Share News

బెజవాడ ‘బ్రాండ్‌’ మోగించేద్దాం

ABN , Publish Date - Sep 17 , 2025 | 01:06 AM

బెజవాడ.. సాహిత్య నిధి. కళాకారులకు కేంద్రం. చారిత్రక ఘట్టాలకు పుట్టినిల్లు. రాజుల కాలం నుంచి స్వాతంత్య్ర సంగ్రామం వరకు విజయవాడ నగర ప్రాశస్తాన్ని చాటేలా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించాలని ప్రజాప్రతినిధులు తీర్మానించారు. నగరంలో 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ్‌ సన్నాహక కమిటీ సమావేశం విజయవాడలోని ప్రైవేటు హోటల్‌లో మంగళవారం జరిగింది.

బెజవాడ ‘బ్రాండ్‌’ మోగించేద్దాం

నగర ప్రాశస్త్యాన్ని చాటేలా విజయవాడ ఉత్సవ్‌

ఉత్సవ్‌ సన్నాహక కమిటీ సమావేశంలో వక్తలు

ముఖ్యఅతిథిగా హాజరైన ప్రసంగించిన సత్యకుమార్‌ యాదవ్‌

విజయవాడ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):

బెజవాడ.. సాహిత్య నిధి. కళాకారులకు కేంద్రం. చారిత్రక ఘట్టాలకు పుట్టినిల్లు. రాజుల కాలం నుంచి స్వాతంత్య్ర సంగ్రామం వరకు విజయవాడ నగర ప్రాశస్తాన్ని చాటేలా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించాలని ప్రజాప్రతినిధులు తీర్మానించారు. నగరంలో 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ్‌ సన్నాహక కమిటీ సమావేశం విజయవాడలోని ప్రైవేటు హోటల్‌లో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన, తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్‌(తాతయ్య), వసంత వెంకట కృష్ణప్రసాద్‌, కాగిత కృష్ణప్రసాద్‌, కామినేని శ్రీనివాస్‌, బోడె ప్రసాద్‌, వర్ల కుమార్‌రాజా, యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మాజీ ఎమెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా, పర్యాటకాభివృద్ధి కార్పొరేషన చైర్మన నూకసాని బాలాజీ, కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన నెట్టెం రఘురామ్‌, విజయ డెయిరీ చైర్మన చలసాని ఆంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో సత్యకుమార్‌ జన్మదిన వేడుకలను కూటమి నేతలు నిర్వహించారు. కేకు కట్‌ చేయించి, ఆయనకు శాలువా కప్పారు.

దసరా అంటే బెజవాడ అనేలా

- మంత్రి సత్యకుమార్‌

దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దసరా అంటే బెజవాడే అనుకునేలా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహిస్తాం. విజయవాడకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. బెజవాడ నీళ్లలో సాహిత్యం, ఆధ్మాతికత ఉన్నాయి. ఈ రెండు లక్షణాలు ఉన్న నగరంలో నిర్వహించే ఉత్సవ్‌ను సమష్టిగా విజయవంతం చేయాలి. అటు శరన్నవరాత్రులు, ఇటు విజయవాడ ఉత్సవాలను ప్రపంచ నలుదిక్కులకు తెలియజేయాలి. అంతరించిపోతున్న కళలను పరిరక్షించుకోవడానికి ఈ ఉత్సవాలు పునాది వేయాలి. వైభవాన్ని ప్రపంచానికి విస్తరించేలా నిర్వహించాలి. మైసూర్‌ తరహాలో ఫెస్ట్‌ నిర్వహిస్తాం. విజయవాడ నగరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయి.

ఆధ్యాత్మికత, పర్యాటకానికి అనువైన ప్రదేశం

- మంత్రి కొలుసు పార్థసారధి

దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయల్లో ఇంద్రకీలాద్రి ఒకటి. పర్యాటకంగాను విజయవాడకు మంచి స్థానం ఉంది. రాషా్ట్రన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు చంద్రబాబు పని చేస్తున్నారు. ప్రపంచ స్థాయి నగరాలతో అమరావతిని అభివృద్ధి చేసేలా నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ ఉత్సవాల్లో అందర్నీ భాగస్వామ్యం చేయాలి. పర్యాటకులు, భక్తులకు విజయవాడ అనువైన ప్రదేశం. చారిత్రకంగా, పర్యాటకంగా కొండపల్లి అద్భుతమైన ప్రాంతం.

ఖండాంతరాలకు తెలిసేలా..

- ఎంపీ కేశినేని చిన్ని

కళలు, సాంస్కృతిక రంగానికి విజయవాడ రాజధాని. విజయవాడ ఉత్సవ్‌తో నగరానికి అపూర్వవైభవం తీసుకొస్తాం. వైసీపీ నేతలు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారు. బెజవాడ ఖ్యాతిని ఖండఖండాలకు తెలియజేసేలా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహిస్తాం. దీనివల్ల నగరంలో వ్యాపార వర్గాలు బాగుంటాయి. మనీ సర్క్యూలేట్‌ అవుతుంది. ప్రతి ఏడాది ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు ఉత్సవాలు జరగాలి. బందరులో బీచ ఫెస్టివల్‌, విజయవాడలో విజయవాడ ఉత్సవ్‌ నిర్వహించాలి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వినోదాన్ని, ఆధ్యాత్మకత పెంచేలా కార్యక్రమాలు చేపడుతాం.

Updated Date - Sep 17 , 2025 | 01:06 AM