Share News

Weather Forecast: పసిఫిక్‌ మహా సముద్రంలో లానినా

ABN , Publish Date - Nov 01 , 2025 | 03:42 AM

అంతర్జాతీయంగా వాతావరణాన్ని ప్రభావితం చేసే పసిఫిక్‌ మహాసముద్రంలో ‘లానినా’ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా సముద్రంలోని తూర్పు, మధ్య, భూమధ్య రేఖకు ఆనుకుని...

Weather Forecast: పసిఫిక్‌ మహా సముద్రంలో లానినా

  • ఫిబ్రవరి వరకూ కొనసాగే అవకాశం

  • నవంబరులో రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం

  • 4 అల్పపీడనాలతో అక్టోబరులో 49 శాతం అధిక వర్షపాతం

విశాఖపట్నం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయంగా వాతావరణాన్ని ప్రభావితం చేసే పసిఫిక్‌ మహాసముద్రంలో ‘లానినా’ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా సముద్రంలోని తూర్పు, మధ్య, భూమధ్య రేఖకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా (ఉపరితల ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయి) నమోదవుతున్నాయి. ఈ ఏడాది మే వరకు పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా కొనసాగింది. అనంతరం తటస్థ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో పుష్కలంగా వర్షాలు కురిశాయి. అయితే తటస్థ పరిస్థితుల తర్వాత తిరిగి ఎల్‌నినో వైపుగా వాతావరణం మారుతుందని తొలుత అంచనా వేశారు. అయితే అనూహ్య మార్పులతో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి బలహీనమైన లానినా వస్తోందని వాతావరణ నిపుణులు చెబుతూ వస్తున్నారు. దీనికి అనుగుణంగానే అక్టోబరులో పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర శుక్రవారం వెల్లడించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ లానినా కొనసాగుతుందని, ఆ తర్వాత తటస్థ పరిస్థితులు ఏర్పడేందుకు 55 శాతం అవకాశాలున్నాయని పేర్కొన్నారు. సాధారణంగా లానినా ఏర్పడేటప్పుడు భారత్‌ సహా అనేక దేశాల్లో వాతావరణం చల్లగా ఉంటుంది. లానినా కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర, కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. నవంబరులో ఈ ఐదు ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నెలలో ఐదు ప్రాంతాల్లో 118.7 మి.మీ. వర్షపాతం కురవాలి. అయితే తమిళనాడు, కోస్తాంధ్రలోని దక్షిణ ప్రాంతంలో మాత్రం సాధారణ వర్షపాతం కంటే తక్కువగా కురుస్తుందని శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో ఐఎండీ పేర్కొంది. ఏపీలో ఎక్కువ ప్రాంతాలతో సహా దేశంలో చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయి. అక్టోబరు నెలలో సాఽ దారణం కంటే 49ు ఎక్కువ వర్షపాతం కురిసింది. ఏపీలో అక్టోబరు 1 నుంచి శుక్రవారం వరకు 161.5 మి.మీ.కుగాను 294.1 మి.మీ.ల (సాధారణం కంటే 82ు ఎక్కువ) వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో 140, నెల్లూరులో 131, విజయనగరంలో 124, పల్నాడులో 119, గుంటూరులో 109ు ఎక్కువ వర్షపాతం నమోదైంది.


రెండు రోజుల్లో అల్పపీడనం

బంగ్లాదేశ్‌ వైపే ప్రభావం

నేడు పిడుగులతో కూడిన వర్షాలు

విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌ ఆఫ్‌ థాయ్‌లాండ్‌లో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారానికి ఉత్తర అండమాన్‌ సముద్రం, దక్షిణ మయన్మార్‌ పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి మయన్మార్‌, బంగ్లాదేశ్‌ వైపు పయనించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే మూడు రోజుల్లో బంగాళాఖాతం మీదుగా తూర్పుగాలులు తమిళనాడు, కోస్తాంధ్ర దిశగా వీయనున్నాయని, దీంతో వర్షాలు పడతాయన్నారు. శుక్రవారం రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Updated Date - Nov 01 , 2025 | 03:43 AM