Kurnool: పోస్టర్ లాగితే ఉగ్రకుట్ర భగ్నం
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:48 AM
అది శ్రీనగర్‌లోని నౌగామ్ ప్రాంతం.. ఈ ఏడాది అక్టోబరులో ఈ ప్రాంతంలో కొన్నిచోట్ల పోలీసులు, భద్రతా దళాలను హెచ్చరిస్తున్నట్టుగా పోస్టర్లు వెలిశాయి.
పోస్టర్‌పై రాతల ఆధారంగా దర్యాప్తు.. సీసీ కెమెరాల జల్లెడ
హరియాణా, యూపీ పోలీసుల సాయంతో సోదాలు
కశ్మీర్‌లో ఉగ్ర కుట్ర భగ్నంలో తెలుగు అధికారి కీలకపాత్ర
దేశమంతా మార్మోగుతున్న కర్నూలు వాసి చక్రవర్తి పేరు
కర్నూలు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): అది శ్రీనగర్‌లోని నౌగామ్ ప్రాంతం.. ఈ ఏడాది అక్టోబరులో ఈ ప్రాంతంలో కొన్నిచోట్ల పోలీసులు, భద్రతా దళాలను హెచ్చరిస్తున్నట్టుగా పోస్టర్లు వెలిశాయి. ఆ ప్రాంతంలో అప్పుడప్పుడూ ఇలాంటి పోస్టర్లు కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి అందరూ దీన్నో సాధారణ విషయంగా భావించారు..! కానీ.. ఒక పోలీస్ అధికారి మాత్రం ఆ పోస్టర్లను నిశితంగా పరిశీలించారు. ఆ రాతల వెనుక ఉద్దేశం ఉగ్రకుట్రకు సంకేతమై ఉండొచ్చని అనుమానించి దర్యాప్తు ప్రారంభించారు. తీగ లాగుకుంటూ వెళితే... 2,900 కిలోల ఐపీడీ.. స్లీపర్ సెల్స్ లింకులతోపాటు దేశాన్ని విచ్ఛిన్నం చేసే భారీ ఉగ్రకుట్ర బయటపడింది. ఇంతకీ ఆ పోస్టర్ వెనుక దాగిఉన్న ఉగ్ర కుట్రను ఛేదించిన అధికారి ఎవరో కాదు. మన తెలుగు తేజం డాక్టర్ జీఏ సందీప్ చక్రవర్తి.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలునగరానికి చెందిన ఆయన శ్రీనగర్ సీనియర్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన పేరు దేశమంతా మార ుమ్రోగిపోతోంది.
ఉగ్రకుట్ర భగ్నం చేశారిలా...
అక్టోబరు 19న శ్రీనగర్‌లోని బన్‌పోరా నౌగామ్‌లోని వివిధ ప్రదేశాల్లో జేషే మహమ్మద్ పోస్టర్లను వెలిశాయి. ఆ పోస్టర్ల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. జమ్మూకశ్మీర్ పోలీసులు... శ్రీనగర్, అనంతనాగ్, గండర్‌బాల్, షోషియన్‌లలోని అనేక ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. హరియాణా పోలీసులతో కలిసి ఫరీదాబాద్‌లో, ఉత్తరప్రదేశ్ పోలీసుల సాయంతో సహరాన్‌పూర్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పాకిస్థాన్, ఇతరదేశాల నుంచి పనిచేస్తున్న విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్న తీవ్రవాద భావాలున్న నిపుణులు, డాక్టర్లు, విద్యార్థులతో కూడిన వైట్ కాలర్, ఉగ్ర వ్యవస్థను గుర్తించారు. నేరారోపణలకు సంబంధించిన పత్రాలు, ఎలక్ర్టానిక్ పరికరాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఐఈడీ తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలో నిషేధిత ఉగ్రవాద సంస్థలు, జైషే మొహమ్మద్ (జేఈఎం), అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (ఏజీయుహెచ్)లతో సంబంధం ఉన్న అంతరాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రవాద మాడ్యూల్‌ను చేధించడంలో పోలీసులు విజయం సాధించారు.
విద్రోహశక్తుల పీచమణచడంలో చక్రవర్తి దిట్ట..!
కర్నూలు నగరానికి చెందిన రిటైర్డు డాక్టర్ జీవీ రామగోపాల్‌రావు, పీసీ రంగమ్మ (ఆరోగ్యశాఖ రిటైర్డు అధికారి) దంపతుల మూడో సంతానం సందీప్ చక్రవర్తి. కర్నూలు మెడికల్ కళాశాల (కేఎంసీ)లో ఎంబీబీఎస్ పూర్తిచేసి డాక్టర్ పట్టా అందుకున్నారు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్-2014లో మంచి ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం శ్రీనగర్ సీనియర్ ఎస్పీగా పని చేస్తున్నారు. 2017లో తొలిసారిగా రాష్ట్రపతి శౌర్య పతకం అందుకున్నారు. ఆ తర్వాత ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. ఇప్పటివరకు ఆరు సార్లు రాష్ట్రపతి శౌర్య పురస్కారాలు, నాలుగు సార్లు జమ్ముకశ్మీర్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ సహా పలు అవార్డులు అందుకున్నారు.