భూ సమస్యలకు ఇక చెక్!
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:53 AM
భూమి సమస్యలు పరిష్కారం కాక రైతులు, భూ యజమానులు ఏళ్లతరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు అర్జీలు ఇచ్చి ఆశగా ఎదురుచూస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాకుండానే ఎందరో వృద్ధాప్యంతో చనిపోతున్నారు. ఇటువంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది.
- కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ క్లినిక్‌ల ఏర్పాటు
- సోమవారం నుంచి ప్రారంభమైన సేవలు
- 22-ఎ, రీసర్వే, విస్తీర్ణం నమోదులో తేడా, ఆర్‌వోఆర్ తదితర సమస్యలపై దృష్టి
-నిర్దేశిత గడువులోపు పరిష్కారానికి స్పష్టమైన హామీ
-రెవెన్యూ క్లినిక్ డెస్క్‌లకు ఇన్‌చార్జిగా డిప్యూటీ కలెక్టర్ పోతురాజు నియామకం
భూమి సమస్యలు పరిష్కారం కాక రైతులు, భూ యజమానులు ఏళ్లతరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు అర్జీలు ఇచ్చి ఆశగా ఎదురుచూస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాకుండానే ఎందరో వృద్ధాప్యంతో చనిపోతున్నారు. ఇటువంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది.
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం :
భూ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రెవెన్యూ క్లినిక్‌ల పేరుతో కలెక్టరేట్‌లో ప్రత్యేక డెస్క్‌లను ఏర్పాటు చేసింది. జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లోనూ రెవెన్యూ క్లినిక్‌లను సోమవారం ప్రారంభించింది. భూములకు సంబంధించి వివిధ రకాల సమస్యలను పరిశీలించి, సమస్య ఎక్కడుందో తెలుసుకుని, సత్వరమే పరిష్కరించేందుకు ఈ క్లినిక్‌లు పనిచేస్తాయి. కలెక్టరేట్‌లోని రెవెన్యూ క్లినిక్‌లలో ఐదు డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో నిపుణులైన రెవెన్యూ అధికారులు, సిబ్బందిని నియమించారు. దీంతో పాటు సీనియర్ సిటిజన్‌ల సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఒక డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
జిల్లా కేంద్రంలో ఐదు డెస్క్‌లు
కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమానికి అనుబంధంగా రెవెన్యూ విభాగంలో భూమి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పౌరసరఫరాల సంస్థ డిప్యూటీ కలెక్టర్ పోతురాజును రెవెన్యూ క్లినిక్ డెస్క్‌లకు ఇన్‌చారి అధికారిగా నియమించారు. ఆయన పర్యవేక్షణలో ఈ రెవెన్యూ క్లినిక్‌లు పనిచేస్తాయి. రెవెన్యూ-సర్వేశాఖ కృష్ణాజిల్లా పేరుతో దరఖాస్తుల పరిశీలన, సలహాలు, సూచనలు అందించేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. 22-ఎ భూముల సమస్యలు, భూసేకరణ సమస్యలు, ఆర్‌వోఆర్, పట్టాదారు పాస్‌పుస్తకాలు, సుమోటో అడంగల్ కరక్షన్ సంబంధిత సమస్యలు, రీ సర్వే, విస్తీర్ణం నమోదులో తేడా, జాయింట్ ఎల్‌పీఎం, ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఐదు డెస్క్‌లను సిద్ధం చేశారు. ఇక్కడ దరఖాస్తులను అందుకున్న అధికారులు సమస్యలు ఏమిటనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వచ్చిన అర్జీలను రిజిస్టర్‌లో, ఆన్‌లైన్‌లో నమోదు చేస్త్తున్నారు. ఏ మండలంలో సమస్యలు ఉన్నాయో పరిశీలించి సంబంధిత తహసీల్దార్‌లకు ఫోన్ చేసి ఈ సమస్యలు ఎందుకు ఏర్పడ్డాయో తెలుసుకుని పరిష్కార మార్గాన్ని కూడా ప్రత్యేక డెస్క్‌లలో ఉన్న రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూమి రికార్డులకు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించి, సరైన పత్రాలు లేకుంటే తీసుకురావాలని కూడా సూచిస్తున్నారు. అన్ని పత్రాలు పరిశీలించిన అనంతరం ఎన్ని రోజుల్లోగా ఈ సమస్యలను పరిష్కరించాలో తహసీల్దార్‌లకు సూచిస్తున్నారు. సోమవారం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో పట్టాదారు పాస్‌పుస్తకాలు, సరిహద్దులు నిర్ణయించడంలో జరిగిన తప్పులు, రీ సర్వేలో భూమి విస్తీర్ణం తగ్గడం, భూమి ఆక్రమణలు తదితర అంశాలపై 77 ఫిర్యాదులు అందాయి.
అర్జీలు ఇచ్చినా పరిష్కారం కాకపోవడంతో..
ఇప్పటి వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో భూమి సమస్యలను పరిష్కరించాలని నెలల తరబడి బాధిత రైతులు తిరిగినా పరిష్కారానికి నోచుకోవడంలేదు. దీంతో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమానికి వచ్చి రైతులు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఒకటీ రెండు విషయాల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ లేదా జేసీ ఆయా మండలాల తహసీల్దార్‌లతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని చెబుతున్నారు. మిగిలిన అర్జీలను ఆన్‌లైన్‌లో సంబంధిత తహసీల్దార్‌లకు పంపి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని చెప్పినా, అవి పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. రెవెన్యూ విభాగానికి సంబంధించిన సమస్యలపై కలెక్టర్ లేదా జేసీ అర్జీలను స్వీకరించి సంబంధిత మండలాల తహసీల్దార్‌లు లేదా ఆర్డీవోలకు పంపినా ఈ సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో బాధిత రైతులు పదేపదే కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని తహసీల్దార్ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్‌లోనూ రెవెన్యూ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఎంతమేర భూమి సమస్యలు పరిష్కారం అవుతాయో వేచిచూడాలి. రెవెన్యూ క్లినిక్‌లో అర్జీలు ఇచ్చినా కలెక్టర్ వద్దకు వెళ్లి ఈ సమస్యలను చెప్పుకునే వెసులుబాటు కూడా ఉందని రెవెన్యూ అధికారులు అంటున్నారు.