AP Govt: అమరావతిలో భూసేకరణ అమలులోకి
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:53 AM
అమరావతి రాజధానిలో సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో భూసేకరణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో ఉన్న నోటిఫికేషన్లు ఉపసంహరణ
కొత్తగా భూ సేకరణ నోటిఫికేషన్లు జారీకి ప్రతిపాదనలు సిద్ధం చేసిన సీఆర్‌డీఏ
మినహాయింపుల విషయం తేల్చకపోతే చట్ట ప్రకారం ముందుకెళ్తాం: రైతులు
అమరావతి/విజయవాడ, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలో సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో భూసేకరణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ, పునరావాసం, రీసెటిల్‌మెంట్ చట్టం -2013 ప్రకారం రాజధాని ప్రాంతంలో అమల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన భూములు సేకరించేందుకు గుంటూరు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఇదిలాఉండగా, గత భూసేకరణ నోటిఫికేషన్ల రద్దుతో సీఆర్‌డీఏ అధికారులు సరికొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయటానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని బుధ, గురువారాల్లో జిల్లా యంత్రాంగానికి అందజేయనున్నారు. రాజధానిలో 2,800 ఎకరాల సేకరణకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న నేపథ్యంలో, తొలిదశలో ఎంత మేర భూముల సేకరణకు నోటిఫికేషన్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ధరల ప్రాతిపదికనే పరిహారం ఇచ్చేలా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు, తమ సమస్యలు పరిష్కరించాకే ఈ విషయంలో ముందుకు వెళ్లాలని, లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రైతులు అంటున్నారు. వైసీపీ హయాంలో 1,900 ఎకరాల భూ సేకరణ నోటిఫికేషన్ల రద్దుపై కొంతమంది కోర్టుకు వెళ్లారని.. ఆ అంశం ఇంకా కోర్టులో ఉండగా కొత్తగా భూసేకరణ నోటిఫికేషన్ ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ఎస్పీవీ
అమరావతి రాజధానిలో ప్రత్యేక ప్రాజెక్టుల అభివృద్ధి, అమలు, ఆపరేషన్, నిర్వహణకు సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ని ఏర్పాటు చేస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ వంతెన, స్పోర్ట్స్ సిటీ, రివర్‌ఫ్రంట్ డెవల్‌పమెంట్, రోప్‌వే, ఇన్నర్ రింగ్‌రోడ్డుతోపాటు ప్రభుత్వం, సీఆర్‌డీఏ ఆమోదించిన ప్రాజెక్టులను ఎస్పీవీ ద్వారా చేపట్టనున్నారు.