Share News

MP Sudha Murthy: ప్రతి అడుగూ అనుభవ పాఠమే

ABN , Publish Date - Dec 14 , 2025 | 05:04 AM

నైతిక విలువలతో జీవించే వ్యక్తులే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి అన్నారు.

MP Sudha Murthy: ప్రతి అడుగూ అనుభవ పాఠమే

  • ప్రశ్నించడం ఆగిపోయిన రోజు వృద్ధులమైనట్టే

  • నైతిక విలువలతో జీవిస్తేనే ఆదర్శంగా నిలుస్తాం

  • విజయాలను, వైఫల్యాలను ఒకే విధంగా చూడాలి

  • డ్యూటీలో ఏఐ సాయం..కానీ అదే డ్యూటీ చేయదు

  • ఏయూ పూర్వ విద్యార్థుల భేటీలో సుధామూర్తి వ్యాఖ్యలు

విశాఖపట్నం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నైతిక విలువలతో జీవించే వ్యక్తులే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి అన్నారు. శనివారం సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులుగా మారాలని, సమూహంతో కలిసి పనిచేయడం అలవాటు చేసుకోవాలన్నారు. ‘‘డబ్బు అవసరమే. అయితే ఎంత అవసరమన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. అధిక డబ్బు వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి. పిల్లలు దురలవాట్లకు దగ్గర అవుతారు.’’ అని వివరించారు. అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించేది విద్య మాత్రమేనన్నారు. ప్రతి ఒక్కరూ మాతృ సంస్థను, మాతృ భాషను, మాతృభూమిని గౌరవించడం నేర్చుకోవాలని తెలిపారు. భాష మన సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, నిత్యం కొత్త విషయాలను నేర్చుకునేందుకు యత్నించాలన్నారు. నేర్చుకోవడం, ప్రశ్నించడం మానేసినప్పుడు మాత్రమే వృద్ధులుగా మారతామని వ్యాఖ్యానించారు. ‘‘విజయం, వైఫల్యం అనేవి సర్వసాధారణం. వైఫల్యాల నుంచి పాఠాలను నేర్చుకుని విజయాలకు బాటలు వేసుకోవాలి. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని గెలుపునకు బాటలు వేసుకున్నవారే ఇప్పుడు వేదికపై కూర్చున్నారు. భవిష్యత్తులో మీరంతా ఈ స్థాయికి చేరుకోవాలి’’ అంటూ విద్యార్థులకు సుధామూర్తి సూచించారు. వేసే ప్రతి అడుగు ఒక అనుభవ పాఠం కావాలని, నిరంతర విజయాలు అహంకారాన్ని పెంచుతాయన్నారు. జీవితంలో కొంత భాగాన్ని వర్సిటీ నేర్పుతుందని, మిగిలినది మనమే నేర్చుకోవాలని సూచించారు. జీవితం ప్రతిరోజూ పరీక్ష పెడుతుందని, దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే తత్వం కలిగి ఉండాలన్నారు. చాట్‌ జీపీటీ, ఏఐలు ఉద్యోగ జీవితంలో సహాయం చేసేందుకు ఉపయోగపడతాయని, కానీ అవే ఉద్యోగాన్ని నిలబెట్టబోవని సుధామూర్తి వివరించారు.


చంద్రబాబు, లోకేశ్‌ దూరదృష్టితో విశాఖకు మంచి రోజులు : జీఎంఆర్‌

ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక చైర్మన్‌, జీఎంఆర్‌ గ్రూపు సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ దూరదృష్టి, గొప్ప కృషితో భారతదేశానికి నెక్స్స్‌ టెక్‌ హబ్‌గా విశాఖ మారబోతోందన్నారు. ఏయూ గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌గా వెలుగొందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. భారతదేశ భవిష్యత్తు ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా విశాఖ మార్చబోతోందని తెలిపారు. ‘‘మనలోని ప్రతి ఒక్కరూ ఒక్క విద్యార్థికి అయినా మార్గదర్శకత్వం వహించాలి. సమయాన్ని, అనుభవాన్ని, నిజాయితీతో కూడిన మార్గదర్శకత్వాన్ని అందించడం ద్వారా విద్యార్థుల ప్రయాణాన్ని స్పష్టతతో ముందుకు సాగేలా చూడగలం. ఎక్కడికి వెళ్లినా ఏయూ బ్రాండ్‌ను వెంట తీసుకువెళ్లాలి.’’ అని మల్లికార్జునరావు కోరారు. ఈ కార్యక్రమంలో ఏయూ వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌, పూర్వ విద్యార్థుల సంఘ చైర్మన్‌ కేవీవీ రావు, ఉపాధ్యక్షుడు కుమార్‌రాజా, జనరల్‌ సెక్రటరీ ఆకుల చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సావనీర్‌ను విడుదల చేశారు. సుధామూర్తిని ఏయూ, పూర్వవిద్యార్థి సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. వర్సిటీకి ఆర్థిక సహాయం చేసిన పలువురు పూర్వ విద్యార్థులను సన్మానించారు.


హోదాలు మరిచి..హాయిగా, హ్యాపీగా..!

ఏయూలో పూర్వ విద్యార్థుల సందడి

పూర్వ విద్యార్థులతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం సందడిగా మారింది. దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించిన ఎంతోమంది శనివారం పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నారు. అందులో కొందరు తాము చదువుకున్న తరగతి గదులను సందర్శించి గత స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. 1973-76 బ్యాచ్‌కు చెందిన విద్యార్థి, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌తోపాటు వర్సిటీలో చదువుకున్న రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్ల లక్ష్మీప్రసాద్‌, విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్‌, ఇంకా వి.కోటేశ్వరరావు, పేరా ప్రసాద్‌, రాజేంద్రప్రసాద్‌, ఎంఆర్‌ చౌదరి, డాక్టర్‌ కృష్ణమూర్తి, హరీశ్‌, సి.రాఘవరావు, ఏవీఎల్‌ నరసింహరావు, తదితరులు శనివారం ఉదయాన్నే క్యాంప్‌సకు చేరుకున్నారు. తొలుత స్నాతకోత్సవ భవనం చుట్టూ కొద్దిసేపు వాకింగ్‌ చేశారు. అనంతరం వర్సిటీలో వీఎస్‌ కృష్ణ లైబ్రరీ పక్కనున్న టీ స్టాల్‌ వద్దకు చేరుకున్నారు. టీ, కాఫీ తాగుతూ పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. వర్సిటీలో చదువుకున్నప్పటి విషయాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, చలోక్తులు విసురుకుంటూ సరదాగా గడిపారు. అనంతరం అక్కడే టిఫిన్‌ చేశారు. నాటి స్నేహితులను మళ్లీ కలుసుకోవడం పట్ల పలువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - Dec 14 , 2025 | 05:08 AM