Deputy CM Pawan: విశాఖలో భూ మాఫియా
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:23 AM
రాష్ట్రంలో వివిధ ప్రాంతాలతో పాటు గతంలో హైదరాబాద్‌లో ప్రజల విలువైన భూములను చెరపట్టిన ముఠాలు విశాఖలో దిగాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో అక్రమాలు చేసిన ముఠాలు ఉత్తరాంధ్రలో మకాం వేశాయి
విలువైన భూముల స్వాహాకు యత్నం
కొందరు రాజకీయ నేతల వత్తాసు
తక్షణం చర్యలు తీసుకోండి
చంద్రబాబును కోరిన పవన్ కల్యాణ్
ఎంతటి వ్యక్తులైనా వదిలిపెట్టొద్దు
అవసరమైతే పీడీ యాక్ట్ కేసులు
కలెక్టర్, ఎస్పీలకు సీఎం ఆదేశం
భూ వివాదాల్లో టీడీపీ, జనసేన బీజేపీలు తలదూర్చవని స్పష్టీకరణ
విశాఖలో భూ మాఫియా మకాం వేసింది. లోకల్ కబ్జాదారులతో కలిసి విలువైన భూములను స్వాహా చేసేందుకు ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. వాటికి కొందరు రాజకీయ నేతలు వంతపాడుతున్నారు. ఉత్తరాంధ్ర భూములను కాపాడేందుకు గట్టి ఆదేశాలు ఇవ్వండి.
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపండి. భూ వివాదాల్లో తలదూర్చే వారు ఎవరైనా, ఎంతటి వ్యక్తులైనా వదిలిపెట్టేది లేదు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైల్లో వేస్తాం. ఈ విషయంలో కలెక్టర్, ఎస్పీలు పక్కాగా ఉండాలి. అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం సహా ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల కలెక్టర్లు భూ వివాదాలపై అప్రమత్తంగా ఉండాలి.
- సీఎం చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ ప్రాంతాలతో పాటు గతంలో హైదరాబాద్‌లో ప్రజల విలువైన భూములను చెరపట్టిన ముఠాలు విశాఖలో దిగాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వెంటనే దృష్టిసారించి భూ మాఫియాను కట్టడి చేయాలని, విశాఖ సహా ఉత్తరాంధ్ర భూములను కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉత్తరాంధ్రలో భూ మాఫియా ఆగడాల గురించి పవన్ ప్రస్తావించారు. ‘‘ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్దఎత్తున పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి.
వేగంగా అభివృద్ధి జరుగుతోంది. దీంతో విశాఖ, విజయనగరం వంటి జిల్లాల్లో భూములకు భారీ ధరలు పెరిగాయి. ఇక్కడి భూములను చేజిక్కించుకోవాలని భూ మాఫియా ప్రయత్నిస్తోందని ప్రజలు చెబుతున్నారు. గతంలో హైదరాబాద్‌లో భూ మాఫియా రెచ్చిపోయింది. అక్కడి ముఠాలు కొన్ని ఇప్పుడు విశాఖలో మకాం వేశాయు. భూ కబ్జాలకు ప్రయత్నిస్తున్నాయి. ఈ దశలోనే ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలి. భూ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి’’ అని చంద్రబాబును పవన్ కల్యాణ్ కోరినట్లు తెలిసింది. దీనిపై సీఎం స్పందించారు. భూ వివాదాలు, వ్యవహారాల్లో తాము, జనసేన, బీజేపీలు తలదూర్చవని స్పష్టత ఇచ్చారు. ‘‘భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా వదలిపెట్టం. పాత రికార్డులను పరిశీలించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. భూ వివాదాల్లో రాజకీయ పార్టీలు, వ్యక్తులు, ప్రొఫెషన ల్ లిటిగెంట్స్ తలదూర్చినా కఠిన చర్యలు ఉండాలి’’ అని సీఎం స్పష్టం చేశారు. చంద్రబాబు మాట్లాడి న తర్వాత ఇదే అంశాన్ని పవన్ మరోసారి ప్రస్తావించారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తున్న ఉత్తరాంధ్రలోని భూములపై కొందరు నేతలు కన్నేశారని చెప్పారు. వారు కొత్తగా భూ వ్యవహారాల్లో తలదూర్చి వివాదాలను సృష్టిస్తున్నార ని తెలిపారు. దీంతో అధికారులు కూడా సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, విశాఖ జోన్‌లో ఈ వ్యవహారాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. భూ కబ్జా వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకొనేలా గట్టి ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు.