President of Praja Chaitanya Vedika: రైతుల పేర్లు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కావడం లేదు
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:09 AM
రాష్ట్రంలో వ్యవసాయ భూముల ఆస్తి హక్కుదారులు తమ పేర్లను, స్థిరాస్తులను వెబ్ ల్యాండ్‌లో నమోదు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు...
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు: ప్రజా చైతన్య వేదిక
గుంటూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ భూముల ఆస్తి హక్కుదారులు తమ పేర్లను, స్థిరాస్తులను వెబ్ ల్యాండ్‌లో నమోదు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ తెలిపారు. సోమవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ భూముల హక్కుదారులు తమ భూములను వారసత్వంగా రిజిస్ర్టేషన్ చేయాలన్నా, ఇతరులకు అమ్ముకున్నా/కోర్టుల ద్వారా రిజిస్ర్టేషన్ జరిగినా.. ప్రస్తుత యజమాని పేరుతో 1బీ, 10బీ అడంగల్‌లో, ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావడం లేదు. వీరి పేర్లు మ్యుటేషన్ ద్వారా ఆన్‌లైన్ వెబ్‌సైట్లో నమోదు కావాలంటే ‘ఇతరులు’ అన్న సూచిక దగ్గర యజమానుల పేర్లను వెబ్‌సైటు తీసుకోవట్లేదు. దీంతో వ్యవసాయ భూముల యజమానులు భూములు అమ్ముకోలేక, ఇతరులకు, తమ వారసులకు ఇవ్వలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంతో సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్లు మందగించాయి. భూ యజమానులు కొన్ని నెలలుగా ఎమ్మార్వో, జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. ఇది సీసీఎల్‌ఏ ప్రధాన కార్యాలయం చేయాల్సిన పని అని, స్థానిక రెవెన్యూ అధికారులు తప్పించుకుంటున్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.