కృష్ణమ్మ పరవళ్లు
ABN , Publish Date - Sep 29 , 2025 | 01:20 AM
ఎగువ నుంచి కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి ప్రకాశం బ్యారేజీ నుంచి 6.39 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సోమవారం నాటికి వరద ఏడు లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని జలవనరులశాఖ ఈఈ రావెళ్ల రవికిరణ్ తెలిపారు.
- ప్రకాశం బ్యారేజీ నుంచి 6.39 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
- కడలివైపు పరుగులు తీస్తున్న వరద
- పులిగడ్డ ఆక్విడెక్ట్ గ్రిల్స్ తొలగింపు
- లంక గ్రామాలు, పంట పొలాల్లోకి చేరుతున్న నీరు
- నేటి ఉదయానికి 7 లక్షల క్యూసెకుల వరకు పెరిగే అవకాశం
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
ఎగువ నుంచి కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి ప్రకాశం బ్యారేజీ నుంచి 6.39 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సోమవారం నాటికి వరద ఏడు లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని జలవనరులశాఖ ఈఈ రావెళ్ల రవికిరణ్ తెలిపారు. వరద ఉధృతి పెరగడంతో పులిగడ్డ ఆక్విడెక్ట్‌కు ఉన్న గ్రిల్స్‌ను తొలగించారు. అర్ధరాత్రి సమయానికి వరదనీరు మరింతగా దిగువకు విడుదల చేయనున్నారనే హెచ్చరికలతో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ విభాగం అధికారులు కృష్ణానది పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
గ్రామాల్లోకి వరద నీరు
కృష్ణానదిలో వరద ప్రవాహం ఆదివారం మధ్యాహ్నం నుంచి క్రమంగా పెరుగుతోంది. మోపిదేవి మండలం కే.కొత్తపాలెం, బొబ్బర్లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. చల్లపల్లి మండలం నడకుదురు తదితర గ్రామాల పరిధిలోని కరకట్ట వెంబడి ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాల్లోని నీరు చేరింది. పసుపు, కంద తోటలు మునిగాయి. సోమవారం ఉదయం నాటికి కృష్ణానదిలో నీటి ప్రవాహం మరో అడుగు మేర పెరిగే అవకాశం ఉందని అధికారులు, స్థానిక రైతులు చెబుతున్నారు. వరద ఉధృతి కారణంగా నాగాయలంక మండలంలోని ఎదురుమొండి తదితర గ్రామాల వద్ద కృష్ణానది ప్రమాదకరస్థితిలో పొంగి ప్రవహిస్తోంది. అవనిగడ్డ సమీపంలో కృష్ణానదిలో ఉన్న యడ్లంక గ్రామం వరద నీటి ఉధృతి కారణంగా కోతకు గురవుతోంది. గృహాల పక్క నుంచి వరద ప్రవహిస్తుండంతోపాటు భూమి కోతకు గురవుతుండటంతో ఇళ్లు కొట్టుకుపోతాయనే భయం స్థానికులను వెంటాడుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ నెల 24వ తేదీ నుంచి సముద్రంలోకి 3.19 లక్షల క్యూసెక్కుల నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. కృష్ణానదికి ఉపనదులుగా ఉన్న మూసీ, వజినేరు, మునేరులతోపాటు నాగార్జున సాగర్ నుంచి వరదనీటిని వదులుతుండటంతో రానున్న రెండు, మూడు రోజులపాటు వరద ఉధృతి మరింతగా కొనసాగుతుందని జలవనరులశాఖ అధికారుల అంచనా వేస్తున్నారు. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో నెంబరు ప్రమాదహెచ్చరిక జారీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.