వర్షాలొచ్చేలోపు తవ్వేద్దాం!
ABN , Publish Date - May 28 , 2025 | 01:41 AM
నైరుతి రుతు పవనాలు జిల్లాకు దగ్గరగా వచ్చాయి. వాటితో సంబంధం లేకుండా అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వర్షాలు మరింత విస్తారంగా పడే సూచనలు ఉన్నాయి. ఈలోపే భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచాలని భూగర్భ గనుల శాఖ అధికారులు నిర్ణయించారు. వర్షకాలంలో ఇసుకకు ఎలాంటి కొరత లేకుండా ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ పాయింట్ల వద్ద నిల్వ ఉంచాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు.
జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ లక్ష్యం
ప్రస్తుతం 5.5 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు
వర్షాకాలంలో కొరత లేకుండా భూగర్భ గనుల శాఖ అధికారుల చర్యలు
నైరుతి రుతు పవనాలు జిల్లాకు దగ్గరగా వచ్చాయి. వాటితో సంబంధం లేకుండా అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వర్షాలు మరింత విస్తారంగా పడే సూచనలు ఉన్నాయి. ఈలోపే భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచాలని భూగర్భ గనుల శాఖ అధికారులు నిర్ణయించారు. వర్షకాలంలో ఇసుకకు ఎలాంటి కొరత లేకుండా ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ పాయింట్ల వద్ద నిల్వ ఉంచాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఎనిమిది స్టాక్ పాయింట్లలో ప్రస్తుతం 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉంది. ప్రస్తుత అవసరాలకు ఈ ఇసుక సరిపోతుందని అంచనా వేశారు. వర్షాకాలంలో రీచ్‌ల్లోకి దిగి ఇసుకను తవ్వే అవకాశం ఉండదు. ఎగువన వర్షాలు కురిస్తే తెలంగాణలోని వాగులు, వంకల నుంచి వచ్చే నీరంతా కృష్ణా నదిలో కలుస్తుంది. దీనికితోడు ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసినా నది రూపం ఉగ్రంగా ఉంటుంది.
త్వరలో తవ్వకాలు
జిల్లాలో ఇబ్రహీంపట్నం నుంచి జగ్గయ్యపేట వరకు మొత్తం 15 రీచ్‌లు ఉన్నాయి. ఇక్కడ 15 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నట్టు అధికారులు ఇంతకుముందు అంచనా వేశారు. చందర్లపాడు, కంచికచర్ల, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఇసుక స్టాక్ యార్డులు ఉన్నాయి. కంచికచర్ల మండలం పెండ్యాల, నందిగామ మండలం మాగళ్లు, చందర్లపాడు మండలం కొడవటికల్లు, వత్సవాయి మండలం అల్లూరుపాడు, జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి, వత్సవాయి మండలం పోలంపల్లి, కంచికచర్ల మండలం కీసర, మోగులూరు స్టాక్ యార్డుల నుంచి సరఫరా అవుతోంది. వాస్తవానికి జిల్లాలో 15 రీచ్‌లను భూగర్భ గనుల శాఖ అధికారులు గుర్తించారు. వాటిలో మూడు రీచ్‌లు మాత్రం నిర్వహణలో లేవని తెలుస్తోంది. స్థానిక గ్రామాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం, వారు ఆందోళనలు చేస్తుండడంతో ఈ మూడు రీచ్‌లో ఇసుక తవ్వకాలను నిలుపుదల చేశారు. ప్రస్తుతం 12 రీచ్‌లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ రీచ్‌ల్లో తవ్విన ఇసుకను స్టాక్ పాయింట్లకు తీసుకెళ్తున్నారు. ఇక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఇసుక నిల్వలు ఉన్నప్పటికీ రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే తవ్వకాలు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి భూగర్భ గనుల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. వర్షాకాలానికి సరిపడే విధంగా ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉంచాలని లక్ష్యాన్ని నిర్ధేశించారు. దీని ప్రకారం త్వరలో రీచ్‌లో ఇసుక తవ్వకాలను వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు.