Share News

Revenue Department: భూములిక లీజుకే

ABN , Publish Date - Aug 18 , 2025 | 04:21 AM

పరిశ్రమలు, కంపెనీలు, సంస్థలకు కేటాయించే భూములపై స్పష్టమైన నియంత్రణ అవసరమని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ భూ కేటాయింపు విధానం (ల్యాండ్‌ అలాట్‌మెంట్‌ పాలసీ-2012)లోని కీలక అంశాలను....

Revenue Department: భూములిక లీజుకే

  • మార్కెట్‌ రేటుకో,సగానికో విక్రయించొద్దు

  • నామమాత్రంగా,ఉచితంగానూ ఇవ్వొద్దు

  • కేటాయుంపులపై సంపూర్ణ నియంత్రణ!

  • లీజు గడువు కూడా గరిష్ఠంగా 33 ఏళ్లే

  • ప్రతి 2-3 ఏళ్లకోసారి ఫీజు పెంచాలి

  • రెవెన్యూ శాఖ తాజా ప్రతిపాదనలు

  • కేటాయించిన భూములను ఇతరత్రా వాడుకుంటున్న కొన్ని కంపెనీలు

  • ప్రభుత్వానికి తెలియకుండా తనఖా

  • రుణాలు తెచ్చుకుని ఆనక ఎగవేత

  • దీంతో ఆ భూములు వేలం వేసి అప్పు తీర్చాలని బ్యాంకులు గగ్గోలు

  • వీటి అడ్డుకట్టకే తాజా సూచనలు

  • సొంత భవనాలున్నా, భూములున్నా..పార్టీలకు ప్రభుత్వ స్థలాలు ఇవ్వొద్దు

  • షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోనూ కేటాయించొద్దు

  • తెరపైకి మరిన్ని ప్రతిపాదనలు

  • ఇప్పటికే ఉపసంఘానికి నివేదిక

భూకేటాయింపుల నియంత్రణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇకపై పరిశ్రమలు, కంపెనీలు, సంస్థలు, విద్యాసంస్థలు, వ్యవస్థలకు భూములను అమ్మకం ప్రాతిపదికన కేటాయించరాదని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. అంటే మార్కెట్‌ ధరకు.. లేదా సగం ధరకే అమ్మడం.. కారుచౌకగానో, ఉచితంగానో ధారాదత్తం చేసే విధానాలకు స్వస్తిపలకాలని సూచించింది. పరిశ్రమలు, కంపెనీలు, వ్యవస్థలు, సంస్థల ఏర్పాటుకు ఎవరికైనా సరే నిర్దిష్ట కాలపరిమితితో లీజు ప్రాతిపదికన మాత్రమే భూములు కేటాయించాలని పేర్కొంది. ఈ ప్రతిపాదన త్వరలో మంత్రివర్గ ఉపసంఘం ముందుకు రానుంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పరిశ్రమలు, కంపెనీలు, సంస్థలకు కేటాయించే భూములపై స్పష్టమైన నియంత్రణ అవసరమని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ భూ కేటాయింపు విధానం (ల్యాండ్‌ అలాట్‌మెంట్‌ పాలసీ-2012)లోని కీలక అంశాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలనుకుంటోంది. భూముల విలువ అమాంతం పెరిగిపోవడం..మరోవైపు ఇతర అవసరాలకు భారీగా భూములను మళ్లిస్తున్న నేపథ్యంలో వాటి లభ్యత రానురానూ తగ్గిపోతోంది. ప్రభుత్వం భూ కేటాయింపులతో పాటు ఇతరత్రా కూడా విరివిగా భూములు ఇస్తుండడంతో..దాని వద్ద ఉన్న ల్యాండ్‌బ్యాంక్‌ భారీగా తగ్గిపోతోంది.రీ సర్వేలోనూ ఇదే తేలింది. గత 15 ఏళ్లతో పోలిస్తే ప్రభుత్వ భూముల సంఖ్య 2.75 లక్షల ఎకరాల వరకు తగ్గిపోయినట్లు నిర్ధారణ అయింది.


ఈ క్రమంలో మిగిలి ఉన్న కొద్దిపాటి భూమిని చాలా పొదుపుగా వాడుకోవాలని..కేటాయింపులను సంపూర్తిగా నియంత్రించాలని రెవెన్యూ శాఖ సూచిస్తోంది.ఆయా అంశాలపై అధ్యయనం చేసి పలు కీలక ప్రతిపాదనలు రూపొందించింది.పరిశ్రమలు, కంపెనీలు, సంస్థలు, విద్యాసంస్థల ఏర్పాటుకు మార్కెట్‌ ధరకు భూముల విక్రయం..లేదంటే సగం ధరకే ఇవ్వడం..ఉచితంగా కట్టబెట్టడానికి వీల్లేకుండా కీలక సూచన చేసింది. నిర్దిష్ట కాలపరిమితితో లీజు ప్రాతిపదికన మాత్రమే భూములు కేటాయించాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం ఎంత పెద్ద పరిశ్రమ అయినా సరే..ఎన్ని రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేదైనా కూడా..లీజు ప్రాతిపదికనే భూములివ్వాలి. ఆ లీజు ధరలు కూడా ఆంధ్రప్రదేశ్‌ భూ కేటాయింపు విధానం 2012 ప్రకారం.. పెరిగిన ధరలను బట్టే ఖరారు చేయాలని అందులో పేర్కొంది. భూముల లీజును సైతం కనిష్ఠంగా 25 ఏళ్లు, గరిష్ఠంగా 33 ఏళ్లు మాత్రమే ఇవ్వాలని..ప్రతి 2-3 ఏళ్లకోసారి లీజు ఫీజు పెంచేలా విధివిధానాలు ఉండాలని ప్రతిపాదించింది. దీనివల్ల విధిగా ఆయా కంపెనీలు, పరిశ్రమలు ఉత్పాదకత రంగంలోకి వస్తాయని.. భూములు ఇచ్చిన ప్రయోజనాలు వెంటనే ఆచరణలోకి వస్తాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.


కొన్ని కంపెనీల తీరుతో..

కొన్ని కంపెనీలు ప్రభుత్వం నుంచి అత్యం త విలువైన భూములను కారుచౌకగా తీసుకుని.. తొలుత కొంత పెట్టుబడి పెట్టి, పరిశ్రమలను ప్రారంభించి.. ఆ తర్వాత ఉత్పత్తి ఆపేస్తున్నాయి. ఆ భూములను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నాయని రెవెన్యూ శాఖ గుర్తించింది. ముఖ్యంగా ఆ భూములను తనఖా పెట్టి ప్రభుత్వానికి తెలియకుండానే భారీగా రుణాలు తీసుకుంటున్నాయి. అనంతరం రుణాలు చెల్లించడం మానేస్తున్నాయి. దీంతో బ్యాంకులు ఆ భూములను వేలం వేసి అప్పులు తీర్చాలని గొడవ చేస్తున్నాయి. దీంతో మొదటికే మోసం వస్తోంది. ఈ అనుభవాల నేపథ్యంలో ఇకపై కంపెనీలు, పరిశ్రమల స్థాపనకు లీజు ప్రాతిపదికనే భూములిచ్చేలా రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రస్తుతం పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీ ముందుగానే ప్రభు త్వం నుంచి భూములు తీసుకుంటోంది. దా దాపు 1.25 లక్షల ఎకరాల ల్యాండ్‌బ్యాంక్‌ ఉంది. కొన్ని కంపెనీలకు మార్కెట్‌ ధర పూ ర్తిగా తీసుకుని భూములు కేటాయిస్తుండగా.. మరికొన్నింటికి సగం ధరకే ఇస్తున్నారు. కొన్ని బడా కంపెనీలకు కారుచౌకగా, ఇంకా ఉచితంగా కూడా కట్టబెడుతున్నారు. ఇలాంటి విధానం వద్దని.. దేనికైనా హేతుబద్ధత ఉండాలని, అందుకే లీజు విధానం తీసుకురావాలని రెవెన్యూ శాఖ కోరుతోంది.


పార్టీలకు ప్రభుత్వ భూములొద్దు!

రాజకీయ పార్టీలకు ఆఫీసుల కోసం భూములు కేటాయించే విషయంలోనూ రెవె న్యూ శాఖ కీలక ప్రతిపాదన చేసింది. రాజకీ య పార్టీకి ఎక్కడైతే సొంతంగా పార్టీ ఆఫీసు ఉంటుందో అక్కడ మళ్లీ ఆఫీసు నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలు కేటాయించకూడదని సూచించింది. పార్టీలకు సొంతంగా భూములుంటే కూడా.. ఆఫీసుల కోసం స్థలాలు కేటాయించొద్దని పేర్కొంది. గతంలో అనేక పార్టీలు.. సొంత ఆఫీసులు, భూములు ఉన్నా మళ్లీ ఆఫీసుల నిర్మాణం పేరిట కీలక ప్రాంతాల్లో విలువైన స్థలాలు దక్కించుకున్నాయి. ఇక అధికారంలో ఉండే పార్టీలు... భూములు తీసుకోవడానికి తమకు ఏ నిబంధన, నియమం అడ్డు రాకుండా చూసుకుంటున్నాయి. తమకు నచ్చిన చోట, ఖాళీగా కనిపించిన స్థలం కోసం ఒత్తిడి తెచ్చి సాధిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పార్టీ ఆఫీసులకు భూములిచ్చే విషయంలోనూ స్పష్టమైన విధానం తీసుకురావాలనుకుంటోంది. రాష్ట్ర, జిల్లా పార్టీ ఆఫీసులకు ఆయా ప్రాంతాల్లో సొంత భవనాలు ఉన్నా.. లేదా ఆ పార్టీలకు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే భూములు ఉంటే.. వాటికి భవిష్యత్‌లో భూములు కేటాయించకూడదని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది.

Updated Date - Aug 18 , 2025 | 04:21 AM