Share News

Kurnool Collector: సమస్యల పరిష్కారానికి పల్లెకు పోదాం

ABN , Publish Date - Sep 07 , 2025 | 05:28 AM

గ్రామాల్లో సమస్యలు గుర్తించి, సత్వర పరిష్కారమే లక్ష్యంగా కర్నూలు కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా ‘పల్లెకు పోదాం’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Kurnool Collector: సమస్యల పరిష్కారానికి పల్లెకు పోదాం

  • వినూత్న కార్యక్రమానికి కర్నూలు కలెక్టర్‌ రంజిత్‌బాషా శ్రీకారం

  • 79 గ్రామాల్లో ప్రత్యేక అధికారుల ఆకస్మిక పర్యటన

  • వివిధ శాఖల పనితీరుపై సర్వే

కర్నూలు, సెప్టంబరు 6 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో సమస్యలు గుర్తించి, సత్వర పరిష్కారమే లక్ష్యంగా కర్నూలు కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా ‘పల్లెకు పోదాం’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 79 మంది జిల్లా అధికారులను స్పెషల్‌ ఆఫీసర్లుగా ఎంపిక చేశారు. కలెక్టరు పి.రంజిత్‌బాషా సహా ప్రత్యేక అధికారులు, ఆయా శాఖల సిబ్బంది ఎంపిక చేసిన గ్రామాల్లో శనివారం ఆకస్మిక పర్యటన చేపట్టారు. పి.రంజిత్‌బాషా కల్లూరు మండలం పర్ల గ్రామంలో ఈమేరకు పర్యటించారు. తాగునీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌), అంగన్‌వాడీ కేంద్రాలు, ఉపాధి హామీ పథకం అమలు, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్‌, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, పారిశుధ్యం, ఇలా వివిధ శాఖల పని తీరును అధికారుల బృందం పరిశీలించింది. వివిధ శాఖల పనితీరు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, పరిష్కారానికి అవసరమైన నిధులు.. ఇలా సమగ్ర వివరాలతో సర్వే చేసి ఆ వివరాలను ప్రత్యేకంగా తయారు చేయించిన ‘వెబ్‌సైట్‌’లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఆ సమస్యలు శాఖల వారీగా జిల్లా అధికారులకు పంపిస్తారు. ఏ నిధుల కింద ఏ సమస్యలను పరిష్కరించవచ్చో అంచనాలు తయారు చేసి ప్రాధాన్యతా క్రమంలో మండల ప్రత్యేక అధికారుల ద్వారా పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారు. ప్రతి నెలలో ఒక గ్రామానికి ప్రత్యేక అధికారులు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

Updated Date - Sep 07 , 2025 | 05:29 AM