Endowments Department: శాంతిపై ఎందుకు కరుణ
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:25 AM
దేవదాయ శాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) కె. శాంతిపై చర్యలు తీసుకునేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
దేవదాయ శాఖను భ్రష్టు పట్టించినా చర్యలకు ఉన్నతాధికారుల మీనమేషాలు
‘కంపల్సరీ రిటైర్మెంట్’కు నోటీసులు జారీ
దీనివల్ల ఒరిగేదేమీ లేదంటున్న సిబ్బంది
మూడు జిల్లాల్లో అక్రమాలన్నీ రుజువు
దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు నిరూపణ
ఆమె పంపిన ప్రతిఫైల్‌కు అప్పట్లో పచ్చజెండా
ఫైల్స్ ఆమోదించిన వారిపై చర్యల మాటేంటి?
ఏసీ వ్యవహారంలో మెతక ధోరణిపై సందేహాలు
అమరావతి/విశాఖపట్నం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) కె. శాంతిపై చర్యలు తీసుకునేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. శాంతిపై నమోదు చేసిన అన్ని అభియోగాలు దాదాపు నిరూపణ అయ్యాయి. విచారణాధికారిగా ఉన్న రాజమండ్రి ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఇచ్చిన నివేదికలో.. ‘ఆమె చేయని తప్పు లేద’ని స్పష్టంగా పేర్కొన్నారు. శాఖకు చెందిన సొమ్మును దుర్వినియోగం చేయడం, తాను అవినీతికి పాల్పడడంతో పాటు సిబ్బందిని కూడా ప్రోత్సహించడాన్ని నిర్ధారించుకున్నారు. అంతేకాదు, తన భర్త విషయంలో రికార్డుల్లో ఒకరి పేరు, ప్రెస్‌మీట్‌లో మరొకరి పేరు చెప్పడం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడడాన్ని కూడా నివేదిలో ప్రస్తావించారు. అదేవిధంగా సీసీఏ నిబంధనలు తుంగలోతొక్కడంతో పాటు నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్‌టీఆర్ జిల్లాల్లో పనిచేసినప్పుడు ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి 20 చార్జ్‌లు పెట్టగా వాటిలో 17 రుజువయ్యాయని తెలిపారు. ఈ నివేదికను పరిశీలిస్తే ఆమెను ప్రభుత్వ ఉద్యోగ నుంచి శాశ్వతంగా తొలగించవచ్చని దేవదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కానీ, శాంతి విషయంలో ఉన్నతాధికారులు ఇంకా మెతక వైఖరినే ప్రదర్శిస్తున్నారు. కేవలం ‘కంపల్సరీ రిటైర్మెంట్’కు మాత్రమే ప్రతిపాదించారు. మరోవైపు విచారణ విషయంలో జాప్యం చేస్తున్నారు. ఏసీ శాంతిని గత ఏడాది జూలై 2న సస్పెండ్ చేసి, అభియోగాలు నమోదు చేశారు. సస్పెండ్ చేసి దాదాపు 15 నెలలు పూర్తయ్యాయి.
తాజాగా అధికారులు కంపల్సరీ రిటైర్మెంట్‌కు ప్రతిపాదించారు. ఇంత ఆలస్యం ఎందుకు చేశారన్న విషయంపై ఎలాంటి సమాధానం లేదు. పైగా, కంపల్సరీ రిటైర్మెంట్ పెద్ద శిక్ష కాదన్న అభిప్రాయం కూడా ఉంది. దీని వల్ల ఆమె మళ్లీ అసిస్టెంట్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్‌గా దేవదాయశాఖలోకి వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సహకరించిందెవరు?
అసిస్టెంట్ కమిషనర్‌గా శాంతి విధుల్లో ఉన్నప్పుడు కేవలం 6-సీ ఆలయాలకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే చూడాలి. కానీ, ఆమె 6-బీ, 6-ఏ ఆలయాల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. ఆ ఆలయాల పరిధిలో లీజులు, లైసెన్సుల కొనసాగింపునకు సంబంధించిన ఫైల్స్‌ను దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయానికి పంపించారు. ఆ సమయంలో శాఖ ప్రధాన కార్యాలయం అధికారులు.. ఆమె పరిధిని ప్రశ్నించలేదు. పైగా, ఆమె పంపిన ప్రతి ఫైల్‌ను ఆమోదించారు. ఆమె కోరిన విధంగా లీజులు, లైసెన్సులకు అనుమతులిచ్చారు. అప్పట్లో ఆమెకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆమెకు సహకరించిన అధికారులు, సిబ్బంది విషయంలో ఉన్నతాధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కీలక వివాదాలు ఇవీ..
అనకాపల్లి జిల్లా నుంచి 2022, జూన్ 30న బదిలీపై ఏసీ శాంతి ఎన్‌టీఆర్ జిల్లాకు వెళ్లారు. అక్కడ భర్త మదన్ మోహన్‌తో తలెత్తిన వివాదంపై మీడియా ముందుకు వచ్చారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అనేక అంశాలపై బహిరంగంగా మాట్లాడారు.
అప్పటి వైసీపీ నేత విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ ‘ఎప్పడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్. మీరు పార్టీకి వెన్నెముక.’ అని ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఒక రాజకీయ నాయకుడిని సమర్థించడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధం.
మొదటి భర్త మదన్‌మోహన్‌కు విడాకులు ఇచ్చానని, న్యాయవాది సుభాశ్‌ను 2020లో రెండో వివాహం చేసుకున్నానని చెప్పారు. తనకు పుట్టిన మగ బిడ్డకు ఆయనే తండ్రి అని వెల్లడించారు. అయితే మదన్‌తో విడాకులు తీసుకున్నట్టు నిరూపించలేకపోయారు.
తన పరిధిలో లేని 6-ఏ, 6-బీ ఆలయాల భూములను వేలం వేయకుండా 11 ఏళ్ల లీజుకు ఇచ్చేశారు.
విజిలెన్స్ నిర్వీర్యం
దేవదాయ శాఖలో విజిలెన్స్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. శాఖలో విజిలెన్స్ బలంగా లేకపోవడంతో విచారణలు ఆలస్యం కావడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. శాంతిపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి నోటీసులు ఇవ్వడానికి 15 నెలల సమయం తీసుకున్నారు. ఇందతా దేవదాయ శాఖలో విజిలెన్స్ విభాగం బలహీనంగా ఉండడమే కారణమని తెలుస్తోంది. ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ఒక జాయింట్ కమిషనర్ ఉండాల్సిన చోట, కేవలం ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక కంప్యూటర్ ఆపరేటర్‌తో విజిలెన్స్ విభాగాన్ని నడిపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విజిలెన్స్ విభాగంలో ఒక జాయింట్ కమిషనర్ పోస్టు ఉండేది. విభజనతో ఆ పోస్టు తెలంగాణకు వెళ్లిపోవడంతో ఏపీలో విజిలెన్స్ జాయింట్ కమిషనర్ పోస్టులు లేకుండాపోయింది. విజిలెన్స్ బలహీనంగా ఉంటేనే కమిషనర్లు అనుకున్న పనులు జరుగుతాయన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. విజిలెన్స్ కేసుల్లో త్వరిగతిన విచారణ పూర్తి చేసి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ఆ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
డెయిరీ భూముల్లో బొక్కేసి!
అనకాపల్లి జిల్లా లంకెలపాలెంలో పరదేశమ్మ ఆలయానికి సంబంధించిన భూమిలో విశాఖ డెయిరీకి చెందిన ఐస్‌క్రీమ్ కంపెనీ కొన్ని దశాబ్దాలుగా ఉంది. అది ఆక్రమణ కావడంతో ఏసీ శాంతి వారిని బెదిరించారు. దారిలోకి తెచ్చుకొని వేలం లేకుండా 11 ఏళ్లకు లీజుకు ఇచ్చేశారు. అప్పటికే ఆక్రమణదారుడైన సతీశ్(విశాఖ డెయిరీ) నెలకు రూ.20 వేలు చొప్పున జరిమానా కడుతున్నారు. ఆ విషయం కూడా దాచిపెట్టి అదే రూ.20 వేలు లీజుగా నిర్ణయించి ఇచ్చేశారు. పైగా దీనికి అనుకూలంగా నివేదిక ఇవ్వాలని ఆలయ ఈవో, ఇన్‌స్పెక్టర్‌ను బెదిరించారు. వారికి బదులుగా తానే ఒక నివేదిక తయారుచేసి వాటిపై సంతకాలు చేయించారు. నివేదికలు రెండూ ఒకే విధంగా ఉండడంతో అనుమానించిన అఽధికారులు వారిని ప్రశ్నించగా, ఆమె తమను బెదిరించి సంతకాలు చేయించారని పేర్కొన్నారు. ఆ ఆరోపణలపై విశాఖ కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవో శోభారాణి, విజయవాడలోని అదనపు కమిషనర్-1 చంద్రకుమార్ విచారణ పూర్తిచేసి నివేదికలు ఇచ్చారు. దీంతో దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ శాంతికి ఈ నెల 16న షోకాజ్ నోటీసు ఇచ్చారు.