Share News

పెదపట్నంలో భూముల రగడ!

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:47 AM

పెదపట్నంలోని ప్రభుత్వ భూముల్లో చెరువులు తవ్వకం వివాదాస్పదంగా మారింది. గ్రామస్థులు, మాజీ సైనికులు తమకు భూములు విక్రయించారంటూ అగ్రిమెంట్‌ పత్రాలు తెచ్చి కొందరు చెరువుల తవ్వకం చేపట్టారు. సర్వేయర్‌తో హద్దులు నిర్ణయించే పని ఆదివారం నిర్వహించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడకు చేరుకుని సర్వేను అడ్డుకున్నారు. ఈ ప్రభుత్వ భూమిలో మాకు హక్కు కల్పిస్తూ పట్టాలు ఇచ్చారని, మా భూమి చూపించి హద్దులు నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. మా భూములు చూపకుండా చెరువు తవ్వేస్తే ఎలా అంటూ నిలదీశారు. దీంతో సర్వే ప్రక్రియ నిలిచిపోయింది.

పెదపట్నంలో భూముల రగడ!

- ప్రభుత్వ భూముల్లో చెరువుల తవ్వకం

- హద్దులు నిర్ణయించేందుకు వచ్చిన సర్వేయర్‌

- తమకు పట్టాలిచ్చిన భూమి ఉందని అడ్డుకున్న గ్రామస్థులు

- సర్వే చేసి విడగొట్టాలని డిమాండ్‌

- కుదరదన్న సర్వేయర్‌.. నిలిచిపోయిన సర్వే

- కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న గ్రామస్థులు

పెదపట్నంలోని ప్రభుత్వ భూముల్లో చెరువులు తవ్వకం వివాదాస్పదంగా మారింది. గ్రామస్థులు, మాజీ సైనికులు తమకు భూములు విక్రయించారంటూ అగ్రిమెంట్‌ పత్రాలు తెచ్చి కొందరు చెరువుల తవ్వకం చేపట్టారు. సర్వేయర్‌తో హద్దులు నిర్ణయించే పని ఆదివారం నిర్వహించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడకు చేరుకుని సర్వేను అడ్డుకున్నారు. ఈ ప్రభుత్వ భూమిలో మాకు హక్కు కల్పిస్తూ పట్టాలు ఇచ్చారని, మా భూమి చూపించి హద్దులు నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. మా భూములు చూపకుండా చెరువు తవ్వేస్తే ఎలా అంటూ నిలదీశారు. దీంతో సర్వే ప్రక్రియ నిలిచిపోయింది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

మచిలీపట్నం ఉత్తరం మండలంలోని పెదపట్నం గ్రామం సముద్ర పక్కనే ఉంటుంది. గతంలో ఇక్కడి ప్రభుత్వ భూముల్లో కొంత భాగాన్ని గ్రామానికి చెందిన 102 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 45 సెంట్ల చొప్పున పట్టాలు ఇచ్చారు. కానీ భూమిని సర్వే చేయలేదు. సరిహద్దులు నిర్ణయించలేదు. పట్టాలు చేతికి వచ్చిన లబ్ధిదారులు ఈ భూములు తమవేనని భావిస్తూ వచ్చారు. అయితే ఈ భూములను కొందరు లబ్ధిదారులు తమకు విక్రయించేశారని ఇటీవల కాలంలో పలువురు పత్రాలు పుట్టించారు. ఈ భూముల పక్కనే మాజీ సైనికులకు ఇచ్చిన భూమిలో 30 ఎకరాలను కూడా తమకు విక్రయించేశారని పత్రాలు తెచ్చారు. మాజీ సైనికులు, గతంలో పట్టాలు తీసుకున్నవారు తమకు భూములు విక్రయించేశారని పైకి చెబుతూ కొందరు వ్యక్తులు పదిరోజులుగా ఈ భూములను చెరువులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. పేదలకు ఇచ్చిన భూమిలో చెరువులు తవ్వేందుకు సర్వే చేసేందుకు ఆదివారం ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు భూమి వద్దకు వెళ్లి సర్వే పనులను అడ్డుకున్నారు. గతంలో తమ పేరుతో ఈ భూములకు పట్టాలు ఇచ్చారని, వాటికి సరిహద్దులు నిర్ణయించి, ఆ తర్వాత మీరు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న భూముల్లో చెరువులు తవ్వుకోవాలని సూచించారు. సర్వే చేయకుండా చెరువులుగా తవ్వేస్తే, ఆ తరువాత తేడా వస్తే ఎవరు భాధ్యత వహిస్తారని సర్వేయర్‌తో గ్రామస్థులు వాదనకు దిగారు. ఈ రోజు సర్వే పనులను అడ్డుకున్నా, ఒకటీ రెండు రోజుల్లో సర్వే చేస్తామని సర్వేయర్‌ గ్రామస్థులతో బెదిరింపు ధోరణితో మాట్లాడటంతో గ్రామస్థులు మరింతగా ఎదురు తిరిగారు. దీంతో ఆదివారం జరగాల్సిన సర్వే పనులు నిలిచిపోయాయి.

సీఆర్‌జెడ్‌ పరిధిలో భూములు

కోస్తా నియంత్రణ మండలి(సీఆర్‌జెడ్‌) పరిధిలో సముద్రం అంచున 100 మీటర్ల దూరంలోనే పెదపట్నం గ్రామ పరిధిలో ఈ భూములు ఉన్నాయి. సీఆర్‌జడ్‌ పరిధిలో ఉన్న భూములలో ఎలాంటి చెరువుల తవ్వకాలు చేపట్టకూడదనే ఆంక్షలు కూడా ఉన్నాయి. గతంలో పేదలకు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు తమవేనని కొందరు చెరువుల తవ్వకాల పనులను చేపట్టడం, సర్వే చేయించే పనులు చేయడంతో ఈ భూముల అంశం వివాదాస్పదమవుతోంది, ప్రభుత్వ భూములను తమవిగా చూపి, వాటిని భీమవరానికి చెందిన ఒకరిద్దరు బడాబాబులకు లీజుకు ఇచ్చి సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ భూములను స్థానికులకైనా ఇవ్వాలి లేదా యథాస్థితిలో ఉంచాలని, అలా కాకుండా బయటి వ్యక్తులు సాగు చేసుకునేలా చెరువులుగా తవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఇతరులు ఆక్రమిస్తూ ఉంటే చూస్తూ ఉండబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి చెరువులుగా మారుస్తున్న విషయాన్ని స్థానిక నాయకులు పాలకులకు తెలియకుండా కొందరు పక్కదారి పట్టిస్తున్నారని పెదపట్నం గ్రామస్థులు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్థులు అంటున్నారు.

తాళ్లపాలెంలో జోరుగా బుసక తవ్వకాలు

తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని పల్లెపాలెంలోని భూముల నుంచి బుసక అక్రమ రవాణాకు వైసీపీ నాయకుడు ఒకరు అధికార పార్టీ నాయకుడి పేరును అడ్డుపెట్టి తెరలేపారు. ఓ వృద్ధురాలి సొంత పొలంలో నుంచే బుసకను తవ్వి ఆమె ఇంటి ఆవరణను మెరక చేసుకుంటామని చెప్పి బుసక తవ్వకాలు ప్రారంభించారు. దీంతో అధికారులు సూచనప్రాయంగా అంగీకరించారు. ఇదే అదనుగా భావించిన సదరు వైసీపీ నాయకుడు భారీగా యంత్రాలు, ట్రాక్టర్లు పెట్టి బుసకను తవ్వి విక్రయాలు జరిపేస్తున్నాడు. రెండు రోజుల పాటు రాత్రి, పగలు తేడా లేకుండా వందలాది ట్రాక్టర్ల బుసకను తరలించి చుట్టు పక్కల గ్రామాల్లో విక్రయించేసినట్లు సమాచారం. ఈ విషయంపై గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే వీఆర్‌ఏను పంపుతామని చెప్పి, సాగదీత ధోరణితో వ్యవహరించడం గమనార్హం. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో నగదు చేతులు మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Apr 28 , 2025 | 12:47 AM