KTR: రేవంత్‌రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటా
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:24 AM
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సీఎం కాలు ఒకటి కాంగ్రెస్‌లో.. మరొకటి బీజేపీలో ఉంది
రేవంత్, రాహుల్ ఐరన్‌లెగ్‌లు
దమ్ముంటే పార్టీమారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకెళ్లాలి
మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్‌రెడ్డి ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటారో నాకు తెలియదు. కానీ, నేను మాత్రం ఆయనను ఫుట్‌బాల్ ఆడుకుంటాను’’ అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. రేవంత్‌లా కుటుంబ సభ్యుల విషయంలో తాను చిల్లర రాజకీయాలు చేయనని అన్నారు. కాంగ్రెస్ సర్కారుకు హనీమూన్ పీరియడ్ ముగిసిందన్నారు. కేసీఆర్ త్వరలోనే ప్రజల్లోకి వస్తారని, తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగే కీలక సమావేశంలో బీఆర్‌ఎస్ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. 2028 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఢిల్లీలో రేవంత్‌రెడ్డి విందులు, వినోదాలు ఎవరి ఇళ్లల్లో జరుగుతున్నాయో తమకు తెలుసునన్నారు. బీజేపీ ఎంపీ దూబే గృహప్రవేశానికి సీఎం ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రేవంత్ ఇంటిని రీమోడల్ చేయించింది బీజేపీ ఎంపీయేనని, సీఎం రమేశ్‌కు కాంట్రాక్టులు ఇస్తుందే ముఖ్యమంత్రి అని ఆరోపించారు. అఖిలేశ్‌యాదవ్ తమ పాత మిత్రుడని, ఆయన ఫ్రెండ్లీగా ఉంటే బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావుకు బాధ ఎందుకని ప్రశ్నించారు. తాను ఐరన్ లెగ్ కాదని, రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీలే రాష్ట్రానికి ఐరన్‌లెగ్‌లు అని, వారి వల్ల పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. విరూపాక్ష వంటి కంపెనీలు కర్నూలుకు వెళ్లడం రేవంత్ ప్రభుత్వ చేతగానితనమేనన్నారు. కాగా, వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులతో కేటీఆర్ శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సర్పంచులకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఎవరూ హరించలేరన్నారు. పంచాయతీ ఎన్నికల దెబ్బకు ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలను ఇప్పడు నిర్వహించలేరని అన్నారు.
వారితో రాజీనామా చేయించే దమ్ముందా?
పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము అభివృద్ధి కోసం మారామంటూ మైక్‌లో స్పష్టంగా చెప్పారని కేటీఆర్ అన్నారు. వారు ఆధారాలతో సహా దొరికిపోయారని తెలిపారు. దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ చేశారు. వారితో రాజీనామా చేయించే దమ్ము రేవంత్‌రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాను ఫెయిల్ కాలేదని, 32 జిల్లా పరిషత్తులు, 136 మునిసిపాలిటీలను గెలుచుకున్నామని తెలిపారు. కానీ, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉనప్పుడు ఏడు చోట్ల ఉప ఎన్నికలు జరిగితే అన్నింట్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీలో మునిసిపాలిటీల విలీనం సక్రమంగా జరగలేదన్నారు. ఇక రాష్ట్రంలో ఎరువుల కొరతను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం యూరియా యాప్ నాటకాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. రైతులు క్యూ లైన్లలో నిలబడే దృశ్యాలు బయటి ప్రపంచానికి కనిపించకూడదనే ఈ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఎరువుల కోసం రైతులు ఎన్నడూ ఇబ్బంది పడలేదన్నారు.