CM Chandrababu: కుప్పానికి పారిశ్రామిక కళ
ABN , Publish Date - Nov 09 , 2025 | 05:13 AM
చిత్తూరు జిల్లా కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
నియోజకవర్గానికి ఏడు పరిశ్రమలు
వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం
కుప్పం, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రూ.2,203.5 కోట్ల పెట్టుబడులతో అక్కడ ఏర్పాటవుతున్న7 పరిశ్రమలకు శనివారం ఆయన అమరావతి నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశా రు. కుప్పంలోని 4 మండలాల పరిధిలో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమలకోసం ప్రభుత్వం 241 ఎకరాల భూమిని కేటాయించింది. డెయిరీ, ల్యాప్‌టాప్, మొబైల్ ఏక్ససరీస్, వంట నూనెల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి రంగాల్లో ఉన్న హిండాల్కో, శ్రీజ డెయిరీ, ఏస్ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్ సోయా, మదర్ డెయిరీ, ఈ రాయిస్, అలీప్ పరిశ్రమలు కుప్పంలో ఏర్పాటు చేయడానికి సీఎం శ్రీకారం చుట్టారు. అంతేకాక రూ.6,339 కోట్ల పెట్టుబడితో కుప్పానికి త్వరలోనే మరో ఎనిమిది పరిశ్రమలు రానున్నాయని, వీటిద్వారా ఏకంగా 43 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం చెప్పారు. కుప్పంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కొందరు అడ్డుపడుతున్నారని, అలాంటి ఆలోచనలు మాని అభివృద్ధికి సహకరించాలని కోరారు. పరిశ్రమల అభివృద్ధికోసం భూములిచ్చిన రైతులను సీఎం అభినందించారు.