Share News

CM Chandrababu: ఆటోల్లో.. సభావేదిక వద్దకు

ABN , Publish Date - Oct 05 , 2025 | 04:32 AM

ఆటోడ్రైవర్ల సేవలో..’పథకాన్ని ప్రారంభించడానికి కూటమి ప్రభుత్వ నేతలు ఆటోల్లో ప్రయాణించి సభాస్థలికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు....

CM Chandrababu: ఆటోల్లో.. సభావేదిక వద్దకు

  • వేర్వేరు ఆటోల్లో 14 కిలోమీటర్ల ప్రయాణం

  • డ్రైవర్లతో మాటలు కలిపి కష్టాలు తెలుసుకున్నచంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌, మాధవ్‌

విజయవాడ, తాడేపల్లి టౌన్‌, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ‘ఆటోడ్రైవర్ల సేవలో..’పథకాన్ని ప్రారంభించడానికి కూటమి ప్రభుత్వ నేతలు ఆటోల్లో ప్రయాణించి సభాస్థలికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు తన నివాసం నుంచి సభా ప్రాంగణం వరకు ఆటోలో ప్రయాణించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీతానగరం ఆటోస్టాండ్‌ నుంచి బయలుదేరారు. మంత్రి లోకేశ్‌, బీజేపీ ఏపీ చీఫ్‌ మాధవ్‌ ఉండవల్లి నుంచి వేర్వేరు ఆటోల్లో వచ్చారు. వీరంతా 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించి విజయవాడ చేరుకున్నారు. లబ్ధిదారుల కుటుంబసభ్యులు కూడా వారితోపాటు ఉన్నారు. దారిలో వస్తున్నంతసేపు వారి కుటుంబ స్థితిగతులను నేతలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు డ్రైవర్‌ అఫ్సర్‌ఖాన్‌ కుటుంబంతో ఆటోలో కలిసి వచ్చారు. అఫ్సర్‌ కుమారుడితో సీఎం మాట్లాడారు. ‘‘మీ నాన్న ఆటో నడుపుతున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మంచి ఐటీ ఉద్యోగం సాధించాలి’’ అని సూచించారు. డీజిల్‌ ఆటో కంటే సీఎన్‌జీ ఆటో వల్ల నెలకు రూ.1000 నుంచి 1,500 వందలు మిగులుతాయని ఆటో డ్రైవర్‌ తెలిపారు. కాగా, సీఎన్‌జీ ఆటోలో పవన్‌ కల్యాణ్‌ ప్రయాణం చేశారు. ‘సీఎన్‌జీ ఆటోకు గ్యాస్‌ ఎలా నింపుకుంటారు...ఎన్ని కేజీలు ఉంటుంది.. తదితర వివరాలను డ్రైవర్‌ను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఆటో నడపడం వల్ల వచ్చే ఆదాయం ఎంత... కుటుంబానికి ఎంత ఖర్చవుతుంది.. అంటూ ఆరా తీశారు. ఈ- స్కూటర్‌ ఎలా ఉంటుందని పవన్‌ అడిగి తెలుసుకున్నారు. బీజేపీ ఏపీ చీఫ్‌ మాధవ్‌ తాను ప్రయాణించిన ఆటో డ్రైవరుతో మాటలు కలిపారు. సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత డ్రైవర్లకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌, మాధవ్‌ ఆటో చార్జీలు చెల్లించారు.

4.jpg3.jpg

Updated Date - Oct 05 , 2025 | 04:32 AM