Visakhapatnam: ‘గూగుల్’ కోసం వడివడిగా భూసేకరణ
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:40 AM
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌కు భూ సేకరణ ప్రక్రియ వడివడిగా సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే డేటా కేంద్రానికి శంకుస్థాపన జరగనుంది.
అనంతరం డేటా సెంటర్‌కు శంకుస్థాపన
నేటి నుంచి రైతుల ఖాతాల్లో పరిహారం జమ
విశాఖపట్నం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌కు భూ సేకరణ ప్రక్రియ వడివడిగా సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే డేటా కేంద్రానికి శంకుస్థాపన జరగనుంది. మరోవైపు కేంద్రం ఏర్పాటు కోసం చట్టాల్లో కొన్ని మార్పులు కూడా చేయనున్నారు. ఇవన్నీ ఒక కొలిక్కి రాగానే శంకుస్థాపన ముహూర్తం ఖరారు కానుంది. వాస్తవానికి ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు చేశారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఇదిలావుంటే, దేశంలోని కాపీ రైట్ చట్టానికి సవరణలు చేయాలని గూగుల్ సంస్థ కోరింది. కృత్రిమ మేథ(ఏఐ)తో కూడిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ నిర్మాణానికి గూగుల్ సన్నాహాలు చేస్తోంది. ఏఐ కోసం డేటాను వినియోగించుకుంటుంది. దీనికి దేశంలోని ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్-2023’లో కొన్ని అంశాలు మార్చాల్సి ఉందని గూగుల్ సూచించింది. కాపీ రైట్ యాక్ట్‌లో సెక్షన్ 52ని కూడా సవరించాల్సి ఉందని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ఈ సెక్షన్ సవరణకు ప్రతిపాదించాలని కేంద్రం సూచించగా ఇక్కడి అధికారులు ఆ మేరకు స్పందించారు.
తర్లువాడలో 308 ఎకరాలు
గూగుల్‌కు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 588 ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం వడివడిగా ప్రయ త్నాలు చేస్తోంది. ప్రధానంగా ఆనందపురం మండలం తర్లువాడలో 308 ఎకరాలు ఇస్తున్నారు. ఈ భూమిలోని 110 ఎకరాల్లో 51 మంది అసైన్డ్ పట్టాదారులు ఉన్నారు. మరో 88 ఎకరాల్లో ఆక్రమణదారులు ఉన్నారు. వారికి రిజిస్ట్రేషన్ విలువలో 50 శాతం సొమ్మును ఇస్తామని హామీ ఇచ్చారు. మిగిలింది ప్రభుత్వ భూమి. ఈ భూములు ఇవ్వడానికి 60 శాతం మంది రైతులు ముందుకు వచ్చారు. వారికి శనివారం పరిహారం సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ భూములు కాకుండా అడవివరంలో 120, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 160 ఎకరాలు కేటాయించారు.