భూ తగాదాలే హత్యకు కారణం
ABN , Publish Date - May 02 , 2025 | 11:41 PM
ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
కాంగ్రెస్ నేత హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు
హత్య కేసులో 10 మందిపై కేసులు
ముగ్గురిని అరెస్టు చేసిన అడిషనల్ ఎస్పీ
మరో ఏడుగురిని త్వరలో పట్టుకుంటామని వెల్లడి
ఆలూరు, మే2(ఆంధ్రజ్యోతి): ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఏప్రిల్ 27వ తేదీన గుంతకల్ సమీపంలో టిప్పర్‌తో ఢీకొట్టి ఆపై వేట కొడవళ్లతో నరికి హత్య చేసిన కేసులో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ హుసేన్‌పీరా నేతృత్వంలో ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ హత్య కేసులో గుంతకల్‌కు చెందిన రాజేష్, బేఫర్ గౌసియా, కత్రిమాల సౌభాగ్యలను శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..... అనంతపురం జిల్లా గుంతకల్ పట్ణంలో ఆలూరు రోడ్డులో గాయత్రి ఫంక్షన్‌హాల్‌ల వద్ద ఉన్న 1.10 ఎకరాల ఇళ్ల స్థలాల భూమి, సిద్ధార్థ కాలనీలో 9 ఎకరాల దేవదాయ భూమి, పెద్దన్నకు సంబంధించిన 8 ఎకరాల భూమిని కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ అడ్డు వచ్చి తనకు కాకుండా చేసి ఆయనకు సహకరిస్తున్న రాజేష్, గౌసియాలను దూషించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించడంతో కక్ష పెంచుకున్నారని, ఎలాగైనా లక్ష్మీనారాయణను హత్య చేయాలని రెండు నెలల క్రితం పథకం రూపొందించారని తెలిపారు.. ఇందులో భాగంగానే ఓ టిప్పర్‌ను కొనుగోలు చేసి లక్ష్మీనారాయణ కదలికలను గమనిస్తూ రెక్కీ నిర్వహిస్తూ వచ్చారు. గత నెల 27వ తేదీన కె.పెద్దన్న ఇంటి వద్ద సమావేశమై హత్యకు పక్కాగా ప్లాన్ చేశారన్నారు. అనుకున్న విధంగానే గత నెల ఏప్రిల్ 27వ మధ్యాహ్నం 2;15 గంటలకు గుంతకల్ నుంచి చిప్పగిరికి ఇన్నోవా వాహనంలో వస్తుండగా రైల్వే బ్రిడ్జి వద్ద మొలగవళ్లికి చెందిన మేకల శ్రీనివాసులు అతివేగంగా టిప్పర్‌తో ఢీకొన్నాడు. వెనక కారులో ఫాలో చేస్తూ వస్తున్న పెద్దయ్య, వడ్డే నవీన్ వెంటనే కారు అద్దాలు పగలగొట్టి వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లతో, ఇనుప రాడ్లతో తలపై నరికి హత్య చేశారు. మిగిలిన వారు ఆ మార్గంలో ఎవ్వరూ రాకుండా జాగ్రత్తలు వహించి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. ఈ హత్య కేసులో మిగిలిన ముద్దాయిలు కె.పెద్దన్న, బోయ మేకల శ్రీనివాసులు, బోయ గోవిందు, బోయ రాము, వడ్డే నవీన్, ధర్మ, మనోహర్‌లను కూడా త్వరలో పట్టుకుంటామని అడిషనల్ ఎస్పీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బాధితులు ముందుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం మల్లికార్జునచౌదరి, చికెన్ రామాంజనేయులు, అరికెర మల్లేష్‌ల ప్రమేయం ఉన్నట్లు వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదన్నారు. ఈ హత్య కేసును లోతైన దర్యాప్తు చేసి ఇందులో ఇంకా ఎవరి పాత్ర ఉందో విచారణ చేపట్టి అందులో ఎవరు ఉన్నా కచ్చితంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పోలీసులపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. హత్యకు గురైన చిప్పగిరి లక్ష్మీనారాయణ కుటుంబానికి గన్‌మెన్‌లు ఇచ్చే అంశం తమ పరిధిలో లేదన్నారు. చిప్పగిరిలో ఆయన నివాసం ఉంటున్న కాలనీలో పోలీసు పికెట్ కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశంలో పత్తికొండ డీయస్పీ వెంకటరామయ్య, సీఐ రవిశంకర్‌రెడ్డి, ఆలూరు, హొళగుంద, చిప్పగిరి ఎస్‌ఐలు మహబూబ్‌బాషా, దిలీప్‌కుమార్, ఏపీ శ్రీనివాసులు ఉన్నారు.