బెజవాడలో ‘లులు’కు భూ కేటాయింపు
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:19 AM
నగరంలోని పాత బస్టాండ్ ఆర్టీసీ స్థలాన్ని ‘లులు’ మాల్ కోసం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 4.15 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆర్టీసీ స్థలాన్ని లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్‌ఐఎస్‌ఎం) గ్రూపునకు 65 సంవత్సరాల సుధీర్ఘ కాలానికి లీజుకు ఇస్తూ భూ కేటాయింపులు జరిపింది. ఆ తర్వాత మరో 33 సంవత్సరాలు పొడిగిస్తారు. మూడేళ్ల పాటు అద్దె వెసులుబాటును కల్పించింది.
- పాతబస్టాండ్ ఆర్టీసీ స్థలం 4.15 ఎకరాలు ఎంపిక
- జీ ప్లస్ 3 విధానంలో ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్
- రూ. 156 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ‘లులు’
- ఏర్పాటుకానున్న మొత్తం 120 రిటైల్ షాపులు
- బయటి వారి కోసం 1.34 లక్షల చదరపు అడుగుల స్థలం లీజుకు
- 200 వాహనాల సామర్థ్యంతో కూడిన పార్కింగ్ ఏరియా
- మల్లవల్లి మెగా ఫుడ్‌పార్క్ సీపీసీ నిర్వహణ చేపట్టనున్న ‘లులు’
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
నగరంలోని పాత బస్టాండ్ ఆర్టీసీ స్థలాన్ని ‘లులు’ మాల్ కోసం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 4.15 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆర్టీసీ స్థలాన్ని లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్‌ఐఎస్‌ఎం) గ్రూపునకు 65 సంవత్సరాల సుధీర్ఘ కాలానికి లీజుకు ఇస్తూ భూ కేటాయింపులు జరిపింది. ఆ తర్వాత మరో 33 సంవత్సరాలు పొడిగిస్తారు. మూడేళ్ల పాటు అద్దె వెసులుబాటును కల్పించింది. నిర్మాణం పూర్తి చేయటానికి నిర్దేశించిన కాలానికి ఈ మేరకు అద్దెను మినహాయించింది. పాత బస్టాండ్ ఆర్టీసీ స్థలంలో 2.32 లక్షల చదరపు అడుగుల స్థలంలో జీ ప్లస్ 3 విధానంలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్‌ను ‘లులు’ నిర్మించనుంది. ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ నిర్మాణం కోసం ‘లులు’ రూ. 156 కోట్లను ఖర్చు చేయబోతోంది. ఈ మాల్‌లో ‘లులు’ మొత్తం 120 రిటైల్ షాపులను ఏర్పాటు చేస్తుంది. బయటి వారికి ఈ మాల్‌లో 1.34 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇస్తుంది. మొత్తం 200 వాహనాల పార్కింగ్ ఏరియాను అభివృద్ధి చేస్తుంది. విజయవాడ పాతబస్టాండ్ స్థలం అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉంది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్లు అనుసంధానమయ్యే ప్రాంతంలో పాతబస్టాండ్ ఉంది. ఆసియాలోనే రెండో అతిపెద్ద బస్‌స్టేషన్, దేశంలోనే రెండో అతి పెద్ద జంక్షన్ పాతబస్టాండ్ స్థలానికి కూతవేటు దూరంలో ఉంది. విజయవాడలో బీసెంట్ రోడ్డు, లెనిన్ సెంటర్ వంటి ఇతర అనేక కమర్షియల్ ప్రాంతాలకు అత్యంత దగ్గరగా ఇది ఉంటుంది. లులు మాల్ ఏర్పాటుకు మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.
ఆర్టీసీ నుంచి స్థలం స్వాధీనంపై కలెక్టర్‌కు ఆదేశం
ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల పాతబస్టాండ్ స్థలాన్ని త్వరగా స్వాధీనంలోకి తీసుకుని పర్యాటక శాఖకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జీ.లక్ష్మీశకు నిర్దేశించింది. ఆర్టీసీ ప్రతిపాదనల మేరకు వారి అవసరాలకు తగినట్టు ప్రత్యామ్నాయ స్థలాలను కూడా త్వరగా చూసి తక్షణం ఆర్టీసీకి బదలాయింపు చేయాలని స్పష్టం చేసింది.
మల్లవల్లి మెగా ఫుడ్‌పార్క్‌లో సీపీసీ నిర్వహణ ‘లులు’ ఆసక్తి
విజయవాడలో మెగా షాపింగ్ మాల్ నిర్మాణంతో పాటు కృష్ణాజిల్లా మల్లవల్లిలోని మెగా ఫుడ్ పార్క్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పరిచిన సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)ని కూడా లులు నిర్వహించటానికి ఆసక్తి చూపింది. ఇటీవలే ‘లులు’ ప్రతినిధులు సీపీసీని సందర్శించి వెళ్లారు. ఈ సీపీసీలో పల్ప్ తయారీ, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, టెట్రా ప్యాకింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. విజయవాడలో ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌ను నిర్మించ టంతో పాటు సీపీసీ నిర్వహణ బాధ్యతలు చూడనుంది.
రంగంలోకి దిగాలని ఏపీఐఐసీకి ఆదేశాలు
టూరిజం పాలసీలో భాగంగా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) తీసుకున్న నిర్ణయం మేరకు ‘లులు’ సంస్థకు కేటాయించిన భూములలో తక్షణం ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ కోసం చర్యలు చేపట్టాల్సిందిగా ఏపీఐఐసీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నిర్ణీత క్రమంలో పనులు జరిగేలా పర్యవేక్షించాలని నిర్దేశించింది.
ఆందోళనల నడుమ భూ కేటాయింపులు
నగరంలో పాతబస్టాండ్ ఆర్టీసీ స్థలాన్ని ‘లులు’కు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. గతంలో పాతబస్టాండ్ స్థలాన్ని ఆనుకుని ఉన్న ప్రస్తుత పార్కు స్థలాన్ని అంబికా ఇతర సంస్థలకు అప్పగించినపుడు కూడా ఆందోళనలు పెద్ద ఎత్తున చేశారు. అప్పట్లో ఆర్టీసీ అధికారులు బీవోటీ కింద అప్పగించారు. అవి విఫల ప్రాజెక్టులుగా నిలవటం వల్ల వాటి భూ కేటాయింపులను రద్దు చేశారు. ఆ తర్వాత ఆ స్థలంలో పార్కును ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సారి పార్కు స్థలంతో పాటు ఆర్టీసీ గవర్నర్‌పేట-2 డిపో స్థలాన్ని కూడా అప్పగిస్తుండటంతో ఆందోళనలు మరింత తీవ్రస్థాయిలో జరిగే అవకాశం కూడా లేకపోలేదు.