లీజు మాయ!
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:07 AM
హనుమాన్‌జంక్షన్ అభయాంజనేయస్వామి ఆలయ ఆదాయానికి అధికారులే గండికొడుతున్నారు. ధర్మసత్రం స్థలంలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో దుకాణాలను కారుచౌకగా కట్టబెట్టారు. సిండికేట్‌గా ఏర్పడి షాపులు దక్కించుకున్న వారు అధిక ధరలకు సబ్‌లీజులకు ఇచ్చి అక్రమార్జన చేస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన నూతన పాలకవర్గం పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- అభయాంజనేయ స్వామి ఆలయ ఆదాయానికి గండి!
- ధర ్మసత్రం స్థలంలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో దుకాణాలకు వేలం
- ఆదాయం వచ్చే అవకాశాలున్నా.. ఒక్కో షాపునకు రూ.10 వేలుగా నిర్ణయం
- సిండికేట్ అయి రూ.7,500లకే దక్కించుకున్న పాటదారులు
- అధిక ధరలకు సబ్‌లీజులకు ఇచ్చి అక్రమార్జన
- అధికారులు, నూతన పాలక వర్గం తీరుపై సర్వత్రా విమర్శలు
హనుమాన్‌జంక్షన్ అభయాంజనేయస్వామి ఆలయ ఆదాయానికి అధికారులే గండికొడుతున్నారు. ధర్మసత్రం స్థలంలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో దుకాణాలను కారుచౌకగా కట్టబెట్టారు. సిండికేట్‌గా ఏర్పడి షాపులు దక్కించుకున్న వారు అధిక ధరలకు సబ్‌లీజులకు ఇచ్చి అక్రమార్జన చేస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన నూతన పాలకవర్గం పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, హనుమాన్ జంక్షన్):
హనుమాన్‌జంక్షన్‌లోని అభయాంజనేయస్వామి దేవాలయం రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచింది. దేవస్థానానికి చెందిన ధర్మస్థలం స్థలంలో ఇటీవల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. షాపులను అద్దెకు ఇచ్చే విషయంలో అధికారులు ఉదాసీన వైఖరి అవలంభించడంతో పాటదారులు కారు చౌకగా వాటిని దక్కించుకున్నారు. ఆదాయం రాగలిగే పరిస్థితి ఉందని తెలిసినా కూడా అధికారులు అతి తక్కువుగా అద్దెలను నిర్ణయించారు. పోనీ నిరుద్యోగులకు ఉపాధి కల్పన నిమిత్తం అతి తక్కువ ధరకు అద్దెకు ఇచ్చారా అంటే అదీ లేదు. వ్యాపారం చేసేవారికి కారు చౌకగా కట్టబెట్టారు.
ఆలయ ఆదాయ వనరుగా ఉంటుందనుకుంటే..
అభయాంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ఆదాయం అవసరం. ఈ క్రమంలో ధర్మసత్రం స్థలంలో వ్యాపారాలు నిర్వహించుకోవడానికి రూ.30 లక్షలు వెచ్చించి షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. స్వామి వారి నిత్య నైవేద్యాలు, పూజా కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాలు, వివిధ వేడుకల నిమిత్తం ఖర్చు చేయటానికి వీలుగా ఆదాయార్జన కోసం నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను అధికారులు కొందరి ప్రయోజనాల కోసం కట్టబెట్టడం తీవ్ర ఆరోపణలకు దారి తీస్తోంది. కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లో మొత్తం మూడు షాపులు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇవ్వడానికి నెల రోజుల కిందట దేవస్థానం అధికారులు వేలం పాట నిర్వహించారు. దేవదాయ శాఖ అధికారులు నెలకు రూ.10 వేలు దేవుడి పాటగా నిర్ణయించి పాట నిర్వహించారు. పాడుకున్నవారు ఏడాది అద్దెను డిపాజిట్‌గా చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. అధికారులు వేలం పాట నిర్వహిస్తుండగా వేలం పాటకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించకుండా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పాట నిర్వహించడమేమిటని స్థానిక అధికార పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు వారం రోజులు వాయిదా వేసి మళ్లీ పాట నిర్వహించారు.
సిండికేట్ అయిన పాటదారులు
అధికార పార్టీ నాయకుల కనుసన్నలలో పాటదారులు సిండికేట్‌గా మారిపోయారు. నెలకు కనీసంగా రూ.10వేలు రావాల్సిన అద్దెను రూ.7,500కు కైవసం చేసుకున్నారు. దీంతో దేవస్థానానికి రావాల్సిన మెరుగైన ఆదాయాన్ని అధికారులు రాబట్టుకోలేకపోయారు. ఈ వ్యవహారంలో దేవస్థాన అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సిండికేట్‌గా మారి షాపులు దక్కించుకున్న వారు ఆ షాపుల్లో వ్యాపారాలు చేస్తున్నారా అంటే అదీ లేదు. తాము దక్కించుకున్న దుకాణాలను వారు సబ్ లీజులకు ఇచ్చారు. రూ.7,500 అద్దెకు దక్కించుకున్న దుకాణాలను రూ.12,500కు సబ్‌లీజులకు ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది. దేవుడికి రావాల్సిన ఆదాయాన్ని పాటదారులు సిండికేట్‌గా మారి పోటీ లేకుండా తక్కువ అద్దెకు కైవసం చేసుకున్నారు. అందరి కళ్లముందే దేవుడి అదాయానికి గండి కొట్టి ఒక్కొక్కషాపు మీద నెలకు రూ.5వేలు మూడు షాపులు మీద ఏడాదికి రూ.1.80 లక్షల ఆదాయాన్ని దేవస్థానం కోల్పోయింది. అధికారులకు ఏమాత్రం పట్టలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇటీవలే నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. దేవుడి ఆదాయాన్ని పెంచాల్సిన పాలకవర్గం ఆదిలోనే ఆదాయానికి గండిపెట్టే విధానాలపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.