AP Police: కుంటిమద్ది హెలిప్యాడ్ కేసులో విచారణ పూర్తి
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:35 AM
శ్రీసత్యసాయి జిల్లా రామగిరి వుండలం కంటిమద్ది హెలిప్యాడ్ కేసులో పోలీసుల విచారణ పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన మాజీ సీఎం జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనలో...
తోపుదుర్తి సహా 85 మంది వైసీపీ నాయకులను విచారించిన పోలీసులు
మరో వారంలో చార్జిషీట్ దాఖలు?
చెన్నేకొత్తపల్లి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా రామగిరి వుండలం కంటిమద్ది హెలిప్యాడ్ కేసులో పోలీసుల విచారణ పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన మాజీ సీఎం జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనలో భాగంగా కుంటిమద్ది హెలిప్యాడ్‌లో దిగారు. ఆ సమయంలో వైసీపీ శ్రేణుల తొక్కిసలాట, హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతినడం, జగన్‌ను వదిలి పైలెట్లు వెళ్లిపోవడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డితోపాటు పలువురు వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 3 నెలలకుపైగా సాగిన విచారణలో ప్రధానంగా కుట్ర కోణంపైనే పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం ఉందని వైసీపీ నాయకులు ఆరోపించడంతో ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియ్‌సగా పరిగణించారు. తక్షణమే విచారణకు ఆదేశించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, పైలెట్ అనిల్‌కుమార్, కో పైలెట్ శ్రేయస్ జైన్‌తోపాటు వైసీపీ నాయకులను విచారించారు. పైలెట్, కోపైలెట్ చెప్పిన అంశాలు అంత నమ్మశక్యంగా లేవని, వైసీపీ నేతలు సూచించిన మేరకే వారు చెప్పి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఈ నేపథ్యంలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విచారణకు సహకరించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఏదో కుట్ర కోణం దాగి ఉందనే భావనతో పోలీసుల విచారణ సాగింది. తోపుదుర్తి సహా మొత్తం 85 మంది వైసీపీ నాయకులను ఈ కేసులో విచారించి, చార్జిషీట్ రూపొందించినట్లు తెలిసింది. హెలిప్యాడ్ ఘటనలో కుట్ర కోణం ఉందని తెలియజేసే అంశాలను చార్జిషీట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. పూర్తి నివేదికతో కూడిన చార్జిషీట్‌ను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి ఆదేశాల మేరకు వారం రోజుల్లో కోర్టులో సమర్పించనున్నట్లు తెలిసింది.