ఓఆర్‌ఆర్‌కు భూసేకరణ!
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:29 AM
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు భూ సేకరణకు రంగం సిద్ధమైంది. ఎన్‌హెచ్ సూచనల మేరకు 3ఏ నోటిఫికేషన్ వెలువరించేందుకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి 70 మీటర్ల వెడల్పు ప్రాతిపదికన భూములు సేకరించనుంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో పనులు ఊపందుకోగా, కృష్ణాజిల్లాలో త్వరలో ప్రారంభంకానున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఆరు వేల ఎకరాలు సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
- సన్నద్ధం కావాలని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధికారులకు ఎన్‌హెచ్ సూచన
- ప్రస్తుతానికి 70 మీటర్ల వెడల్పు ప్రాతిపదికన భూ సేకరణకు 3ఏ నోటిఫికేషన్
- ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే పూర్తయిన పెగ్ మార్కింగ్ పనులు
- కృష్ణాజిల్లాలోనూ ప్రారంభించనున్న రెవెన్యూ యంత్రాంగం
- ఉమ్మడి కృష్ణాజిల్లాలో 6 వేల హెక్టార్లు అవసరం
- 140 మీటర్లపై ఇంకా రాని స్పష్టత.. ఉంటే రెండో భూ సేకరణ కు అవకాశం!
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు భూ సేకరణకు రంగం సిద్ధమైంది. ఎన్‌హెచ్ సూచనల మేరకు 3ఏ నోటిఫికేషన్ వెలువరించేందుకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి 70 మీటర్ల వెడల్పు ప్రాతిపదికన భూములు సేకరించనుంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో పనులు ఊపందుకోగా, కృష్ణాజిల్లాలో త్వరలో ప్రారంభంకానున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఆరు వేల ఎకరాలు సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)కు భూ సేకరణ నోటిఫికేషన్ వెలువరించేందుకు ఎన్టీఆర్, కృష్ణాజిల్లా రెవెన్యూ యంత్రాంగాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. భూసేకరణకు నోటిఫికేషన్‌ను పత్రికాముఖంగా ఇవ్వాలంటూ జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్) నుంచి సంకేతాలు వచ్చాయి. దీంతో నెల రోజుల లోపు భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగాలు కసరత్తు చేస్తున్నాయి. అయితే కేంద్రం నుంచి ఎన్‌హెచ్‌కు ఓఆర్‌ఆర్ వెడల్పుపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. గతంలో అనుకున్న 70 మీటర్ల ప్రాతిపదికన వెళతారా? లేక రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా 140 మీటర్ల మేరకు వెళతారా ? అన్నది తేలాల్సి ఉంది. కేంద్రం 140 మీటర్ల వెడల్పుకు అంగీకరించిందన్న వార్తలు కొన్ని పత్రికల్లో (ఆంధ్రజ్యోతి కాదు) వచ్చినప్పటికీ ఎన్‌హెచ్ అధికారులకు దీనిపై ఇంకా స్పష్టత లేదు. దీంతో ఎన్‌హెచ్ అధికారులు కూడా చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు వెడల్పు ఎంత అన్న దానిపై కేంద్రం నుంచి ఎన్‌హెచ్‌కు స్పష్టత రాకపోవటంతో 70 మీటర్ల ప్రాతిపదికన ముందు భూ సేకరణ నోటిఫికేషన్‌కు ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. తర్వాత కేంద్రం ఏదైనా స్పష్టత ఇస్తే ఆ మేరకు రెండవ నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ జిల్లాలో కదిలిన ప్రక్రియ
కేంద్ర ప్రభుత్వం మౌఖికంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్‌హెచ్ ప్రస్తుతం 70 మీటర్ల వెడల్పుకు సరిపడా భూ సేకరణ నోటిఫికేషన్‌కు సిద్ధం కావాలని రెండు జిల్లాల రెవెన్యూ యంత్రాంగాలకు నివేదించింది. ఎన్టీఆర్ జిల్లాలో అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ ఇలక్కియా ఇటీవలే దీనిపై సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలో కంచికచర్ల మండలంలో కంచికచర్ల, పెరకలపాడు, మున్నలూరు, మోగులూరు, కునికినపాడు, వీరులపాడు మండలంలో పొన్నవరం, జగన్నాథపురం, జుజ్జూరు, చెన్నారావుపాలెం, తిమ్మాపురం, గూడెం మాధవరం గ్రామాలు, జీ. కొండూరు మండలం పరిధిలో దుగ్గిరాలపాడు, పెట్రంపాడు, కుంటముక్కల, నందిగామ, కోడూరు, మైలవరం మండలంలో పొందుగల, మైలవరం గ్రామాలు ఓఆర్‌ఆర్ పరిధిలో ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 70 మీటర్ల ప్రాతిపదికన అయితే 3,093 హెక్టార్ల మేర భూములను సేకరించాల్సి ఉంటుంది. వీటిలో పట్టా భూములు 2,803.17 హెక్టార్లు, ప్రభుత్వ భూములు 290.45 హెక్టార్లు చొప్పున ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి జిల్లా యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పెగ్ మార్కింగ్ పనులను ఎప్పుడో చేపట్టింది. అలైన్‌మెంట్ ఆధారంగా బౌండరీలను ఫిక్స్ చేసింది. అలైన్‌మెంట్ పరిధిలో ఏయే సర్వే నెంబర్లు ఉన్నాయి ? వాటి యజమానులు ఎవరు ? అన్న వివరాలను కూడా సేకరించింది. ఇక పత్రికాముఖంగా భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వడమే తరువాయి. ఇప్పటికే కంచికచర్ల, వీరులపాడు, జీ కొండూరు, మైలవరం మండల రెవెన్యూ యంత్రాంగాలను ఈ దిశగా సన్నద్ధం చేయటం జరిగింది.
కృష్ణాజిల్లాలో ప్రారంభం కానున్న ప్రక్రియ
ఓఆర్‌ఆర్ పరిధిలో కృష్ణాజిల్లాలోని గన్నవరం మండలం సగ్గూరు ఆమని, బూతిమిల్లిపాడు, బల్లిపర్రు గ్రామాలు ఉన్నాయి. బాపులపాడు మండలంలో బండారుగూడెం, అంపాపురం గ్రామాలు, ఉంగుటూరు మండలంలో పెదఅవుటపల్లి, తేలప్రోలు, వెన్నూతల, అత్కూరు, పొట్టిపాడు, వెల్దిపాడు, తరిగొప్పల, బొకినాల, మానికొండ, వేంపాడు గ్రామాలు ఉన్నాయి. కంకిపాడు మండలంలో మారేడుమాక, కొణతనపాడు, దావులూరు, కోలవెన్ను, ప్రొద్దుటూరు, చలివేంద్రపాలెం, నెప్పల్లె, కుందూరు గ్రామాలు ఉన్నాయి. తోట్లవల్లూరు మండలంలో రొయ్యూరు, నార్త్ వల్లూరు, చిన్నపులిపాక, బొడ ్డపాడు, సౌత వల్లూరు గ్రామాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల పరిధిలో మూడు వేల హెక్టార్ల మేర భూ సేకరణ జరపాల్సి ఉంది. కృష్ణాజిల్లా రెవెన్యూ యంత్రాంగం ఈ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో దాదాపుగా ఆరు వేల హెక్టార్లకు పైగా భూ సేకరణ జరపాల్సి ఉంది. రెండు జిల్లాల యంత్రాంగాలు 3ఏ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మరో రెండు దశలు ఉంటాయి. ఎన్‌హెచ్ ఈ భూములను స్వాధీనం చేసుకునే క్రమంలో 3డీ నోటిఫికేషన్ ఇస్తారు.