Share News

అన్నదాతకు దన్ను!

ABN , Publish Date - Oct 01 , 2025 | 01:14 AM

ఏటా ప్రకృతి విపత్తులతో పంటను కోల్పోతున్న అన్నదాతకు దన్నుగా నిలిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళికను రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజరు శివరాంప్రసాద్‌, ఉయ్యూరు ఆర్డీవో హేలాషారోన్‌, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు, మిల్లర్లతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులు, వాతావరణం అనుకూలించని సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించుకుందామని నిర్ణయం తీసుకున్నారు.

అన్నదాతకు దన్ను!

- ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళిక

- ఈఏడాది పరిమితిలేకుండా కొనుగోళ్లు

- అత్యవసర పరిస్థితుల్లో ఏ మిల్లుకైనా తరలించే వెసులుబాటు

- ధాన్యం రవాణాకు జీపీఎస్‌ తప్పనిసరి

- తేమశాతం 22 ఉన్నా కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి

- సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో రైతులు, మిల్లర్లు, అధికారుల నిర్ణయం

ఏటా ప్రకృతి విపత్తులతో పంటను కోల్పోతున్న అన్నదాతకు దన్నుగా నిలిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళికను రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజరు శివరాంప్రసాద్‌, ఉయ్యూరు ఆర్డీవో హేలాషారోన్‌, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు, మిల్లర్లతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులు, వాతావరణం అనుకూలించని సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించుకుందామని నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం:

జిల్లా వ్యాప్తంగా 1.61 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. 13 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అఽధికారుల అంచనా. గత కొన్నేళ్లుగా 6.50 లక్షల టన్నుల లోపు రైతుల నుంచి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తూ వచ్చారు. మిగిలిన ధాన్యం రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి మోసపోతున్నారు. ధాన్యం మద్దతు ధరలోనూ ప్రైవేటు వ్యాపారులు కోతపెడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలులో పరిమితులను ఎత్తివేసినట్లు పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ శివరాంప్రసాద్‌ తెలిపారు. రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.

అధికారుల దృష్టికి రైతుల డిమాండ్‌లు

ధాన్యం కొనుగోలు కోసం రైతులకు సకాలంలో గన్నీ బ్యాగులను అందించాలని, యంత్రాల ద్వారా వరికోతలు పూర్తి చేస్తే ధాన్యంలో 22 పాయింట్ల మేర తేమశాతం ఉన్నా ధాన్యం కొనుగోలు చేయాలని, తేమశాతం ఆధారంగా మద్దతు ధరను నిర్ణయించాలని రైతులు ఈ సమావేశంలో కోరారు. రైతు సేవా కేంద్రాల్లో (ఆర్‌ఎస్‌కే) నమోదు చేసే తేమశాతానికి, మిల్లుల వద్ద చూపుతున్న తేమశాతానికి రెండు మూడు పాయింట్లు తేడా వస్తోందని, దీంతో మద్దతు ధరను కోల్పోవాల్సి వస్తోందని, ఆర్‌ఎస్‌కేలలో నిర్ధారించిన తేమశాతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన అధికారులు ఆర్‌ఎస్‌కేలలో, మిల్లుల వద్ద ఒకే కంపెనీకి చెందిన తేమశాతం కొలిచే యంత్రాలను ఉంచుతామని, దీంతో రైతులకు ఇబ్బందులు ఉండవని తెలిపారు. ధాన్యం మిల్లులకు తరలించేందుకు సకాలంలో వాహనాలు సమకూర్చడం లేదని, రైతులు సొంత వాహనాలు ఏర్పాటు చేసుకుని ధాన్యం రవాణా చేసేందుకు అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని, రవాణా చార్జీలు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా విడుదల చేయాలని ఈ సందర్భంగా రైతులు కోరారు. ధాన్యం రవాణాకు సంబంధించి వాహనాలను సమకూర్చడంతో పాటు, ఇప్పటి వరకు పెండింగ్‌లో ధాన్యం రవాణా చార్జీల బకాయిలను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మిల్లర్ల ద్వారా గన్నీ బ్యాగులు ఇచ్చే సమయంలో ధాన్యం కొనుగోలులో మధ్యవర్తులుగా ఉన్నవారు తమకు అనుకూలమైన రైతులకు ముందస్తుగా గన్నీ బ్యాగులు ఇస్తున్నారని, దీంతో అధికశాతం మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతులు తెలిపారు. మిల్లర్లతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి గన్నీ బ్యాగులను అందిస్తామని, ఈ ప్రక్రియపై నిత్యం నిఘా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో పాటు ధాన్యం లోడుతో వచ్చిన లారీలను కాటా వేసే సమయంలో ధాన్యం తూకం ఎంతమేర ఉందో తెలిసేలా మిల్లుల బయట కనపడేలా డిజటల్‌ మీటరును ఏర్పాటు చేయాలని రైతులు కోరారు.

జిల్లా యూనిట్‌గా ధాన్యం కొనుగోలు

యంత్రాల ద్వారా ఒకేసారి పలు ప్రాంతాల్లో కోతలు పూర్తిచేయడంతో ఇబ్బడిముబ్బడిగా ధాన్యం మిల్లులకు వస్తున్నాయని, దీంతో మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం దించుకోవాల్సి వస్తోందని మిల్లర్లు తెలిపారు. వర్షం పడితే మరింతగా ధాన్యం మిల్లులకు చేరుతోందని, తేమశాతం అధికంగా ఉన్న ధాన్యం ఒకేసారి మిల్లుకు వస్తే డ్రయ్యర్‌ సామర్థ్యం సరిపోక తాము నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసరస్థితిలో ధాన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తే ఆయా గ్రామాల్లోని ధాన్యం జిల్లాలోని ఏ మిల్లుకైనా విక్రయించేలా అనుమతులు ఇస్తామని, అవసరమైతే ఇతర జిల్లాలోని మిల్లులకు ధాన్యం పంపుతామని అధికారులు చెప్పారు. తేమశాతం అధికంగా ఉన్న ధాన్యం మిల్లులో నిల్వ ఉంచితే తాము నష్ట్టపోతున్నామని మిల్లర్లు తెలపగా, ధాన్యం మరపట్టే సమయంలో వచ్చే తౌడు, నూకలు, ఊక తదితరాల లెక్కలు మిల్లర్లు చెప్పడంలేదని, మిల్లులకు నష్టం రాదని, ఈ సాకుతో రైతులను ఇబ్బందులపాలు చేయవద్దని రైతులు కోరారు. ధాన్యంలో నాణ్యత నిర్ణయించేందుకు వ్యవసాయశాఖ అధికారులకు అధికారాలు ఇవ్వాలని, గతంలో ఈ పద్ధతి అమలులో ఉండేదని రైతులు తెలిపారు. మినీ మిల్లింగ్‌ మిషన్‌లను అందుబాటులో ఉంచితే, అక్కడే ధాన్యంలో నాణ్యత తెలుస్తుందని చెప్పారు. మిల్లర్లు, రైతులకు ఇబ్బంది లేకుండా సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకుందామని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Updated Date - Oct 01 , 2025 | 01:14 AM