Land Grab: జగన్ బంధువుల భూకబ్జాలు
ABN , Publish Date - Oct 10 , 2025 | 06:33 AM
మాజీ సీఎం జగన్ హయాంలో జరిగిన కబ్జాల నుంచి ప్రభుత్వ భూములకు విముక్తి లభిస్తోంది. పులివెందుల, తొండూరు, సింహాద్రిపురం, లింగాల తదితర గ్రామాల పరిధిలో జగన్ సన్నిహిత బంధువుల...
పేదల పేరిట పట్టాలు.. విచారణలో బయటపడ్డ నిజాలు
వాటి స్వాధీనానికి కడప కలెక్టర్ ఆదేశం
కడప, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ హయాంలో జరిగిన కబ్జాల నుంచి ప్రభుత్వ భూములకు విముక్తి లభిస్తోంది. పులివెందుల, తొండూరు, సింహాద్రిపురం, లింగాల తదితర గ్రామాల పరిధిలో జగన్ సన్నిహిత బంధువుల భూ అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’ గతంలో అనేక కథనాలు ప్రచురించింది. ప్రభుత్వం మారిన తర్వాత దీనిపై విచారణకు ఆదేశించింది. వైఎస్ వివేకా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఆయన కుటుంబీకులు... జగన్ పెద్దనాన్న అయిన వైఎస్ ప్రతాప్ రెడ్డి కుమారుడు వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్పడిన భూ ఆక్రమణలు, పేదల పేరుతో డీకేటీ పట్టా భూములు పొందడంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గురువారం ఆదేశించారు. శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డికి కడప నగరంలో ఆసుపత్రి ఉంది. అయినప్పటికీ... వారి కుటుంబ సభ్యులు పేదల పేరుతో లింగాల మండలంలోని దొండ్లవాగులో సర్వే నంబరు-15లో ఒక్కొక్కరి పేరిట 5 ఎకరాల భూములు తీసుకున్నారు. ఈ భూములను 2020 మేలో రిజిస్టర్ కూడా చేసుకున్నట్లు రికార్డుల్లో ఉన్నాయి. ఈ భూముల్లో చీనీ, నిమ్మ సాగు చేస్తున్నారు. ఇక... వైఎస్ మధుసూదన్ రెడ్డి తొండూరు మండలం మల్లెల గ్రామంలో పెద్దఎత్తున భూములు ఆక్రమించి ఎస్టేట్ నిర్మించుకున్నట్లు తేలింది. ఇక్కడ ఉన్న చెరువుల్లో బోర్లు వేసి పైపులైన్ల ద్వారా ఎస్టేట్‌కు సాగునీరు అందిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ భూములే అని నిర్ధారణ అయ్యింది. తొండూరు మండలంలోని మల్లెల, లింగాల మండలంలోని దొండ్లవాగులో ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవాలని కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గురువారం రాత్రి అధికారులను ఆదేశించారు.