోకాల్‌ జాబితాలో ఉన్న వారిని చిన్న రాజగోపురం వద్ద నుంచి ఆలయ అధికారులు తీసుకెళ్లి దర్శనాలు చేయిస్తారు. ఇక సిఫార్సులతో వచ్చే వీఐపీల కోసం ఘాట్‌రోడ్డులోని ఓం మలుపు వద్ద ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేస్తారు. అందులో నుంచి వాళ్లంతా దర్శనాలకు వెళ్లాల్సి ఉంటుంది. సిఫార్సులతో వచ్చే భక్తులు ఈ నిబంధనను పాటించడం లేదు. ఓం మలుపు వద్ద ఏర్పాటు చేసిన క్యూలో నుంచి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. దీంతో అక్కడ ఏర్పాటు చేసే చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న అధికారులతో వివాదాలకు దిగుతున్నారు. అక్కడి నుంచే సిఫార్సు చేసిన వీఐపీలకు ఫోన్లు చేయడం, వారు తిరిగి అధికారులకు ఫోన్‌ చేసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది.

నకిలీల బెడద

ఇదంతా ఒక సమస్య అయితే నకిలీ రెండో సమస్యగా మారింది. వీఐపీలకు ఆలయ అధికారులు కొన్ని టికెట్లను ఇస్తుంటారు. వాటికి నకిలీలను తయారు చేయించి కొన్ని ముఠాలు వాటిని అధిక ధరకు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. స్వయంగా దర్శనాలకు వచ్చే వీఐపీలకు ప్రొటోకాల్‌ ఉంటుంది కాబట్టి ఆ సిఫార్సులతో వచ్చే అనధికార వీఐపీలను కట్టడి చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఒక్కో వీఐపీకి ఎన్ని టికెట్లు కావాలో తెలుసుకుని వాటిని ముద్రించి, వాటిపై హోలోగ్రామ్‌ అతికించే బాధ్యతలను దేవస్థాన అధికారులకు అప్పగించారు. ఈ టికెట్లు ఉన్న వారిని ఓం మలుపు వద్ద నుంచి వీఐపీ క్యూలోకి అనుమతించాలని నిర్ణయించారు. అదేవిధంగా టికెట్లపై హోలోగ్రామ్‌ ఉండడంతో చూడగానే నకిలీ టికెట్లను గుర్తించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Updated Date - Aug 04 , 2025 | 01:07 AM