Share News

High Court Clarifies: సైనికులకు భూకేటాయింపు తప్పేమీ కాదు

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:21 AM

సాయుధ దళాల్లో సేవలు అందిస్తున్న సైనికులకు, మాజీ సైనికోద్యోగుల కోటా కింద భూకేటాయింపు చేయడం చట్టవిరుద్ధం కాదని హైకోర్టు స్పష్టత ఇచ్చింది....

High Court Clarifies: సైనికులకు భూకేటాయింపు తప్పేమీ కాదు

  • తిరుపతి కలెక్టర్‌ నిర్ణయం సరికాదు

  • ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించండి

  • 3 నెలల్లో అమలు చేయాలి... హైకోర్టు ఆదేశం

అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): సాయుధ దళాల్లో సేవలు అందిస్తున్న సైనికులకు, మాజీ సైనికోద్యోగుల కోటా కింద భూకేటాయింపు చేయడం చట్టవిరుద్ధం కాదని హైకోర్టు స్పష్టత ఇచ్చింది. కేవలం మాజీ సైనికులకు మాత్రమే భూమిని కేటాయించాలనే చట్టనిబంధన ఏదీ లేదని తేల్చిచెప్పింది. సర్వీసులో ఉన్న సైనికులు, మాజీ సైనికోద్యోగులు కూడా భూకేటాయింపు కోసం జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ 2022లో సర్క్యులర్‌ జారీ చేశారని గుర్తు చేసింది. సర్వీసులో ఉన్న సమయంలో భూకేటాయింపు చేశారనే కారణంతో భూములను వెనక్కి తీసుకోవడానికి వీల్లేదని తెలిపింది. సాయుధ దళాల్లో సేవలందిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు, దేశ సరిహద్దులను, ప్రజలను కాపాడుతున్నందుకు కృతజ్ఞతగా మాజీ సైనికులకు భూకేటాయింపు విధానాన్ని తీసుకొచ్చారని పేర్కొంది. నిబంధనలు అడ్డుపెట్టుకొని మంచి ఉద్దేశాన్ని దెబ్బతీయడానికి వీల్లేదని తెలిపింది. ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ కోటా కింద పిటిషనర్‌కు కేటాయించిన 4.35 ఎకరాల తక అడవి భూమిని అడవి పోరంబోకుగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్‌ నిషేధిత భూముల జాబితా(22ఏ) నుండి తొలగించడానికి తిరుపతి జిల్లా కలెక్టర్‌ నిరాకరించడాన్ని తప్పుపట్టింది. తహశీల్దార్‌ ఇచ్చిన నివేదికలో భూమి అడవి పోరంబోకు అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ లేనప్పటికి పిటిషనర్‌ భూమిని అడవి పోరంబోకుగా నిర్ధారిస్తూ జిల్లా కలెక్టర్‌ ఎలా ఉత్తర్వులు ఇచ్చారో అర్ధం కావడం లేదని పేర్కొంది. మూడు నెలల్లో భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని తిరుపతి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ లోపు నిషేధిత జాబితా నుండి భూములు తొలగించకుంటే భూముల బదిలీ/విక్రయం నిమిత్తం దస్త్రాలను సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద ఉంచవచ్చని పిటిషనర్‌కు తెలిపింది. వాటిని పరిగణనలోకి తీసుకొని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని సబ్‌రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ సుభేందు సమంతో ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది.

Updated Date - Nov 19 , 2025 | 05:21 AM