తలోదారి!
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:16 AM
జిల్లాల పునర్విభజన అంశం ఉమ్మడి కృష్ణాజిల్లాలో గందరగోళం సృష్టిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీతో ముందుకు వెళ్తుంటే ప్రజాప్రతినిధులు సరికొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. గన్నవరం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అడుగులు వేస్తుంటే.. పెనమలూరు ప్రజల అభీష్టానికి విరుద్ధంగా అక్కడి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వెళ్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంతలో గన్నవరం, పెనమలూరు ఎన్టీఆర్ జిల్లాలో కలిస్తే కృష్ణాజిల్లా చిన్నదైపోతుందని మంత్రి కొల్లు రవీంద్ర మరో వాదన అందుకున్నట్టు తెలిసింది. ఈ అంశాలపై ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.
- గత వైపీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా జిల్లాల విభజన
- సమస్యలను సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం
- గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపటానికి ప్రభుత్వ విప్ యార్లగడ్డ సై
- ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు నియోజకవర్గాన్ని కలపటానికి ఎమ్మెల్యే బోడె నై!
- గన్నవరం, పెనమలూరు ఎన్టీఆర్‌లో కలిపితే కృష్ణా చిన్నదైపోతుందట!
- మంత్రి కొల్లు రవీంద్ర సరికొత్త వాదనలతో గందరగోళం!
- ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు
- సీఎం సమావేశంలో గన్నవరం, పెనమలూరు, నూజివీడుపై తీవ్ర చర్చ
జిల్లాల పునర్విభజన అంశం ఉమ్మడి కృష్ణాజిల్లాలో గందరగోళం సృష్టిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీతో ముందుకు వెళ్తుంటే ప్రజాప్రతినిధులు సరికొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. గన్నవరం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అడుగులు వేస్తుంటే.. పెనమలూరు ప్రజల అభీష్టానికి విరుద్ధంగా అక్కడి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వెళ్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంతలో గన్నవరం, పెనమలూరు ఎన్టీఆర్ జిల్లాలో కలిస్తే కృష్ణాజిల్లా చిన్నదైపోతుందని మంత్రి కొల్లు రవీంద్ర మరో వాదన అందుకున్నట్టు తెలిసింది. ఈ అంశాలపై ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.
(ఆంద్రజ్యోతి, విజయవాడ):
జిల్లాల పునర్విభజన చిక్కుముడులను విప్పేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటే ప్రజాప్రతినిధులు మాత్రం కొత్త వాదనలతో గందరగోళం సృష్టించేలా వ్యవహరించటం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాడు జిల్లాల విభజనలో జరిగిన లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రయత్నిస్తోంది. ఇందులో ప్రధానంగా ఒక నియోజకవర్గం ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండాలని నిర్దేశిస్తోంది. ఈ విధానాన్ని ఖచ్చితంగా నూరుశాతం అమలు చేయాల్సిందేనన్నది ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తోంది. జిల్లా పరిపాలనా కేంద్రానికి దగ్గరగా ఉండాలన్నది రెండవ అంశం కాగా.. ప్రజలు రాకపోకలకు దగ్గరగా ఉండాలన్నది మూడవ అంశం. వీటన్నింటికీ మించి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిచేయటం అన్నది నాల్గవది.
ప్రజాప్రతినిధుల తీరుపై విమర్శలు
ప్రభుత్వ ఆలోచనా విధానాలు గత ప్రభుత్వం వేసిన తప్పులకు పరిష్కారం చూపించబోతుండగా.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కొంత మంది ప్రజాప్రతినిధులు తమ స్వార్థ ప్రయోజనాలను చూసుకుంటున్నారన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. విజయవాడకు అత్యంత సమీపంలో ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి తీసుకురావాలన్నది గత ప్రభుత్వం నుంచి స్థానిక ప్రజల డిమాండ్‌గా ఉంది. గన్నవరం కంటే కూడా పెనమలూరు నియోజకవర్గం విజయవాడను ఆనుకుని ఉంది. పెనమలూరు ప్రజలు విజయవాడలోని కలెక్టరేట్ కార్యాలయానికి రావటం దగ్గరగా ఉంటుంది. పైగా విజయవాడ గ్రేటర్ విలీన జాబితాలో ఈ నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు మండలాలు ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా దాదాపుగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి భిన్నంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీకి ఎన్టీఆర్ జిల్లాలో కలపటానికి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన కమిటీకి పదేపదే చెబుతుండటంతో పెనమలూరు అంశంపై గందరగోళం తలెత్తుతోంది. పెనమలూరు ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యవహరించడం నియోజకవర్గంలో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఆయన ఏ కారణం చేత వద్దంటున్నారో నియోజకవర్గ ప్రజలకు అంతుచిక్కటం లేదు. నియోజకవర్గ ప్రజలు మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని తెలిసింది. ఎమ్మెల్యే తీరుపై మీడియాకు ఫిర్యాదులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యవహారంతో నియోజకవర్గంలో ఇప్పటి వరకు చాపకిందనీరులా జరుగుతున్న ఇతర వ్యవహారాలన్నీ తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా తయారైందని సమాచారం.
సబ్ కమిటీ సమావేశంలో చర్చ
సోమవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పెనమలూరు నియోజకవర్గం అంశం చర్చకు వచ్చింది. నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న ఒత్తిడి వస్తోందన్న అంశాన్ని ఈ సందర్భంగా మంత్రులు, అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. విజయవాడను ఆనుకుని ఉండే పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపకుండా నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలను కలిపితే ఎలా అన్న అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడకు దగ్గరగా ఉన్న నియోజకవర్గాల విషయంలో.. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో నిర్ణయం తీసుకుందామని సీఎం చంద్రబాబు అన్నట్టు సమాచారం.
ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా యార్లగడ్డ అడుగులు
విజయవాడకు సమీపంలో ఉండటం.. విజయవాడ విమానాశ్రయాన్ని కలిగి ఉన్న గన్నవరం నియోజకవర్గాన్ని కూడా విజయవాడలో కలపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అక్కడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ, జిల్లా ఇన్‌చార్జి మంత్రికి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెబుతున్నారు. విజయవాడ రూరల్ మండలం ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాలు మాత్రం కృష్ణాజిల్లాలో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఒక నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలను ఒకే రెవెన్యూ డివిజన్‌తో పాటు, ఒకే జిల్లాలో ఉండాలన్నది నిర్దేశిస్తోంది. ఈ లెక్కన చూస్తే గన్నవరం నియోజకవర్గాన్ని అక్కడి ప్రజలు, స్థానిక ఎమ్మెల్యే కూడా సమ్మతం తెలపటంతో ఎన్టీఆర్ జిల్లాలోకి తీసుకురావటం అన్నది సహేతుకంగా కనిపిస్తోంది.
తెరపైకి మరో వాదన
గన్నవరం నియోజకవర్గం, పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే కృష్ణాజిల్లా చిన్నదైపోతుందని మంత్రి కొల్లు రవీంద్ర సరికొత్త వాదనలు తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఈ వాదనతో అంతా గందరగోళానికి దారి తీస్తోంది. కృష్ణాజిల్లాలోకి అతిపెద్ద కైకలూరు నియోజవర్గం వచ్చి కలవనుంది. ఇలాంటపుడు కృష్ణాజిల్లా ఎందుకు చిన్నదవుతుందో మంత్రికే తెలియాలి.