Criminal Gangs: వామ్మో.. లేడీ డాన్లు
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:49 AM
ఒకప్పుడు సినిమాల్లోనే లేడీ డాన్లు కనిపించేవారు. ఇప్పుడు పలు ప్రాంతాల్లో ప్రత్యక్షంగా దాదాగిరి చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల్లో ఇటీవల తరచూ మహిళల పేర్లు వినిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
వరుస నేరాలతో హడలెత్తిస్తున్న మహిళలు
దొంగతనాలు, దందాలు, దోపిడీలు, హత్యలు, గంజాయి-డ్రగ్స్, భూకబ్జాలలో తరచూ కేసులు
నెల్లూరులో సంచలనం సృష్టించిన కి‘లేడీ’ అరుణ
తాజాగా గంజాయి డాన్ అరవ కామాక్షి అరెస్ట్
సైనైడ్ మిస్టరీ హత్యల్లో తెనాలి బుజ్జి జైలుకు
విజయవాడలో ఇళ్లు కబ్జా చేసిన లేడీ డాన్
చీరాల మరియమ్మ, తాడేపల్లి ప్రమీల దొంగల ముఠా
నూజివీడు మాజీ బ్యాంకర్ ఘరానా మోసాలు
కామాక్షి ఇంట 25 కేజీల గంజాయి, పత్రాలూ స్వాధీనం
నెల్లూరు జిల్లాకు చెందిన నిడిగుంట అరుణ ఉదంతం ఇటీవల సంచలనం సృష్టించింది. ఆమె చేసిన దందాలు, అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా అదే జిల్లాకు చెందిన గంజాయు డాన్ అరవ కామాక్షి.. గంజాయికి వ్యతిరేకంగా పోరాడిన సీపీఎం నేతను దారుణంగా హత్య చేయించింది. తెనాలి బుజ్జిది మరో నేరగాథ. సైనైడ్ కలిపిన పానీయాలు తాగించి హత్యలు చేయడం.. బంగారం, డబ్బుతో ఉడాయించిన నేపథ్యం. ఇక చీరాల మరియమ్మ గ్యాంగ్ దొంగతనాలు చేయడంలో ఆరితేరిపోయింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లేడీ డాన్లు హడలెత్తిస్తున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఒకప్పుడు సినిమాల్లోనే లేడీ డాన్లు కనిపించేవారు. ఇప్పుడు పలు ప్రాంతాల్లో ప్రత్యక్షంగా దాదాగిరి చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల్లో ఇటీవల తరచూ మహిళల పేర్లు వినిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దొంగతనాలు, దందాలు, దోపిడీలు, హత్యలు, గంజాయి-డ్రగ్స్ రవాణా, విక్రయాలు, గ్యాంగ్ వార్, భూకబ్జాలు, రియల్ దందాలు.. అన్నింటా నేరసామ్రాజ్యంలో మహిళలు హల్‌చల్ చేస్తున్నారు. వరుసగా వెలుగుచూస్తున్న లేడీ డాన్ల ఉదంతాలు సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. పోలీసు శాఖకు, ప్రభుత్వానికి సవాల్‌గా మారుతున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన నిడిగుంట అరుణ అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించింది. వైసీపీ నేతలతో పరిచయాలతో పాటు బ్యూరోక్రాట్లతో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరిపే స్థాయికి చేరింది. వైసీపీ నేతలతో పాటు ఏకంగా మాజీ సీఎం జగన్‌కు పుష్పగుచ్చం ఇస్తూ ఆమె దిగిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. నెల్లూరు జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే ఖైదీని భర్తగా చెబుతూ ఆమె ఎన్నో దందాలు చేసింది. నెల్లూరు, తిరుపతి, గుంటూరు, విజయవాడలో అనేకం ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్ పరిసరాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని గత వైసీపీ హయాంలో నేరసామ్రాజ్యంలో ఎదిగింది. ఇద్దరు ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్, హోంశాఖ ఉన్నతాధికారులు వ్యతిరేకించినా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారి సిఫారసుతో శ్రీకాంత్‌ను పెరోల్‌పై బయటికి తీసుకొచ్చింది. అతడితో కలిసి అరుణ బెదిరింపులకు పాల్పడుతున్న బాగోతం వీడియోలతో సహా బయట పడింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. శ్రీకాంత్ బెయిల్‌ను రద్దు చేశారు. అయినా ఆమె ఆగడాలు ఆపలేదు. జైలు అధికారులను సైతం.. ‘వచ్చే ఎన్నికల తర్వాత హోం మంత్రిని అవుతా.. మీ సంగతి చెబుతా’ అంటూ బెదిరించింది. విజయవాడ కోర్టు ప్రాంగణంలోనే బయటికి వచ్చాక అంతు చూస్తానని బాధితులను బెదిరించింది. ఆమె ఉన్న ఇల్లు సైతం ఒక బిల్డర్‌ను బెదిరించి రాయించుకున్నట్లు తేలింది. అరుణకు ఖరీదైన కార్లు ఉన్నాయి. వెనుక యువకుల గ్యాంగ్ ఉంది.
అరవ కామాక్షి గ్యాంగ్
సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న గంజాయికి వ్యతిరేకంగా పోరాడిన నెల్లూరు జిల్లాకు చెందిన సీపీఎం నాయకుడు పెంచలయ్యను 28వ తేదీన కత్తులతో నరికి చంపారు. దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు నిజం తెలిసి విస్తుపోయారు. నెల్లూరులో పాత చెత్త సేకరించే వ్యాపారం చేసే అరవ కామాక్షి కొందరు యువకులను చేరదీసి గంజాయి దందా నిర్వహిస్తోంది. యువత పెడదారి పట్టడంతో పెంచలయ్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ గంజాయి విక్రయాలకు అడ్డు వస్తున్నారని కక్షకట్టిన కామాక్షి తన భర్త, సోదరులు, మరిదితో కలిసి పెంచలయ్యను దారుణంగా హత్య చేయించిందని నెల్లూరు పోలీసులు చెబుతున్నారు. తాజాగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రాజకీయ నాయకుల అండతోనే కామాక్షి నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి వ్యాపారంతో పెరిగిన ఆమె ఇప్పటికీ అదే దందా కొనసాగిస్తోందని చెబుతున్నారు. గతంలో రైల్వే ఆస్తులు దోచుకోవడం, సస్పెక్ట్ షీట్లలో ఉన్న కామాక్షి ఇప్పుడు రాజకీయ నాయకుడి హత్యతో సంచలనం సృష్టించింది.
చీరాల మరియమ్మ ముఠా
బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మరియమ్మ గ్యాంగ్ కన్ను పడిందంటే బస్సుల్లో ప్రయాణించే మహిళల మెడలో చైన్ మాయమైపోతుంది. జాతర్లు, ఆలయాలు, ఫంక్షన్లలో మహిళల మెడలో చైన్లు రెప్పపాటులో కత్తరించేస్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరుగుతూ బస్సుల్లో బ్యాగులు తెరిచి బంగారం ఆభరణాలు కొట్టేయడం వృత్తిగా పెట్టుకున్నారు. తాడేపల్లిలో ప్రమీల గ్యాంగ్, విజయవాడలో సరోజినీ గ్యాంగ్‌తో కలిసి వరుస నేరాలకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. పలు జిల్లాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. పొరుగు రాష్ట్రాల్లోని పోలీసులు సైతం ఈ ముఠా కోసం ఆరా తీశారు. ఒకప్పుడు స్టూవర్టుపురం దొంగలకన్నా ఇప్పుడు చీరాల మరియమ్మ గ్యాంగే ఎక్కువ దోపిడీలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
బ్యాంకర్ లీలలు
ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన ఒక మహిళ విజయవాడలోని ఓ బ్యాంకులో ఉన్నత స్థాయి ఉద్యోగిని. ఆమెకు విదేశాల్లో ఉద్యోగం చేసే వ్యక్తితో వివాహం జరిగింది. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆ మహిళ తిరిగొచ్చి మరో వ్యక్తితో ఇక్కడ పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారింది. తాను పనిచేసే బ్యాంకులోనే అతడి బంగారం తాకట్టు పెట్టించింది. తర్వాత అతడికి తెలియకుండా ఫోర్జరీ సంతకం చేసి బంగారం తీసుకుంది. విషయం తెలిసిన ఆమె సన్నిహితుడు నిలదీయడంతో బెదిరింపులకు దిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు కావడంతో పాటు ఆమె ఉద్యోగం పోయింది. ఆమె ఇంతటితో ఆగకుండా సొంత బంధువుల ఆస్తులు కూడా కబ్జా చేసింది. సొంత పిన్నిపైనే దాడి చేసినట్లు కేసు నమోదైంది. పలువురితో డబ్బులు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదు. అడిగిన వారిని బెదిరించింది. వరుస పోలీసు కేసులు నమోదు కావడంతో ప్రభుత్వంలోని ఓ స్థాయి పెద్దల పంచన చేరింది. వివాదాలు మరీ ఎక్కువ కావడంతో కొన్ని నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.
సరిహద్దులు దాటిన నేరాలు
కొన్ని నేరాలు అయితే సరిహద్దులు దాటుతున్నాయి. శ్రీకాళహస్తిలో ఒక రాజకీయ పార్టీ నాయకురాలి డ్రైవర్ హత్య కేసులో తమిళనాడు పోలీసులు వచ్చి ఆమెతో పాటు భర్తను అరెస్ట్ చేశారు. తెలంగాణలోని గద్వాలకు చెందిన సర్వేయర్ కర్నూలు జిల్లాలో హత్యకు గురికాగా, తెలంగాణ పోలీసులు వచ్చి మృతుడి భార్య, ప్రియుడిని అరెస్ట్ చేశారు. విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన ఓ యువతి డ్రగ్స్ మూలాలు బెంగళూరులో తేలాయి.
తెనాలి బుజ్జి బాగోతం
తెనాలికి చెందిన ముడియాల వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి తెలివైన క్రిమినల్. పరిచయాలు పెంచుకోవడం, వారికి సైనైడ్ కలిపిన పానీయాలు తాగించడం, బంగారం, డబ్బు కోసం హత్య చేయడం ఆమె విధానం. 30 ఏళ్లు దాటకుండానే కాంబోడియాకు వెళ్లి అక్కడ సైబర్ నేరాల్లో పాల్గొంది. కొన్నాళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చి వైసీపీ హయాంలో వార్డు వలంటీర్‌గా పనిచేసింది. ఆ సమయంలో మునగప్ప రజని, గొంటు రమణమ్మతో ఏర్పడిన పరిచయం సైనైడ్ హత్యల పథకానికి బీజం పడింది. ఏడాది క్రితం తెనాలి సమీపంలో ఓ మహిళ మృతి కేసును దర్యాప్తు చేసిన పోలీసులు వారి నేరాలను వెలికితీశారు. బంగారం కోసం చేసిన 4 హత్యలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు పోలీసులు గత ఏడాది చివర్లో వారిని జైలుకు పంపారు.
బెజవాడలో లేడీ గ్యాంగ్
విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో 2017లో రాష్ట్రప్రభుత్వం నిర్మించిన పేదల పక్కా గృహ సముదాయాల్లోకి ఒక మహిళ వచ్చి చేరింది. అక్కడి పరిస్థితులు గమనించి గ్యాంగ్‌ను తయారు చేసుకుని ఖాళీగా ఉన్న ఇళ్లపై కన్నేసింది. అసలు లబ్ధిదారులకు తెలీకుండానే కొన్నింటిని అద్దెకు ఇవ్వడంతో పాటు మరికొన్ని ఇళ్లలో తన అనుచరులను దించింది. ఇలా పదుల సంఖ్యలో ఇళ్లు ఆక్రమించి లక్ష, రెండు లక్షలకు విక్రయించేసింది. కత్తులతో బెదిరించడంతో స్థానికులు, బాధితులు వణికిపోయారు. రోజు రోజుకూ ఆమె అరాచకాలు పెరిగిపోవడంతో బాధితులు రోడ్డెక్కారు. మీడియాలో వార్తలు రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ లేడీ గ్యాంగ్‌ను అదుపు చేశారు.