శ్రీశైలం రహదారిలో విరిగిపడిన కొండ చరియలు
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:45 PM
రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై లింగాలగట్టు వద్ద తెల్లవారుజామున కొండచరియలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి.
శ్రీశైలం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై లింగాలగట్టు వద్ద తెల్లవారుజామున కొండచరియలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఆ సమయంలో వాహన రాకపోకలు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఉదయం శ్రీశైలం నుంచి తెలంగాణ వైపునకు వెళ్లిన వాహనాలు పూర్తిగా నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి రోడ్డుపై అడ్డంగా పడిన కొండచరియలను ఎక్స్‌కవేటర్ సహాయంతో తొలగించారు. అనంతరం శ్రీశైలంలో నిలిచిపోయిన వాహనాలు వచ్చేందుకు అనుమతిచ్చారు. ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద కొండల నుంచి బురదనీటి కారనంగా రాళ్లు జారి పడ్డాయి. దీంతో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇళ్లు, మూడు షాపులు పూర్తిగా ఽధ్వంసమయ్యాయి. వెంటనే సున్నిపెంట సీఐ చంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించి రాళ్లను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా సున్నిపెంట పూర్ణానంద ఆశ్రమం ప్రాంతంలో అనేక కాలనీల్లో భారీగా వర్షం నీరు ప్రవహించింది. ఆరో వార్డులోని ఒక రేషన షాపులో సుమారు 72 క్వింటాళ్ల బియ్యం తడిసిపోయింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం మండల ఇనచార్జ్ యుగేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రమణ, సురేష్ తదితరులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి భాదితులకు తగు సహాయక చర్యలు చేశారు.
శ్రీశైలానికి నిలిచిన రాకపోకలు
శ్రీశైలంలో కురిసిన భారీ వర్షం కారణంగా బుధవారం తెల్లవారుజాము నుంచి గమ్యస్థానాలకు తిరుగు ప్రయాణమయ్యే వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. శ్రీశైలం నుంచి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ వైపునకు వెళ్లేందుకు రోడ్ క్లియరెన్స లేకపోవడంతో ఫారెస్ట్ అధికారులు రాకపోకలను నిలిపివేశారు. వసతి గదులు ఖాళీ చేసి వెళ్లేందుకు సిద్ధమైన యాత్రికులు టోల్‌గేట్ వద్ద బారులుదీరారు. అదే విధంగా ఆర్టీసీ బస్టాండ్‌లో ఒక్క బస్సు కూడా కదలకపోవడంతో వందలాది మంది యాత్రికులు అవస్థలుపడ్డారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆఽధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో అల్పాహారాలు, మంచినీరు, పాలు, బిస్కెట్లను బస్టాండ్, ఔటర్ రింగ్‌రోడ్డు, శిఖరం ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద యాత్రికులకు అందించారు. దాదాపు ఆరుగంటల తర్వాత తెలంగాణవైపునకు వాహనాలు అనుమతించగా సాయంకాలానికి దోర్నాలవైపు నుంచి కర్నూలు, విజయవాడ వెళ్లే వాహనాలను అధికారులు అనుమతించారు.