Share News

Land Resurvey Error: ఒక్కో కూలీకి 325ఎకరాలు

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:30 AM

వైసీపీహయాంలో ఆనాటి పాలకుల పాపం.. రెవెన్యూ అధికారుల బాధ్యతారాహిత్యం.. రీసర్వే మాయాజలం.. వెరసి రెక్కాడితే తప్ప పూట గడవని నిరుపేద కుటుంబాలకు శాపంగా మారింది.

Land Resurvey Error: ఒక్కో కూలీకి  325ఎకరాలు

గత జగన్‌ ప్రభుత్వంలో రీసర్వే మాయాజాలం

కర్నూలు జిల్లాలో 25-30 వేల మందిపైగా బాధితులు

ఒక్క కృష్ణాపురంలోనే 81 మందికి ఒకే ఎల్‌పీఎం నంబరు

రికార్డుల్లో ఒక్కొక్కరికీ 325 ఎకరాలు చూపుతున్న వైనం

‘తల్లికి వందనం’ అందక విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

పింఛన్‌, రేషన్‌ కార్డులు కూడా పోతాయేమోనని భయం

  • ఒక్క కృష్ణాపురంలోనే 81 మందికి ఒకే ఎల్‌పీఎం నంబరు

  • రికార్డుల్లో ఒక్కొక్కరికీ 325 ఎకరాలు చూపుతున్న వైనం

  • కర్నూలు జిల్లాలో 25-30 వేల మందిపైగా బాధితులు

  • వందల ఎకరాల భూమి చూపడంతో పథకాలకు అనర్హత

  • ‘తల్లికి వందనం’ అందక విద్యార్థుల తల్లితండ్రుల ఆందోళన

కర్నూలు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీహయాంలో ఆనాటి పాలకుల పాపం.. రెవెన్యూ అధికారుల బాధ్యతారాహిత్యం.. రీసర్వే మాయాజలం.. వెరసి రెక్కాడితే తప్ప పూట గడవని నిరుపేద కుటుంబాలకు శాపంగా మారింది. ఆరు దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన ఒకటి, రెండు ఎకరాల సాగుభూమి (డీ-పట్టా)లో సేద్యం చేస్తూ.. మిగతా సమయంలో కూలి పనులకెళ్తూ జీనవం సాగించే కూలీలు.. జగన్‌ ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వే కారణంగా వందల ఎకరాలకు యజమానులైపోయారు. దీంతో వారి పిల్లలకు ‘తల్లికి వందనం’ డబ్బు ఖాతాలో జమ కాలేదు. సచివాలయానికి వెళ్లి విచారిస్తే.. ‘మీ పేరిట వందల ఎకరాల భూమి ఉంది. అందుకే తల్లికి వందనం పథకానికి మీరు అనర్హులయ్యారు..’ అని అక్కడి సిబ్బంది చెప్పిన సమాధానం విని ఆ కూలీలు అవాక్కయ్యారు. న్యాయం చేయాలని కోరుతూ మండల రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు. వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో రీసర్వే జాయింట్‌ ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం) నంబరు-1662 కింద 81 మందికి ఒక్కొక్కరికీ 325 ఎకరాలు భూమి ఉన్నట్లు చూపడంతో ‘తల్లికి వందనం’ కోల్పోయామని పేర్కొంటూ.. కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వారంతా తమ గోడు వెల్లబోసుకున్నారు. కర్నూలు జిల్లా అంతటా రీసర్వే బాధితులు 25 వేల మందికిపైగా అన్నారని ఓ అధికారే పేర్కొనడం కొసమెరుపు.


పంఛను తీసేస్తారేమోనని భయంగా ఉంది: మద్దమ్మ

నా పేరు మద్దమ్మ. స్వగ్రామం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండం కృష్ణాపురం. నిరుపేదనైన నా పేరిట 5 ఎకరాలు మెట్ట పొలం ఉంది. ముగ్గురు కొడుకులకు నాలుగు ఎకరాలు పంచేశాను. నాకున్నది ఎకరం మాత్రమే. ఆ పొలం సేద్యం చేస్తూనే కూలి పనులకు వెళ్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో మా ఊర్లో రీసర్వే చేశారు. రికార్డుల్లో నా పేరిట 325.89 ఎకరాలు ఉన్నట్లు చూపుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రూ.4 వేల పింఛన్‌ వస్తుంది. వందల ఎకరాలు భూమి ఉందని ఆ పింఛన్‌ తీసేస్తారేమోనని భయంగా ఉంది. న్యాయం చేయండి సారూ..!


కూలికి వెళ్లే నాకు 325 ఎకరాలా..: మద్దిలేటి

నా పేరు రెడ్డిపోగు మద్దిలేటి. మాది వెల్దుర్తి మండలం కృష్ణాపురం. మా జేజినాయనకు 60 ఏళ్ల క్రితం 1.46 ఎకరాలు ప్రభుత్వ భూమిని అసైన్‌ చేసి డీ-పట్టా ఇచ్చారు. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. నాకు ముగ్గురు కొడుకులు. పెద్దకొడుకు చరణ్‌ డిగ్రీ చదువుతున్నాడు. మిగిలిన ఇద్దరు పిల్లలకు ‘తల్లికి వందనం’ రూ.26 వేలు రావాల్సి ఉంది. నా పేరిట 325 ఎకరాలు ఉందని ‘తల్లికి వందనం’ డబ్బు జమ చేయలేదు. నాలాంటి వాళ్లు మా ఊళ్లో 81 మంది ఉన్నారు.

తల్లికి వందనం డబ్బు జమ చేయలేదు: మల్లేశ్వరి

నా పేరు కురవ మల్లేశ్వరి. మాది కర్నూలు జిల్లా వెల్దుర్తి మం డం కృష్ణాపురం. నాకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. భర్త అనారోగ్యంతో చనిపోయారు. కూలీనాలీ చేసి పిల్లలను చదివిస్తున్నాను. నా ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం డబ్బులు రావాల్సి ఉంటే ఖాతాలో జమ కాలేదు. సచివాలయంలో విచారిస్తే నా పేరిట 325 ఎకరాలు ఉందని చెబుతున్నారు. నా పేరిట ఉంది 1.74 ఎకరాలే. నాకు న్యాయం చేయాలి.


జగన్‌ పాపం.. పేదలకు శాపం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రీసర్వే కాంట్రాక్టు హైదరాబాద్‌కు చెందిన సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ సిబ్బంది డ్రోన్ల ద్వారా సర్వే చేసి రైతుల భూ వివరాలను రికార్డుల్లో నమోదు చేశారు. డ్రోన్‌ సర్వే అనంతరం సర్వే చేసిన భూమి ఎవరి ఆధీనంలో ఉంది..? భూ యజమానులు ఎవరు.. హక్కుదారులు ఎవరు..? అని నిర్ధారించాల్సి ఉంది. గ్రామ సభలు ద్వారా ఆ భూములు వివరాలు భూ యజమానులకు తెలిపి ఫారం-54 ద్వారా యజమానుల నుంచి ఒప్పంద పత్రం తీసుకోవాలి. నాడు అధికారులు అవేమి చేయలేదు. కొన్ని దశాబ్దాల తర్వాత భూముల రీసర్వే చేపట్టారు. ఈ మధ్యలో తండ్రి పేరిట ఉన్న భూములను కొడుకులు పంపకాలు చేసుకొని పట్టాదారు పాసు పుస్తకాలు కూడా తీసుకున్నారు. ఉదాహరణకు... ఓ తండ్రికి 15 ఎకరాలు భూమి, ముగ్గురు కొడుకులు ఉన్నారనుకుంటే తలా 5 ఎకారలు చొప్పున పంచుకున్నారు. ఆ మొత్తం భూమికి ఒకే జాయింట్‌ ఎల్‌పీఎం నంబరు ఇవ్వడం వల్ల ముగ్గురి పేరిట తలో 15 ఎకరాలు చూపుతోంది. ఫలితంగా వారంతా తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు కోల్పోవాల్సి వస్తోంది. రికార్డులు సరి చేయకపోతే పింఛన్‌, రేషన్‌కార్డులు, ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డులు కోల్పోవాల్సి వస్తుందేమోనని పేదలు భయందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటి జగన్‌ పాపాలు నిరుపేదలకు శాపాలై వెంటాడుతున్నాయంటూ వాపోతున్నారు.


జిల్లా వ్యాప్తంగా తప్పుల తడక

ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం గ్రామంలో జయలక్ష్మి పేరిట 5.74 ఎకరాలుంటే 11.44 ఎకరాలు, పెసలబండ గ్రామంలో హేమలత పేరట 2.73 ఎకరాలుంటే 10.40 ఎకరాలు, బనవాసి గ్రామంలో సన్నప్ప పేరిట 5ఎకరాలుంటే 10.63 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో వారంతా ‘తల్లికి వందనం’ కోల్పోయారు. ఎమ్మిగనూరు మండలంలోనే రీసర్వే బాధితులు 3 వేల మందికిపైగా ఉన్నట్టు సమాచారం. కల్లూరు మండ లం ఉల్లిందకొండ గ్రామంలో బి.మహేశ్వరి పేరిట సర్వే నంబరు 620/32లో రూ.0.61 సెంట్లు డీ-పట్టా ఇచ్చారు. బి.నిర్మల పేరిట సర్వే నంబరు 620/36లో ఎకరం పొలం డీ-పట్టా ఇచ్చారు. రీసర్వే రికార్డుల్లో 10ఎకరాలకు పైగా భూమి ఉన్నట్లు చూపడంతో ‘తల్లికి వందనం’ కోల్పోయారు. మండలంలో రీసర్వే జరిగిన 11 గ్రామాల్లో 5వేల మందికిపైగా బాధితులు ఉన్నారు. జిల్లాలో దాదాపు 25-30 వేల మందికిపైగా నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులు జగన్‌ రీసర్వే వల్ల సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు.


81 మందికి 325 ఎకరాలు ఎలా..?

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురంలో సర్వే నంబరు 1,185 పరిధిలో 325.89 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 60 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం అసైన్‌ చేసి నిరుపేదలు, దళితులకు ఒక్కో కుటుంబానికి రెండు, మూడు ఎకరాలు చొప్పున సాగు పట్టా (డీ-పట్టా) ఇచ్చింది. వారంతా ఆ భూమిలో సేద్యం చేస్తూనే.. మిగిలిన సమయంలో వ్యవసాయ కూలి పనులకు వెళ్తుంటారు. ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. అయితే సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. అయితే గ్రామంలోని పలువురు విద్యార్థుల తల్లుల ఖాతాలో ఆ డబ్బులు జమ కాలేదు. సచివాలయంలో విచారిస్తే ‘మీ పేరిట 325 ఎకరాలు భూమి ఉండడంతో అనర్హులు జాబితాలో ఉన్నారు. అందుకే రాలేదు’ అని చెప్పారు. ఒకే జాయింట్‌ ఎల్‌పీఎం నంబరు-1662లో 81 మందికి ఒక్కొక్కరికీ 325.89 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో చూపించారు. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు. తమకు ఉన్న వాస్తవ భూమినే రికార్డుల్లో నమోదు చేసి న్యాయం చేయాలని కోరుతూ ప్రజా ఫిర్యాదుల వేదికలో ఇన్‌చార్జి డీఆర్‌వో వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Jun 24 , 2025 | 03:30 AM