కృష్ణమ్మ ఉగ్రరూపం
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:48 AM
కృష్ణానదికి సోమవారం వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు 6.84 లక్షల క్యూసెక్కుల విడుదల చేయడంతో లంక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. పసుపు, కంద, అరటి, కూరగాయ తోటలు నీట మునిగాయి. పులిగడ్డ ఆక్విడెక్ట్‌పై నుంచి ప్రవాహం కడలి వైపు పరుగులు తీస్తోంది. అప్రమత్తమైన కలెక్టర్ బాలాజీ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
- ప్రకాశం బ్యారేజీ నుంచి 6.84 లక్షల క్యూసెక్కుల విడుదల
- పులిగడ్డ ఆక్విడెక్ట్‌పై నుంచి ప్రవహిస్తున్న వరద
- లంక గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న నీరు
- ముంపు భారీన పంట పొలాలు
- పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు
- క్షేత్రస్థాయిలో పర్యటించి అప్రమత్తం చేస్తున్న కలెక్టర్ బాలాజీ
కృష్ణానదికి సోమవారం వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు 6.84 లక్షల క్యూసెక్కుల విడుదల చేయడంతో లంక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. పసుపు, కంద, అరటి, కూరగాయ తోటలు నీట మునిగాయి. పులిగడ్డ ఆక్విడెక్ట్‌పై నుంచి ప్రవాహం కడలి వైపు పరుగులు తీస్తోంది. అప్రమత్తమైన కలెక్టర్ బాలాజీ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం/అవనిగడ్డ/చల్లపల్లి/మోపిదేవి/నాగాయలంక:
ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి వరద భారీగా రావడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి 6.84 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో వరద ప్రవాహం సోమవారం తెల్లవారుజాము నుంచి మరింత పెరిగింది. పులిగడ్డ ఆక్విడెక్ట్ నీటమునిగింది. పులిగడ్డ ఆక్విడెక్ట్‌పై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ఇరిగేషన్ అధికారులు ఆక్విడెక్ట్ వద్ద ఇనుప గడ్డర్లను తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టారు. మోపిదేవి మండలం కే.కొత్తపాలెం, బొబ్బర్లంక, మోపిదేవి వార్ఫు తదితర గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఈ గ్రామాల్లో కరకట్టకు, నదికి మధ్యన ఉన్న పొలాల్లో సాగు చేసిన కంద, పసుపు, అరటి, పూలు, కూరగాయల తోటలు మునిగాయి. కే.కొత్తపాలెంలో పాఠశాలలో పునరావాస శిబిరం ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చల్లపల్లి మండలం నడకుదురు, రాముడుపాలెం, ఆముదార్లంక, లచ్చిగానిలంక, తదితర గ్రామాల పరిధిలోని కరకట్ట వెంబడి ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని పసుపు, కంద, అరటి తోటల్లోకి వరద నీరు చేరింది. వరద ఉధృతి కారణంగా నాగాయలంక మండలం చినకరకట్ట పక్కనే ఉన్న గ్రామంలోకి నీరు ప్రవేశించింది. ఎదురుమొండి తదితర గ్రామాల వద్ద కృష్ణానది ప్రమాదకరస్థితిలో ప్రవహిస్తోంది.
నదిలో కలిసిపోయిన మరో ఇల్లు
కృష్ణానది వరదలతో కోతకు గురవుతున్న అవనిగడ్డ మండలం ఎడ్లంక దీవిలో మరో ఇల్లు నదిలో కలిసిపోయింది. గడచిన ఆరు సంవత్సరాలుగా కృష్ణానదిలో మార్పులు, చేర్పులతో ఎడ్లంక దీవిలో ప్రమాదకర స్థితిలో నది ప్రవహిస్తోంది. ఇప్పటికే 15 ఇళ్లు నదిలో కలిసిపోగా, ఎడ్లంక దీవి చుట్టూ దాదాపు 100 మీటర్ల లోపల వరకు పంట పొలాలు నదిలో మునిగిపోయాయి. పులిగడ్డ పల్లెపాలెం, సీతాలంక తదితర గ్రామాల్లోని పంట పొలాల్లోకి వదర నీరు వచ్చి చేరింది. సోమవారం మఽధ్యాహ్నం సమయంలో వరద ఉధృతి కొంతమేర తగ్గిందని, రానున్న మూడు రోజులపాటు వరద ఉధృతి ఆరు లక్షల క్యూసెక్కులకు తగ్గకుండా కొనసాగుతుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు
కృష్ణానదికి వరద హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ బాలాజీ సోమవారం మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో పర్యటించారు. తొలుత పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఆయన వరద ఉధృతిపై జలవనరులశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బొబ్బర్లంక, కే.కొత్తపాలెం గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించగా, ఆయా గ్రామాలను కలెక్టర్ పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ నుంచి 6.84 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే లంక గ్రామాల్లోని 101 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. తోట్లవల్లూరు మండలంలోని లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 22 బోట్‌లను సిద్ధం చేశామన్నారు. మోపిదేవి, పెనమలూరు, నాగాయలంక మండలాల్లో ఏడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వరద ఉధృతి కొన్ని రోజులపాటు కొనసాగే అవకాశం ఉండటంతో నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని అధికారులను కలెక్టర్ ఆదే శించారు. ముంపునకు గురైన పసుపు, కంద, అరటి తోటల్లో పంటనష్టం అంచనాలను తయారు చేయాలని ఉద్యానశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
- పులిగడ్డ పల్లెపాలెం ప్రాంతంలోకి వరదనీరు రావటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు సూచించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ పులిగడ్డ, రేగుల్లంక ప్రాంతాలను సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు.
- చల్లపల్లి మండల పరిధిలోని నడకుదురులో వరద ప్రవాహ పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్ బాలాజీ తహసీల్దార్ డి.వనజాక్షితో మాట్లాడి తగు సూచనలు చేశారు. జలవనరులశాఖ కేసీ డివిజన్ ఈఈ రవికిరణ్, ఉద్యాన శాఖ అధికారులు కీర్తిదేవ్, రమేష్, ఏవో కె.మురళీకృష్ణ పాల్గొన్నారు.
- చల్లపల్లి మండలం నడకుదురు, రాముడుపాలెం, నిమ్మగడ్డ, ఆముదార్లంక ప్రాంతాల్లో రేవులోకి ఎవరూ వెళ్లకుండా అడ్డుగా తాటిబొండులు, ముళ్లకంప వేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.
- నాగాయలంకలోని చిన కరకట్ట కింద ఉన్న గృహాలు, రొయ్యల కంపెనీలు, చేపల కంపెనీలు, కోళ్ల ఫారాలు చుట్టూ వరదనీరు చేరింది.
నీట మునిగిన పంటలు
తోట్లవల్లూరు : తోట్లవల్లూరు మండలంలోని లంకల్లో సోమవారం వరద తీవ్రతకు వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కంద, అరటి, పసుపు, ఇతర కూరగాయ తోటలు వరదకు మునగటంతో రైతులు కలవరం చెందుతున్నారు. కాగా ఎనిమిది లంక గ్రామాల ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. 3,500 మంది ప్రజలు ఎనిమిది లంక గ్రామాల్లో నివసిస్తున్నారు. ఇప్పటి వరకు లంక గ్రామాల్లోకి వరద చేరలేదని తహసీల్దార్ ఎం.కుసుమకుమారి తెలిపారు. తమ సిబ్బందిని అప్రమత్తం చేసి అవసరమైతే లంక గ్రామాల ప్రజలను బయటకు తీసు కొచ్చేందుకు పడవనలు కూడా సిద్ధంగా ఉంచామన్నారు.