Justice Surya Kant: సవాళ్లతో కూడుకున్న న్యాయవాద వృత్తి
ABN , Publish Date - Sep 06 , 2025 | 05:20 AM
న్యాయవాద వృత్తి అత్యంత సవాళ్లతో కూడుకున్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం...
లాయర్లకు నిజాయితీ, స్వీయ అవగాహన అవసరం
సమాజంలో మార్పు కోసం యత్నించాలి: జస్టిస్ సూర్యకాంత్
ఘనంగా న్యాయ వర్సిటీ సంయుక్త స్నాతకోత్సవం
విశాఖపట్నం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): న్యాయవాద వృత్తి అత్యంత సవాళ్లతో కూడుకున్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (8, 9, 10, 11, 12వ బ్యాచ్‌లు) సంయుక్త స్నాతకోత్సవాన్ని శుక్రవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు నిజాయితీ, స్వీయ అవగాహన కలిగి, మార్పును స్వీకరించేందుకు నిరంతరం సిద్ధంగా ఉండాలని సూచించారు. యువ న్యాయవాదులు సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని కోరారు. అధిక సంఖ్యలో మహిళలు న్యాయవాద పట్టాలు తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. విశిష్ట అతిథి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి మాట్లాడుతూ న్యాయవాద వృత్తి కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, సమాజాన్ని మార్చగల శక్తి అని పేర్కొన్నారు. మాజీ చాన్సలర్‌గా వర్సిటీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. మరో అతిథి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎ్‌స.నరసింహ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువ న్యాయవాదులు భాగస్వాములు కావాలని వ్యక్తిత్వం, నైతికతతో కూడిన జీవితాన్ని నిర్మించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వర్సిటీ చాన్స్‌లర్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ సదస్సుకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి.సూర్యప్రకాశరావు, పలువురు సీనియర్ న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు.
‘బంగారు’ తల్లి రష్మి!
జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో భాగంగా ఆయా బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులకు పట్టాలను అందించడంతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 154 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. గోల్డ్ మెడల్ సాధించిన వారిలో కోల్‌కతాకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు రష్మి మరువాడ ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రెయిలీ లిపి ద్వారా ప్రతిష్టాత్మక వర్సిటీలో బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసినందుకు ఆనందంగా ఉందన్నారు. టాటా ఇన్‌స్టిట్యూట్‌లో ఎల్‌ఎల్‌ఎం కూడా పూర్తయిందని, ప్రస్తుతం అక్కడే ఎంఎస్‌డబ్ల్యూ చేస్తున్నానని చెప్పారు. క్రిమినాలజీ అండ్ డ్రగ్ కంట్రోల్ లా సబ్జెక్ట్‌లో టాపర్‌గా నిలిచినందుకు బంగారు పతకం వచ్చిందన్నారు.
