Andhra Pradesh Capital: కట్టుదిట్టం.. చట్టబద్ధం ఇక అమరావతే
ABN , Publish Date - Dec 08 , 2025 | 03:46 AM
తెలంగాణ ఆవిర్భావం తర్వాత నవ్యాంధ్ర ‘రాష్ట్రంలేని రాజధాని’గా ఏర్పడిన సంగతి తెలిసిందే. ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం- 2014’ సెక్షన్ 5లో రాజధానికి సంబంధించిన అంశాలను పొందుపరిచారు.
పార్లమెంటులో చట్టబద్ధత దిశగా అడుగులు
విభజన చట్టంలో సవరణకు కేంద్ర న్యాయశాఖ ఓకే
సెక్షన్ 5(2)లో ‘అమరావతి రాజధాని’ అని స్పష్టీకరణ
గ్రామాలు, పరిధులు పొందుపరిచేలా బిల్లు
కేంద్ర మంత్రివర్గం ఆమోదించడమే తరువాయి
పార్లమెంటు ఆమోద ముద్రతో ‘చట్టబద్ధత’
ఆపై... రాష్ట్ర స్థాయిలో అమరావతిని కదల్చడం అసాధ్యం
రాజధానిపై మూడు ముక్కలాటలు, జగన్నాటకాలకు తెర
కూటమి సర్కారు రాగానే తెరపైకి కీలక ప్రతిపాదనలు
క్యాబినెట్ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిన ప్రభుత్వం
ఇక ‘అమరావతి’కి తిరుగుండదు! ఆంధ్రుల నూతన రాజధాని... చట్టబద్ధమైన రక్షణతో భద్రంగా ఉంటుంది. కట్టుదిట్టమవుతుంది. ‘చంద్రబాబు మొదలుపెట్టారు... జగన్ వచ్చి పక్కన పెట్టారు... ఇప్పుడు చంద్రబాబు మళ్లీ కష్టపడి అమరావతిని గాడిన పెడుతున్నారు. మళ్లీ జగన్ వస్తే ఎలా?’ అనే ప్రశ్నలకు, సందేహాలకు ఇక తావే లేదు. ‘అమరావతి’ని కదిలించే శక్తి వారెవరికీ ఉండదు! ఎందుకంటే... ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి’ అని పార్లమెంటులోనే చట్టం చేసేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర న్యాయ శాఖ కూడా ఈ బిల్లు ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టడమే మిగిలింది. అక్కడ ఆమోద ముద్ర పడితే... అమరావతిని మరెవ్వరూ కదిలించలేరు. స్వార్థ రాజకీయాల కోసం నవ నగరాన్ని బలిచేయలేరు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
తెలంగాణ ఆవిర్భావం తర్వాత నవ్యాంధ్ర ‘రాష్ట్రంలేని రాజధాని’గా ఏర్పడిన సంగతి తెలిసిందే. ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం- 2014’ సెక్షన్ 5లో రాజధానికి సంబంధించిన అంశాలను పొందుపరిచారు. ఇందులోని సబ్ సెక్షన్ 2లో... ‘‘విభజన తర్వాత పదేళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. నవ్యాంధ్రకు ‘కొత్త రాజధాని’ ఏర్పాటవుతుంది’’ అని పేర్కొన్నారు. సబ్ సెక్షన్ 3లో... ఏపీ కొత్త రాజధానికి కేంద్ర ఆర్థిక సహకారం ఉంటుందని కూడా స్పష్టం చేశారు. అయితే... సొంత గడ్డపైనుంచే పాలన సాగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు పదేళ్లకంటే ముందే ‘హైదరాబాద్’ నుంచి పాలనను నవ్యాంధ్రకు తరలించారు. ‘అమరావతి’ని రాజధానిగా ప్రకటించారు. దీనికోసం భూమిని సమీకరించారు. 29 గ్రామాలకు చెందిన 27వేల మంది రైతులు తమ 33వేల ఎకరాల భూములను అప్పగించారు. అమరావతి పనులు మహోజ్వలంగా సాగుతున్న దశ లో... 2019లో ఎన్నికలు వచ్చాయి. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.
మూడు ముక్కలాట...
ఎన్నికలముందు ‘అమరావతే రాజధాని’ అని నమ్మబలికిన వైసీపీ... అధికారంలోకి రాగానే మాట మార్చింది. జగన్ మూడు ముక్కలాటకు తెరలేపారు. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చారు. కానీ, మండలిలో బలంలేక ఆ పనిచేయలేకపోయారు. ఏపీ సీఆర్డీయే చట్టంలోని బలమైన నిబంధనల నేపథ్యంలో... రాజధానికి న్యాయస్థానాలు అండగా నిలిచాయి. జగన్ సర్కారు చర్యను నిరసిస్తూ రాజధాని రైతులు సమరశీల పోరాటాలు చేశారు. కోర్టుల్లో ఓటమి తప్పదని గ్రహించిన నాటి జగన్ సర్కారు... వ్యూహాత్మకంగా మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. జగన్ ప్రయత్నాలకు 2022 మార్చి 3న హైకోర్టు కూడా చెక్ పెట్టింది. 2024 ఎన్నికల్లో కూటమి సర్కారు అధికారంలోకి రావడం... చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో ‘అమరావతి’ మళ్లీ పట్టాలెక్కింది.
చట్టబద్ధత ఎందుకు? ఎలా?
‘వీరు పోతే వారు... వారు పోతే వీరు... ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు అమరావతితో ఆటలాడుకోకూడదు’ అనే లక్ష్యంతో ఏపీ రాజధానికి కట్టుదిట్టమైన చట్టబద్ధత కల్పించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కూటమి సర్కారు రాగానే అమరావతిని శాశ్వతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. నిజానికి... ఏది రాజధానిగా ఉండాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోలేదు. కానీ... నవ్యాంధ్ర ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏర్పడింది. ‘ఏపీకి ఒక రాజధాని ఏర్పాటవుతుంది. దానికి కేంద్రం మద్దతు ఉంటుంది’ అని పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టంలోనే పేర్కొన్నారు. దీనిని ఆసరాగా తీసుకునే ‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. 2024 జూన్ 1వ తేదీతో... ‘పదేళ్ల ఉమ్మడి రాజధాని’ కథ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 5 (2)లో ‘ఏపీకి ఒక రాజధాని ఏర్పాటవుతుంది’ అని ఉన్న చోట... ‘ఏపీ రాజధానిగా అమరావతి’ అని సవరణ చేస్తారు. ‘అమరావతి’కి పరిధులనూ నిర్ణయిస్తారు. ‘ఏపీ సీఆర్డీయే చట్టం-2014’ నోటిఫై చేసిన ప్రాంతాన్ని ‘అమరావతి’గా పరిగణించాలని... ఇది 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని నిర్దిష్టంగా స్పష్టం చేస్తారు. దీంతోపాటు భవిష్యత్తులో సీఆర్డీయే నోటిఫై చేసే గ్రామాలు కూడా ‘అమరావతి’ పరిధిలోకి వచ్చే వీలు కల్పిస్తూ ఈ సవరణను ప్రతిపాదించారు.
కేంద్ర న్యాయశాఖ ఆమోదం
అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఈ ఏడాది మే 12న రాష్ట్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించి... కేంద్రానికి పంపించింది. ఆ తర్వాత కేంద్రం స్థాయిలో చేసిన ప్రయత్నాలతో కదలిక మొదలైంది. ప్రతిపాదిత సవరణలపై కేంద్ర న్యాయశాఖ ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పింది. సంతృప్తి చెందిన న్యాయశాఖ... ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5(2)లో ‘అమరావతి ఏపీ రాజధాని’ అని చేర్చాలన్న సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సంబంధించిన ఫైలును కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపించనున్నారు. ఆ తర్వాత ఏపీ పునర్విభజన చట్టం-2014 సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అది ఆమోదం పొందగానే... ‘అమరావతి’కి పార్లమెంటు స్థాయిలో చట్టబద్ధత లభిస్తుంది.
చట్టబద్ధత వస్తే...
‘అమరావతి ఆంధ్రుల రాజధాని’ అని పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత... ఎవరు అధికారంలోకి వచ్చినా దానిని రాష్ట్ర స్థాయిలో కదిలించలేరు. మళ్లీ ‘మూడు ముక్కలాటల’ వంటివి మొదలుపెట్టడం సాధ్యం కాదు. రాజధానిని మార్చాలంటే... కేంద్రం పార్లమెంటులో మరోసారి ‘సవరణ’లు చేయాల్సి ఉంటుంది. ఎన్డీయే హయాంలో ఇది కుదిరేపని కాదు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడినప్పటికీ... ‘అమరావతి’ జోలికి వెళ్లే అవకాశమే లేదు. రాష్ట్ర విభజన చేసిందే అప్పటి యూపీఏ సర్కారు. నవ్యాంధ్ర రాజధానికి కేంద్ర మద్దతుతోపాటు... పలు అంశాలను అందులో అప్పుడే పొందుపరిచారు. ఈ స్ఫూర్తికి భిన్నంగా, ‘జగన్నాటకాల’కు కాంగ్రెస్ సహకరించబోదు. వెరసి... పార్లమెంటులో సవరణ చట్టం ఆమోదం పొందగానే ‘అమరావతి’కి చట్టబద్ధమైన బలం, రక్షణ లభిస్తుంది.