Share News

ACB: కార్మిక శాఖ జాయింట్‌ కమిషనరు అరెస్టు

ABN , Publish Date - Aug 24 , 2025 | 05:34 AM

ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో కర్నూలు కార్మిక శాఖ జాయింట్‌ కమిషనరు బాలు నాయక్‌ను ఏసీబీ అధికారులు శనివారం తిరుపతిలో అరెస్టు చేశారు.

ACB: కార్మిక శాఖ జాయింట్‌ కమిషనరు అరెస్టు

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీలక డాక్యుమెంట్లు, అర కిలో బంగారం స్వాధీనం

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో కర్నూలు కార్మిక శాఖ జాయింట్‌ కమిషనరు బాలు నాయక్‌ను ఏసీబీ అధికారులు శనివారం తిరుపతిలో అరెస్టు చేశారు. అనంతరం నెల్లూరులోని అవినీతి నిరోధక శాఖ కోర్టుకు తరలించారు. ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కర్నూలులోని కార్యాలయం, అద్దె ఇల్లు, తిరుపతిలోని ఇల్లు, అన్నమయ్య జిల్లాలో ఏడు చోట్ల శుక్ర, శనివారాల్లో ఏసీబీ తనిఖీలు జరిగాయి. తిరుపతి ప్రాంతీయ అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ విమలకుమారి నేతృత్వంలో జరిగిన ఈ సోదాల్లో డాక్యుమెంటు విలువ ప్రకారం రూ.ఐదారు కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించారు. వాటి మార్కెట్‌ విలువ రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. స్థిర, చరాస్తులకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. దాదాపు అర కిలో బంగారు నగలు, కిలో వెండి వస్తువులు, దాదాపు రూ.5.5 లక్షల నగదు సీజ్‌ చేశారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేర్ల మీద వివిధ ప్రాంతాల్లోని 18 బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు. బ్యాంకు లాకర్లలోని బంగారు నగలు, నగదు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వివరాల కోసం బ్యాంకు మేనేజర్లకు లేఖలు రాశారు.

Updated Date - Aug 24 , 2025 | 05:35 AM