Share News

Lakshmaiah Naidu Wife: నా భర్తది కుల హత్య కాదు

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:25 AM

నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం పరిధిలోని దారకానిపాడు గ్రామంలో ఈ నెల 2న జరిగిన దారుణ హత్యపై కులం కుంపట్లు రాజుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.

Lakshmaiah Naidu Wife: నా భర్తది కుల హత్య కాదు

  • కులం రంగు పులమడం దారుణం

  • హరిశ్చంద్రప్రసాద్‌ కొన్నాళ్లుగా బెదిరిస్తున్నారు.. లక్ష్మయ్య నాయుడి భార్య వెల్లడి

  • హత్యపై సీఎం సీరియస్‌.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రులకు ఆదేశం.. హుటాహుటిన గ్రామానికి అనిత, నారాయణ

  • బాధిత కుటుంబానికి పరామర్శ.. ప్రభుత్వం, పార్టీ తరఫున సాయానికి హామీ

  • బాధితులను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌

  • కులాలతో రాజకీయం చేయొద్దంటూ వైసీపీ నేతలకు మంత్రి అనిత హెచ్చరిక

కందుకూరు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం పరిధిలోని దారకానిపాడు గ్రామంలో ఈ నెల 2న జరిగిన దారుణ హత్యపై కులం కుంపట్లు రాజుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలు ఈ హత్యకు, రాష్ట్రంలోని రెండు కులాలకు మధ్య సంబంధం అంటగట్టి చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధిత కుటుంబాన్ని కలుసుకుని వాస్తవాలు తెలుసుకోవాలని హోం మంత్రి అనిత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణలను ఆదేశించారు. దీంతో ఆదివారం రాత్రి మంత్రులు దారకానిపాడు గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మయ్యనాయుడు భార్య సుజాత మాట్లాడుతూ.. తన భర్తది కుల హత్య కాదని స్పష్టం చేశారు. కారుతో గుద్ది చంపిన హరిశ్చంద్రప్రసాద్‌ కొన్నాళ్లుగా తన భర్తను బెదిరించినట్టు తెలిపారు. తన భర్త హత్యకు కులం రంగు పులమడం బాధగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని తాము కోరుకుంటున్నామని, కులం పేరుతో తమ కుటుంబాన్ని వేధించవద్దని విజ్ఞప్తి చేశారు.


నీచ రాజకీయాలు చేయొద్దు: అనిత

లక్ష్మయ్య నాయుడు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ హామీ ఇచ్చారు. ప్రభుత్వం, పార్టీ తరఫున సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబంతో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లకు ఫోన్‌ చేయించి మాట్లాడించారు. అనంతరం లక్ష్మయ్య నాయుడి భార్య సుజాత, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి మంత్రులు మీడియాతో మాట్లాడారు. కులాలు, మతాలతో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్ష వైసీపీకి అనిత హితవు పలికారు. లక్ష్మయ్య నాయుడు హత్య అత్యంత కిరాతకంగా జరిగిందని, హత్యకు పాల్పడిన హరిశ్చంద్రప్రసాద్‌ను, అతని తండ్రి మాధవరావును పోలీసులు వెంటనే అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారని తెలిపారు. అయితే ఈ హత్యకు కులాలు, మతాలు అంటకట్టి విద్వేషాలు రెచ్చగొట్టాలని కొందరు ప్రయత్నించడం శోచనీయమన్నారు. ఈ ఘటనకు.. కులాలకు సంబంధం లేదన్నారు. బాధితులు సైతం కులప్రమేయం లేదని చెబుతున్నా, నీచరాజకీయాలు చేస్తున్నవారు తమ ప్రయత్నాలు మానుకోలేదని మండిపడ్డారు. సోషల్‌ మీడియా ద్వారా కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న వారిపై చట్టపరిధిలో క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్పెషల్‌ కోర్టు ఏర్పాటు చేసి కేసును త్వరగా విచారించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు. ఈ హత్యకు కులాలను ఆపాదించడం సరికాదని, వీలైతే బాధిత కుటుంబానికి సాయం చేయాలని మంత్రి అనిత సూచించారు. వాస్తవ పరిస్థితులను సీఎం చంద్రబాబుకు నివేదిస్తామని మంత్రి తెలిపారు.


కులాలను రెచ్చగొట్టడం సరికాదు

తన భర్తను దారుణంగా హత్య చేసిన కిరాతుకులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నట్టు లక్ష్మయ్య నాయుడి భార్య సుజాత అన్నారు. ఈ హత్యలో కులాల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కులాలను రెచ్చగొడుతూ జరుగుతున్న వ్యవహారం తమకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘హత్యకు కొద్దిరోజుల ముందు నుంచే.. ‘నీ భర్తను చంపేస్తా’ అంటూ హరిశ్చంద్ర ప్రసాద్‌ బెదిరించాడు. ఆ విషయం నా భర్తకు కూడా చెప్పాను. చివరకు అన్నంతపని చేశాడు. వారిని కఠినంగా శిక్షించాలి. మా కుటుంబానికి రక్షణ కల్పించాలి.’’ అని సుజాత విజ్ఞప్తి చేశారు. ‘‘నాకు న్యాయం జరిగేలా చూస్తామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. నా ఆవేదనను వారికి వివరించాను. కఠిన చర్యలు తీసుకోవాలని కోరాను. సీఎం నాకు ధైర్యాన్నిచ్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మా కుటుంబానికి అన్యాయం చేసిన వ్యక్తులను జైలు నుంచి బయటకు రానీయకుండా చూడాలని కోరాను.’’ అని సుజాత అన్నారు.


దోషులను శిక్షిస్తాం: సీఎం, డిప్యూటీ సీఎం

లక్ష్మయ్య నాయుడు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ధైర్యంగా ఉండాలని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. కాగా.. మంత్రుల వెంట వచ్చిన తాడేపల్లి గూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌.. బాధిత కుటుంబ సభ్యులకు రూ.2.5 లక్షల ఆర్థిక సాయం అందించారు.

కులాల కుంపట్లు రాజేస్తున్న వైసీపీ: నిమ్మల

పాలకొల్లు అర్బన్‌: రాజకీయ దిగజారుడు తననానికి వైసీపీ నిదర్శనమని, కులాల కుంపట్లు రాజేయాలనుకోవడం రాక్షస మనస్తత్వమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నెల్లూరు ఘటనకు కులం రంగు పులిమి విష ప్రచారం చేయడం తగదన్నారు. కులం రంగు పులిమి అక్కడ శవ రాజకీయం చేస్తున్నారని వైసీపీ నాయకులపై ఆయన విరుచుకుపడ్డారు. ఇరువురి వ్యక్తి గత గొడవలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ రెండు కులాలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఈ ఘటనలో నిందితుడిని, అతని తండ్రిని ప్రభుత్వం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిందన్నారు. వాస్తవాన్ని వక్రీకరించి కుల రంగు పులమడం మానుకోవాలని హితవు పలికారు.

Updated Date - Oct 20 , 2025 | 04:27 AM